బాబాయ్ తో సినిమా చేస్తా: రామ్ చరణ్ తేజ్
posted on Jul 10, 2015 2:20PM
.jpg)
ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ ఈ రోజు హైదరాబాద్ లో తను భాగస్వామిగా ఉన్న ట్రూ జెట్ విమాన సర్వీసులను ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14 నుండి ప్రారంభం అయ్యే పుష్కరాలకు ట్రూ జెట్ ప్రత్యెక సర్వీసులు నడిపిస్తుందని తెలిపారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడిచే ఈ విమాన సర్వీసులు మొదటి దశలో చెన్నై, ఔరంగాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, మంగుళూరు మొదలయిన ప్రాంతాలకు ఆరంభిస్తామని తరువాత క్రమంగా దేశంలో ప్రధమ, ద్వితీయ స్థాయి నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని ఆయన చెప్పారు.
తన తండ్రి చిరంజీవి చేయబోయే 150వ చిత్రం గురించి కూడా విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. ఆ సినిమాని తనే నిర్మించబోతున్నానని దానికి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారని అందులో ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. ఇంతవరకు ఆ సినిమా ఫస్ట్-ఆఫ్ పై కధా చర్చలు పూర్తయ్యాయని సెకండ్ ఆఫ్ పై చర్చిస్తున్నారని తెలిపారు. ఇక మరో ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే గబ్బర్ సింగ్-2 షూటింగ్ పూర్తయిన తరువాత, తను బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన్నప్పటి నుండి చిరంజీవి-పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది. మళ్ళీ చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేసేందుకు అంగీకరించడం చూస్తే మళ్ళీ మెగా కుటుంబం దగ్గరవుతున్నట్లుంది. అదే నిజమయితే అందరి కంటే ఎక్కువగా వారి అభిమానులే సంతోషిస్తారని చెప్పవచ్చును.