ప్రత్తిపాటి పుల్లారావు కాదు పొగాకు పుల్లారావు
posted on Jan 20, 2017 2:13PM

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కొత్త పేరు పెట్టారా అని మీరు అనుకోవద్దు. అసలు మ్యాటరేంటంటే విజయవాడలో జరిగిన టుబాకో రైతుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. మాగంటి బాబు మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే కనుక మంత్రి గారిని పొగాకు పుల్లారావుగా పిలుచుకుంటామని అనడంతో వేదిక మీద ఉన్నవారితో పాటు అందరూ నవ్వులు చిందించారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రత్తిపాటి, తానూ పొగాకు పండించిన రైతునేనని, పొగాకు రైతుల సమస్యలు తనకు తెలుసునని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.