పట్టిసీమపై జగన్ వాదనే నిజమైందా? బాబు మాట ఏమైంది?

పనులు పూర్తికాకుండానే పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన చంద్రబాబు, అదే తరహాలో ప్రాజెక్టులను కూడా ప్రారంభించేశారు. పనుల్లో నాణ్యత లేదంటూ ఒకవైపు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా లెక్కచేయకుండా నదుల అనుసంధానం పేరుతో హడావిడిగా పట్టిసీమ నీటిని కృష్ణా రివర్ కి తరలించాలని ప్రయత్నించారు, అయితే ఆ నీళ్లు కృష్ణానదికి చేరకుండానే జానంపేట అక్విడెక్ట్ దగ్గర గండిపడటంతో దారి మళ్లాయి. దాంతో రాయలసీమకు నీళ్ల సంగతి అటుంచితే, చంద్రబాబు మాటను నమ్మి నారుమళ్లు చేసుకున్న కృష్ణా డెల్టా రైతులు కూడా లబోదిబోమనాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే రికార్డు టైమ్ లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు మాటను మాత్రం అధికారులు నిలబెట్టలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి, చంద్రబాబు ఎంతో గొప్ప లక్ష్యంతో పట్టిసీమను చేపడితే, ఆయన అంచనాలను ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అందుకోలేక పోయిందంటున్నారు, ఇలాంటి ప్రాజెక్టులను చైనా లాంటి దేశాల్లో నెలరోజుల్లోనే నిర్మించే పరిస్థితి ఉన్నా, మనదేశంలో అదీ ఆంధ్రప్రదేశ్ లో నాలుగైదు నెలల్లోనే నిర్మించడమంటే ఓ రికార్డేనని, కానీ పనుల్లో నాణ్యత లోపించిందని నిపుణులు అంటున్నారు. పైగా పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించే సమయానికి పంపింగ్ లేకపోవడం, హడావిడిగా హంద్రీనీవా మోటార్ ను తీసుకురావడం చూస్తుంటే...అధికారుల వైఫల్యం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తోందంటున్నారు

గోదావరి, కృష్ణానదుల అనుసంధానం మాట అటుంచితే, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి కూడా సరిగా నీరివ్వలేని పరిస్థితి ఉందని, అలాంటప్పుడు రాయలసీమకు కచ్చితంగా నీరిస్తామన్న బాబు హామీ ఎలా నెరవేరుతుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, పట్టిసీమ నీటిని సీమకు తరలించాలంటే ముందు శ్రీశైలం రిజార్వాయర్లో మినిమం వాటర్ లెవల్ మెయింటెన్ చేయాలని, కానీ అక్కడ పవర్ జనరేషన్ చేయడంతో నీటిమట్టం పడిపోయిందని, దాంతో రాయలసీమకు నీళ్లిచ్చే ఛాన్సే లేదంటున్నారు. విద్యుదుత్పత్తితో ఇప్పటికే 2వేల క్యూసెక్కుల నీటికి కిందికి వదిలేసినట్లు రికార్డులు చెబుతున్నాయి

పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని తరలించినా, శ్రీశైలం దగ్గర దానికి కావాల్సినంత నీటిమట్టం ఉండాలని గుర్తించిన చంద్రబాబు... పవర్ జనరేషన్ నిలిపివేయాలని విద్యుత్ శాఖకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. కనీసం ఇప్పుడైనా శ్రీశైలంలో వాటర్ లెవల్ మెయింటెన్ చేస్తేనే పట్టిసీమ లక్ష్యం నెరవేరుతుందని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లోని సీనియర్ అఫీషియల్స్ సూచిస్తున్నారు.