పాలకుర్తి సాక్షిగా బ్లాస్ట్ అయిన రేవంత్, ఎర్రబెల్లి విభేదాలు

రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఆధిపత్య పోరు ఎప్పట్నుంచో జరుగుతున్నా....అది అంతర్గతంగానే సాగింది తప్పా...ఎప్పుడూ బహిరంగంగా బయటపెట్టుకోలేదు, పైగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో లోలోన సంతోషపడినా, దాన్ని బయటపడనీయకుండా జైలుకెళ్లిమరీ రేవంత్ ను పరామర్శించి ఎర్రబెల్లి తన పెద్దరికాన్ని చూపారు, అయితే ఇటీవల జరిగిన పాలకుర్తి ఎపిసోడ్ లో ఎర్రబెల్లి అరెస్టై జైలుకెళ్లినా కనీసం పరామర్శించడానికి కూడా రేవంత్ ఇష్టపడలేదట, దాంతో ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలంగాణ టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

పాలకుర్తి గొడవ, ఎర్రబెల్లి అరెస్ట్ ఇష్యూపై రేవంత్ కనీసం స్పందించకపోవడం, పైగా ఎర్రబెల్లిని పరామర్శించడానికి వరంగల్ వెళ్లకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది, మోత్కుపల్లి, రమణ లాంటి సీనియర్ లీడర్లంతా ఎర్రబెల్లిని పరామర్శించడానికి వరంగల్ వెళ్లినా, రేవంత్ మాత్రం ఇటీవల కన్నుమూసిన తన సోదరుడి మరణాన్ని సాకుగా చూపి తప్పించుకున్నారట, కనీసం ఘటననైనా ఖండించాలని కోరినా రేవంత్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దాంతో వీరిద్దరి మధ్యా విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఇక బ్లాస్ట్ కావడమే మిగులుందని చెప్పుకుంటున్నారు.

అయితే రేవంత్ తో ఎన్ని విభేదాలున్నా... ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలుకెళ్లినప్పుడు ఎర్రబెల్లి ఐదు గంటలపాటు ఆందోళన చేశారని, అలాగే జైలుకెళ్లి పరామర్శించి హుందాతనాన్ని చాటుకున్నారని, కానీ రేవంత్ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించి పార్టీ కేడర్ కు తప్పుడు సంకేతాలు పంపారని సీనియర్లు మండిపడుతున్నారు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రేవంత్ కి ఇది మంచి పద్ధతి కాదని, అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఐక్యంగా పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరముందంటున్నారు. చివరికి మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీశైలం బాధితులతో ఎర్రబెల్లి నిర్వహించిన ధర్నాకు కూడా రేవంత్ వెళ్లలేదని, ఎర్రబెల్లిపై కోపంతో సొంత జిల్లా రైతుల దగ్గరకు కూడా వెళ్లకపోవడం రాంగ్ సిగ్సల్స్ పంపిందని విమర్శిస్తున్నారు.

అయితే తాజా విభేదాలకు రేవంత్ కి టీటీడీపీ పగ్గాలు దక్కకపోవడమే కారణమని చెప్పుకుంటున్నారు, తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఆశించిన రేవంత్ కి అది దక్కకుండా ఎర్రబెల్లి కథ నడిపించారని, చంద్రబాబుపై ఒత్తిడి పెంచి మళ్లీ రమణకే అధ్యక్ష పదవి దక్కేలా చేశారని...అదే వీరిద్దరి మధ్య మరింత దూరం పెంచిందని అంటున్నారు.