ఉపస్యసించడం ఒక కళ

 

నలుగురి ముందరా అనర్గళంగా ఉపన్యసించాలని ఎవరికి మాత్రం ఉండదు! కాకపోతే అంతమందిని చూడగానే భయపడిపోయేవారు కొందరైతే, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక తికమకపడిపోయేవారు కొందరు. ఉపస్యసించడం అనే కళ ఒక్క రోజులో అబ్బేదీ కాదు. అందరికీ సులువుగా చిక్కేదీ కాదు. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఎలా మసులుకోవాలో తెలియచేసే కొన్ని సూచనలు మాత్రం తప్పకుండా ఉపయోగపడతాయి. అవేమిటంటే...

 

బెంబేలు పడిపోవద్దు!

ఎదురుగుండా జనాలని చూసి ఒక్కసారిగా కంగారుపడిపోద్దు. వాళ్లు కూడా మనలాంటి మనుషులే కదా! ఇలాంటి సందర్భాలలో మైక్‌తో పాటుగా చిన్న పోడియం ఉండేలా జాగ్రత్తపడితే, మన ఉద్వేగాన్ని కప్పిపుచ్చుకొనే ఆసరాగా ఉంటుంది. పైగా జనం వంక నేరుగా కాకుండా వారి తలల మీదుగా చూడటం లేదా వారిలో మనకు పరిచయం ఉన్నవారిని చూస్తూ మాట్లాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుందంటారు.

 

బట్టీపట్టవద్దు

చాలామంది ఓ పేద్ద ఉపన్యాస వ్యాసాన్ని బట్టీ పట్టుకుని వెళ్తారు. సహజంగానే ఆ కంగారులో మన మెదలోంచి సదరు వ్యాసం ఎగిరిపోతుంది. ఒకవేళ పోడియం దగ్గరే నిల్చొని దాన్ని చూస్తూ చదివినా కూడా శ్రోతలకు మీ ఉపన్యాసం కృత్రిమంగా తోస్తుంది. కాబట్టి ఏదో సన్మాన పత్రాలు, ఓట్‌ ఆఫ్‌ థాంక్స్ వంటి సందర్భాలలో తప్ప బట్టీపట్టుకుని అప్పచెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. దానికంటే ఏఏ అంశం మీద మాట్లాడాలనుకుంటున్నారో ఒక జాబితా/ సినాప్సిస్ ఉంటే సరిపోతుంది.

 

విసిగించే ఉపన్యాసం

ఆసక్తికరంగా సాగకపోతే ఏ అంశమైన శ్రోతలను విసిగిస్తుంది. అందుకే సరదాగా సాగుతూనే మీ అభిప్రాయాలు శ్రోతలకు అందించేలా మెలకువ పాటించండి. మీరు ఎంచుకున్న అంశం ఎలాంటిది, దాని మీద వీలైనంత పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ఎలా, మీ ఉపన్యాసాన్ని వినేందుకు వచ్చే శ్రోతలు ఎవరు... వంటి విషయాల మీద మీ మాటలు ఆధారపడి ఉంటాయి.

 

స్పందన- ప్రతిస్పందన

ఒక రోబోలా నిల్చొని గంభీరంగా ఉపన్యసిస్తే వాతావరణం కూడా అంతే బిగుసుకుని ఉండిపోతుంది. అందుకే మీ హావభావాలను ప్రదర్శించండి. ప్రేక్షకులను కూడా కదిలించే ప్రయత్నించండి. వారు మీ మాటలతో ఏకీభవిస్తున్నారో లేదో కనుక్కోవడం, నవ్వించడం, స్తబ్దుగా ఉన్నవారిని కూడా మాటలతో కదిలించడం... చేయండి.

 

సమయం- సందర్భం

ఉపన్యసించే అవకాశం వచ్చింది కదా అని చాలామంది తమ గురించి గొప్పలు చెప్పుకోవడంలో మునిగిపోతారు. వినేవారు దొరికారు కదా అని ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. మైక్‌ ఉంది కదా అని సమయాన్ని పట్టించుకోరు. శ్రోతల చిరాకునీ, తోటి ఉపన్యాసకుల అసహనాన్నీ గమనించరు. ఫలితం! మనసులో ఉన్నదంతా చెప్పేశామన్న తృప్తి వారికి ఉండవచ్చుగానీ.... వినేవారి దృష్టిలో ఒక విసిగించే వ్యక్తిగా మిగిలిపోతారు. అందుకే సమయాన్ని గమనించుకుంటూ శ్రోతలకు ఏది ఉపయోగమో, ఏది ఆసక్తికరమో దాన్ని చెప్పేందుకు ప్రయత్నించాలి. ఇంతేకాకుండా ఉపన్యసించే ముందు రోజుల్లో అద్దం ముందర నిల్చొని అభ్యాసం చేయడం, మైక్‌లో మన గొంతుక ఎలా వినిపిస్తుందో రికార్డు చేసుకొని వినడం... వంటి చిట్కాలు తప్పకుండా ఉపయోగపడతాయి.

 

- నిర్జర.