సర్దార్‌కి సెల్యూట్... నెహ్రూ ఫ్యామిలీకి చెక్...
posted on Nov 1, 2014 12:04PM

భారత ప్రధాని నరేంద్రమోడీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలందరి భాగస్వామ్యంతో విజయాలు సాధిస్తున్నాయి. మొన్నీమధ్య ఆయన గాంధీజీ స్ఫూర్తితో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రతిస్పందన లభిస్తోంది. ఆ కార్యక్రమం ఇక నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగుతుందన్న నమ్మకం బలంగా ఏర్పడింది. అలాగే ఇప్పుడు మోడీ చేపట్టిన మరో కార్యక్రమం దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అది ముక్కలు చెక్కలుగా వున్న భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా నిర్వహించడం, ఈ సందర్భంగా ప్రజలతో కలసిపోయి సమైక్యతా పరుగు, సమైక్యతా ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను నిర్వహించడం! ప్రధాని నరేంద్రమోడీ సర్దార్ పటేల్ జయంతిని ఇంత భారీగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం వెనుక దేశంకోసం జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ పటేల్‌కి సరైన రీతిలో నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా, ఇంతకాలం దేశం నెత్తిన గుదిబండలా కూర్చున్న నెహ్రూ కుటుంబానికి చెక్ పెట్టే ఉద్దేశం వుందని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ప్రధానమంత్రి హోదాలో నాయకత్వం వహించే అంశంలో పటేల్, నెహ్రూ మధ్య నెలకొన్నపోటీ, ఆ పోటీలో నెహ్రూ ‘తెలివిగా’ సాధించిన విజయం అందరికీ తెలిసిందే. దేశంలో ముక్కలు చెక్కలుగా వున్న సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించడంలో హోంమంత్రి హోదాలో సర్దార్ పటేల్ చేసిన కృషి అనితరసాధ్యమైనది. నెహ్రూ కాకుండా పటేల్ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయితే భారతదేశం ఇప్పుడు మరోలా వుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుంటాయి. సాహసి, దార్శనీకుడు, నిస్వార్థపరుడు అయిన పటేల్ ప్రధానమంత్రి కాకపోవడం ఈ దేశ దురదృష్టాల్లో ఒకటన్న అభిప్రాయం కూడా వుంది. నెహ్రూ కూడా గొప్ప నాయకుడే... కానీ ఆయన వారసత్వం మాత్రం దేశాన్ని అధోగతిపాలు చేసింది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత అభివృద్ధిలోకి వెళ్ళాల్సిన దేశం తిరోగమన దిశగా పయనించడానికి నెహ్రూ కుటుంబం ప్రధాన కారణమన్న అభిప్రాయాలూ వున్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూకంటే మిన్నగా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి ఆ తర్వాత నెహ్రూ కుటుంబ పాలనలో సరైన గుర్తింపు లభించలేదు. దానికి కారణం ప్రధాని పదవి విషయంలో నెహ్రూతో పటేల్ పోటీపడటమేననేది బహిరంగ రహస్యమే. ఈ రాజకీయ కారణంతోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వున్న ఇంతకాలం పటేల్‌కి సరైన రీతిలో నివాళులు అర్పించలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమంలోనయినా దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన నెహ్రూ కుటుంబం పేర్లు వినిపిస్తాయే తప్ప, దేశంకోసం సర్వస్వం అర్పించిన పటేల్ లాంటి నాయకుల పేర్లు ఏనాడూ వినిపించలేదు. ఆ పొరపాటును దిద్దే పనిని ఇప్పుడు మోడీ చేయడం అభినందనీయం.
ఇప్పుడు దేశం నెత్తిన కాంగ్రెస్ పార్టీ రూపంలో నెహ్రూ కుటుంబ గుదిబండ వుంది. దీనిని క్రమంగా తొలగించే పనిని మోడీ చేపట్టినట్టు కనిపిస్తోంది. మోడీ ఒక వైపు మహాత్మాగాంధీని, మరోవైపు సర్దార్ పటేల్‌ని స్ఫూర్తిగా తీసుకుంటూ వీరిద్దరూ దేశంకోసం సమంగా పోరాడిన నాయకులని అంటున్నారు. గాంధీజీ, పటేల్ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు అసంపూర్ణంగా వుండేవారని మోడీ చెబుతున్నారు. అంతే తప్ప ఆయన ఏ సందర్భంలోనూ నెహ్రూ పేరును ప్రస్తావించిన దాఖలాలు లేవు. అక్టోబర్ 31వ తేదీన పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారే తప్ప, నెహ్రూ కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో మోడీ పాల్గొనలేదు. ఇది దేశానికి పట్టిన నెహ్రూ కుటుంబ జాడ్యాన్ని క్రమక్రమంగా తొలగించే బృహత్తర కార్యక్రమంలో మొదటి అడుగుగా భావించవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు. నెహ్రూ దగ్గర మొదలుపెట్టి.. ఇందిర.. రాజీవ్.. సోనియా... రాహుల్... ఇలా క్రమక్రమంగా నాసిరకంగా మారుతున్న నెహ్రూ కుటుంబ వారసత్వ చెర నుంచి దేశాన్ని కాపాడే ఉద్దేశంతో మోడీ వున్నారని పరిశీలకులు అంటున్నారు.