పెరిగిన రాష్ట్ర ఆదాయం, ఖర్చుపై నియంత్రణకు కృషి

 

రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా బాగా దెబ్బతింది. ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం ఇప్పుడప్పుడే కోలుకోలేదని చాలా మంది ఆందోళన చెందారు. కానీ అదృష్టవశాత్తు రాష్ట్రం త్వరగానే కోలుకొంటున్న సూచనలు కనబడుతున్నాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సమావేశమయిన వివిదశాఖాల ఉన్నతాధికారులు, గత సంవత్సరంతో పోలిస్తే తమ తమ శాఖల ఆదాయం ఆశించిన దానికంటే బాగానే పెరిగిందని చెప్పారు.

 

గత సం.తో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో ఎక్సైజ్ శాఖ ఆదాయంలో-85శాతం వృద్ధి కనబడగా, కమర్షియల్ టాక్స్-93శాతం, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్-85శాతం, రెవిన్యూ- 115.6శాతం, రవాణా-78శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. మొత్తం మీద ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో అన్ని శాఖల ఆదాయం కలిపి రూ.12, 881 కోట్లు వచ్చిందని, గత సం. ఇదే కాలానికి రూ.11,313కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఏడాదిలో ఇంతవరకు 17.6 శాతం వృద్ధి కనబడిందని వారు తెలిపారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారినందరినీ అభినందిస్తూనే, రాష్ట్ర ఆర్దికపరిస్థితి పూర్తిగా కుదుటపడేవరకు అందరూ తమ తమ శాఖలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను చాలా పొదుపుగా వాడుకోవాలని, అదేవిధంగా బడ్జెట్ లోటు మరింత పెరగకుండా ఖర్చుల మీద పూర్తి నియంత్రణ సాధించాలని కోరారు. వృదాఖర్చులను అరికట్టి ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఇదివరకు మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ‘ఎకనామిక్ ఇంటలిజెన్స్’ పద్దతిని మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నించమని ఆయన కోరారు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సయిజ్ పాలసీనే రాష్ట్రంలో అమలు చేయడానికి అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించమని ఆయన ఎక్సయిజ్ అధికారులను కోరారు. రవాణాశాఖ తన ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు మరింత కృషి చేయాలని ఆయన కోరారు.

 

గత డిశంబరు నెలలో కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలలో కనుగొన్న అపారమయిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ఆరు నెలలోగా ఒక కన్సల్టెన్సీ ఏజన్సీని నియమించాలని ఆయన కోరారు.

 

ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రాణాలికేతర వ్యయాన్ని కనీసం 20శాతం కంటే తక్కువలో ఉండేలా ఖర్చులను నియంత్రించుకోవాలని అన్ని శాఖల అధికారులను కోరారు. అన్ని శాఖల అధికారులు కూడా ఏ శాఖ ఆదాయం ఎక్కువగా ఉంటుందో దానికి అన్ని విధాల సహకరిస్తూ ఆ ఆదాయం మరింత పెరిగేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. అన్ని శాఖల మధ్య మరింత సమన్వయం సాధించడం ద్వారా అన్ని శాఖలు తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.