మాటలు కాదు చేతలు కూడా అవసరం

 

తెలంగాణా ఉద్యమానికి, ఎన్నికలలో గెలవడానికి అద్భుతంగా పనిచేసిన తెలంగాణా సెంటిమెంటు, పరిపాలన సాగించడానికి మాత్రం అంతగా వర్కవుట్ అవడం లేదనిపిస్తోంది. ఇదివరకు కేసీఆర్ మాటల గారడీకి మెచ్చుకొని జనాలు చప్పట్లు కొట్టినా, ఇప్పుడు ఆయన కరెంటు ఈయలేక చేతులు పిసుకొంటూ కూర్చోవడంతో జనాలు కూడా ఇప్పుడు చప్పట్లు కొట్టడం మరిచిపోతున్నారు. కరెంటు కోసం మరో రెండు మూడేళ్ళు ఆగమని ఆయన చెపుతున్నా వినకుండా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయితే ఆ పాపం గత ప్రభుత్వాలదేనని ఆయన చేతులు కడిగేసుకొన్నారు.

 

ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా జనాలు కూడా వినిపించుకొనే పరిస్థితి కనబడటం లేదు. అందుకే హైదరాబాద్ రోడ్లని సినీ హీరోయిన్ బుగ్గలా నున్నగా మెరిపిస్తామని, వైఫీ సౌకర్యం కల్పిస్తామని, గొలుసుకట్టు చెరువులు బాగు చేయించి నీళ్ళు ఇస్తామని ఏవేవో కొత్త కొత్త హామీలు గుప్పిస్తున్నారు. కానీ ‘సమస్యల గొంగళీ’ మాత్రం వేసిన చోటనే ఉంది.

 

ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా ప్రభుత్వ ఆదాయం బాగానే ఉందనే టాక్ ఒకటుంది. ఆంధ్రా దగ్గర కరెంటు ఉంది. కానీ డబ్బు లేదు. కనుక తనదగ్గర ఉన్న డబ్బు పెట్టి ఆంధ్రా దగ్గర కరెంటు కొనుకొనే ఆలోచన చేస్తే ఇరువురి కష్టాలు తీరవచ్చును. కానీ అందుకు అహం అడ్డువస్తోంది. పోనీ కేంద్రాన్ని కరెంటు ఇమ్మని అడగవచ్చును కానీ కేంద్రంతో కూడా పడదాయే.

 

ఇప్పుడు కేసీఆర్ కొత్తగా మరో గొప్ప సత్యం కనుకొన్నారు. అదేమంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కంటే రాష్ట్ర విభజన తరువాతే తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువయిపోయిందని! అయితే ఈ ఐదు నెలలలో తెలంగాణాకి కొత్తగా భారీ పరిశ్రమలేవీ రాలేదు. కొత్తగా లక్షల ఎకరాలలో ఎవరూ పంటలు వేయలేదు. మరి అటువంటప్పుడు అకస్మాత్తుగా విద్యుత్ వినియోగం ఎలా పెరిగిపోయిందో ఆయనే వివరించితే బాగుండేది. అయినా విద్యుత్ సరఫరాయే లేకపోతే ఇక వినియోగం ఎలా పెరుగుతుంది? అని ఆలోచిస్తే తగినంత విద్యుత్ సరఫరా లేకపోవడం వలననే కొరత ఏర్పడింది తప్ప వినియోగం పెరగడం వలన కాదని అర్ధమవుతోంది.

 

అటువంటప్పుడు బేషజానికి పోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తానంటున్న 300మెగావాట్స్ విద్యుత్ తీసుకొని వీలయితే అదనపు విద్యుత్ కూడా అడగవచ్చును. అదేవిధంగా విద్యుత్ సమస్యపై తనను నిలదీస్తున్న ప్రతిపక్షాలను, ముఖ్యంగా బీజేపీ నేతలను కూడా వెంటేసుకొని కేసీఆర్ డిల్లీ వెళ్లి మోడీపై ఒత్తిడి తెస్తే ఏమయినా ప్రయోజనం ఉండవచ్చును. కానీ మాటలతోనే ప్రజలను మురిపిద్దామని ప్రయత్నిస్తే కధ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu