మీ మాట నెగ్గించుకునే- FITD టెక్నిక్

మనిషి సంఘజీవి. ఉదయం లేచిన దగ్గర్నుంచీ అతనికి పదిమందితోనూ అవసరం తప్పదు. అదే ఏ మార్కెటింగ్‌ రంగంలో అన్నా ఉంటే ఇక అవతలివారు కొనుగోలు చేసే నిర్ణయాల మీదే మన అభివృద్ధి ఆధారపడి ఉంటుందయ్యే! అందుకోసం రకరకాల చిట్కాలు ఉండనే ఉన్నాయి. వీటిలో కొన్ని వాక్చాతుర్యంతో సాధించేవి అయితే, మరికొన్ని మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందించినవి. అలాంటి ఒక చిట్కానే Foot-in-the-door technique (FITD)!

ముందుగా కాలుపెట్టండి

‘నాన్నా ఇవాళ మహేష్‌తో కలిసి సినిమాకి వెళ్లనా!’ అని అడిగతే నాన్నగారు దానికి ఒప్పుకుంటారో లేదో కష్టం. కానీ ముందుగా ‘నాన్నా, ఇవాళ సాయంత్రం మహేష్‌ వాళ్లింటికి వెళ్లనా!’ అని అడిగారనుకోండి... అదేమంత పెద్ద విషయం కాదు కాబట్టి నాన్నగారు దానికి ఒప్పుకోవచ్చు. కానీ ఆ తరువాత ‘మహేష్‌ వాళ్లింటికి వెళ్లాక, అక్కడి నుంచి వీలైతే సినిమాకు వెళ్లొచ్చా!’ అని అడిగారనుకోండి... నాన్నగారు ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ! ఇది కొంటె కుర్రాళ్ల మంత్రం కాదు శాస్త్రవేత్తల మాటే. ముందుగా ఎదుటివారు కాదనలేని ఒక చిన్న అభ్యర్థన ద్వారా ఈ టెక్నిక్‌ను మొదలుపెట్టాలి. ఆ తరువాత దానికి కొనసాగింపుగా అసలైన అభ్యర్థనని వారి ముందు ఉంచండి. దాని వల్ల ‘ఇంతకు ముందు అభ్యర్థనని నేను ఒప్పుకున్నాను కదా! ఇప్పుడు దీనిని కూడా ఒప్పుకుంటే పోయేదేముంది’ అన్న అభిప్రాయం అవతలివారిలో ఏర్పడుతుంది.


ఉపయోగాలు

ఒక చిన్న అంగీకారంతో మరో పెద్ద అంగీకారానికి దారి తీయించడమే ఈ టెక్నిక్‌లోని రహస్యం. మొదటి అంగీకారంతో అవతలి వ్యక్తి ఒక తెలియని ఒప్పందంలోకి వచ్చేస్తాడనీ, తరువాత ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న మర్యాదని పాటిస్తాడని నిపుణులు అంటున్నారు. అయితే ఒకే వ్యక్తి నుంచి ఈ అభ్యర్థనలు ఉండాలనీ, రెండు అభ్యర్థలనకూ మధ్య పొంతన ఉండాలనీన సూచిస్తున్నారు. మార్కెంటింగ్‌లో ఉన్న వ్యక్తులకి ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముందుగా మీ మాటలు వినేందుకో, మీ ఉత్పత్తి పనితీరుని గమనించేందుకో, కొన్నాళ్లపాటు వాడిచేసేందుకో... అవతలి వ్యక్తులను ఒప్పించగలిగితే, మీ పని మరింత సులువవుతుందని చెబుతున్నారు. స్వచ్చంద సంస్థలలో పనిచేసేవారు కూడా ఈ పద్ధతిని శుభ్రంగా పాటించవచ్చని చెబుతున్నారు. ‘మా సంస్థకి ఒక్క వందరూపాయల విరాళం ఇవ్వండి మాస్టారూ!’ అని అడిగి ఒప్పించిన తరువాత ‘నెలనెలా వంద రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మాస్టారూ!’ అని చెబితే అవతలివారు తిరస్కరించడం కష్టమే కదా!

రివర్స్‌ టెక్నిక్‌

FITD టెక్నిక్ సరిగా పనిచేయకపోతే కంగారుపడవద్దంటున్నారు. ఈసారి Door-in-the-face (DITF) టెక్నిక్‌ని వాడి చూడమంటున్నారు. ఇందులో భాగంగా మొదటిసారే పెద్ద అభ్యర్థన చేసి చూడాలి. దానికి అవతలివారు ఒప్పుకోనప్పుడు, చిన్న అభ్యర్థనను చేసి చూడాలి. ఎలాగూ మొదటి అభ్యర్థనను తిరస్కరించాం కదా అన్న జాలితో, అవతలివారు రెండోదానికి అంగీకారం తెలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ‘ఈ పుస్తకం ధర వెయ్యి రూపాయలండీ కొనుక్కోరాదూ!’ అని అడిగితే... అవతలి వ్యక్తి దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు. కానీ మరో చిన్న పుస్తకాన్ని చూపించి ‘ఈ పుస్తకం అయితే పాతిక రూపాయలే! ఇదన్నా తీసుకోండి’ అని అడిగితే... అవతలి వ్యక్తి మారుమాట్లాడకుండా దాన్ని కొనుగోలు చేయవచ్చు.


ఏదో ఒకటి రెండు ఉదాహరణలతో సరిపెట్టుకున్నాం కానీ, ఈ రెండు టెక్నిక్‌లనూ రోజువారీ జీవితంలో అనేక సందర్భాలలో వాడి చూడవచ్చు. కాకపోతే మన కుటుంబజీవితంలో మాత్రం ఎప్పుడో ఒకసారి తప్ప, నిరంతరం ఇలాంటి చిట్కాలను వాడుతుంటే... మన బంధాలు కాస్తా కృతకంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు.

 

- నిర్జర.