కేశవరెడ్డిని కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరు?
posted on Oct 4, 2015 12:19PM

అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆగమేఘాల మీద చర్యలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం... కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిట్ల కుంభకోణం విషయంలో మాత్రం చూసీచూడనట్లు పోతుందనే టాక్ వినిపిస్తోంది. అగ్రిగోల్డ్ కేసులో వేగంగా దర్యాప్తు చేపట్టి, ఆస్తులను సైతం స్వాధీనం చేసుకుని బాధితులకు ఎంతోకొంత న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... కేశవరెడ్డి బాధితుల విషయంలో మాత్రం సరిగా అడుగులు వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి, పైగా కేశవరెడ్డిని కాపాడేందుకు ఏపీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న ఓ కీలక నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు
అగ్రిగోల్డ్ అయినా, కేశవరెడ్డి విద్యాసంస్థల మోసం అయినా ఈ కేసుల్లోనూ ప్రజలే బాధితులు, మరీ అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ముందుకొచ్చిన ప్రభుత్వం, కేశవరెడ్డి విషయంలో అలా ఎందుకు చేయడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు, విద్యార్ధుల నుంచి దాదాపు 550 కోట్ల రూపాయల డిపాజిట్లు, 62కోట్లకు పైగా బ్యాంకు రుణం... ఓవరాల్ గా వెయ్యికోట్లు వసూలుచేసి చేతులెత్తేసిన కేశవరెడ్డి విషయంలో ప్రభుత్వం ఎందుకు మెత్తగా ఉందని కొందరు టీడీపీ లీడర్స్ సైతం గళం వినిపిస్తున్నారు, పేద మధ్య తరగతి ప్రజల నుంచి డిపాజిట్లు వసూలుచేసి మోసం చేసినవాళ్లు ఎవరైనా ఒక్కటేనని, ఇలాంటి కేసుల్లో బాధితులకు న్యాయం జరగకపోతే చివరికి పార్టీకే నష్టమంటున్నారు.
అయితే కేశవరెడ్డి విషయంలో అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ చక్రం తిప్పుతున్న కొత్త నాయకుడు అండగా ఉన్నట్లు చెబుతున్నారు. కేశవరెడ్డి వియ్యంకుడైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి... టీడీపీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసింది కూడా ఈ నాయకుడేనని, పైగా ఈ కేసు నుంచి కేశవరెడ్డిని బయటపడేసేందుకు తన పవర్స్ ను ఉపయోగిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
ఐపీసీ 420, 403, 109, 149, 5 సెక్షన్లతోపాటు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ పాజిటర్స్ అండ్ ఫైనాన్షియర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదై ఉన్న కేశవరెడ్డిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై బాధితులు మండిపడుతున్నారు, ఎందుకంటే కేశవరెడ్డి బాధితులు వేలల్లో ఉన్నారు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 12వేలమంది నుంచి కేశవరెడ్డి డిపాజిట్లు సేకరించారు, ప్రతి జిల్లాలోనూ కోట్లాది రూపాయలు వసూలుచేశారు. మరి వీళ్లందరికీ న్యాయం జరిగినప్పుడే కేశవరెడ్డి కేసు విషయంలో ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకున్నట్లు అవుతుంది