కేసీఆర్ కి చెక్ పెట్టాడా? పార్టీని చిక్కుల్లో పడేశాడా?

దేశంలో కొందరు నేతలది మతోన్మాద పంథా! ఇటు హిందువుల్ని, అటు ముస్లిమ్ లని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే వారు చాలా మందే వుంటారు. అయితే, మనం పెద్దగా పట్టించుకోని మరో రకం నేతలు కూడా వుంటుంటారు. వారే వీర లౌకికవాద నేతలు! అందుకు మంచి ఉదాహరణ దిగ్విజయ్ సింగ్!

 

కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన నేతల్లో డిగ్గీ కూడా ఒకరు. ఇప్పటికీ ఆయన పవర్ చాలా ఎక్కువే. కాని, జనం అతడ్ని పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. పార్టీలో మాత్రమే రాజా వారి హవా కొనసాగుతుంటుంది. దానికి కూడా ఈ మధ్య గండిపడ్డట్టే కనిపిస్తోంది. ఎన్నికలు అయిపోయిన గోవాకి, ఎన్నికలు రానున్న కర్ణాటకకి ఆయనని ఇంఛార్జ్ గా తొలగించేశారు. ఇక స్వంత రాష్ట్రం మధ్య ప్రదేశ్ లో అయితే ఆయన బీజేపి చేతుల్లో అధికారం పెట్టి దిల్లీకి వచ్చాక ఇంత వరకూ దిక్కూమొక్కూ లేదు. త్వరలో అధికారం దక్కే అవకాశాలూ లేవు! అలాంటి స్థితికి పార్టీని తేవటంలో దిగ్విజయ్ పాత్ర బోలెడు!

 

వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటములకి తనకు తోచినంత కృషి చేసే డిగ్గీ ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టినట్లే కనిపిస్తోంది. 2019లో కేసీఆర్ ను గద్దె దించి తాము సీఎం అవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు బోలెడు మంది తపిస్తుంటే… వున్నట్టుండీ ఊడిపడ్డ దిగ్విజయ్ చాణక్య వ్యూహం పన్నారు. తెలంగాణ పోలీసులు ఒక ఫేక్ వెబ్ సైట్ నడుపుతున్నారనీ, దాంతో అమాయక ముస్లిమ్ యువకుల్ని ట్రాప్ చే్స్తున్నారనీ, ఇది అనైతికమని ఆయన ట్వీట్లు చేశాడు! అలా ముస్లిమ్ లకు పన్నెండు శాతం అంటూ కేసీఆర్ విసిరిన పాచికని దిగ్విజయ్ దిగ్విజయంగా ఎదుర్కొన్నాడు.

 

తెలంగాణ ముస్లిమ్ ల దృష్టిలో కేసీఆర్ ని, పోలీసుల్ని  తాను విలన్లని చేశాననీ, వారు కుట్ర ద్వారా తమ యువతని జైలు పాలు చేస్తున్నారని భావించేలా చేయగలిగానని డిగ్గీ అనుకుని వుండవచ్చు. కాని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా సాక్ష్యాలు చూపమని డిమాండ్ చేస్తోంది. తన మాటకి కట్టుబడే వున్నానని చెబుతోన్న దిగ్విజయ్ ఏదో మీటింగ్ లో ఎవరో మాట్లాడుకుంటే తనకు సమాచారం అందిందని అంటున్నాడు. దాన్ని నమ్మి ట్వీట్లు చేసి తెలంగాణ పోలీసుల ప్రతిష్ఠ దెబ్బతీశానని చెబుతున్నాడు! ఇది అసలు ఎంత షాకింగ్ గా వుందంటే… ఇప్పటి వరకూ టీ కాంగ్ నేతలెవ్వరూ బలంగా దిగ్విజయ్ మాటల్ని సమర్థించనే లేదు! వారికి అసలు దిగ్విజయ్ పోలీసుల్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తాడని తెలియనే తెలియదనుకుంటా! అంతలా కన్ ఫ్యూజన్లో మిగిలిపోయారు లోకల్ లీడర్స్!

 

దిగ్విజయ్ ట్వీట్లు చేసి కలకలం రేపక ముందు వరకూ టీ కాంగ్ నాయకులంతా మిర్చీ మద్దతు ధర విషయంలో ఘాటుగా పోరాటం చేశారు. వున్నట్టుండీ పెద్దాయన దిగిపోయి తెలంగాణ వ్యవహారాల్లో వేలు పెట్టే సరికి ఎవ్వరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది! పోనీ… గట్టిగా సమర్థించినా… తెలంగాణ పోలీసుల నైతికత మీద దాడి చేస్తే… ముందు ముందు దాన్ని నిరూపించుకోవాలి! లేకపోతే, జనం ముందు చులకనైపోతారు. ఇదే ఇప్పుడు టీకాంగ్ నాయకుల అయోమయ మౌనానికి కారణం!

 

నిజంగా తెలంగాణ పోలీసులు ముస్లిమ్ యువకుల్ని ట్రాప్ చేస్తున్నారో లేదో ఎవ్వరికీ తెలియదు. కాని, ఉగ్రవాదంపై పోరాడుతున్న భద్రతా దళాల్ని వీర లౌకికవాద నేతలు టార్గెట్ చేయటం ఎన్నికల్లో సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఆ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ కి వీడియో ఆధారాలు కావాలన్న అరవింద్ కేజ్రీవాల్ ఏం లాభం పొందాడు? తాజా దీల్లీ ఎన్నికల్లో అంతా స్పష్టమైపోయింది! దిగ్విజయ్ కూడా ఈ సత్యం తెలుసుకోవాలని రాజకీయ పండితులు అంటున్నారు. ముంబై పై కసబ్ , అతడి గ్యాంగ్ దాడులు చేశాక కూడా ఇదే డిగ్గీ ఆరెస్సెస్ కారణమంటూ ఒక సభలో మాట్లాడాడు! ఇలాంటి వ్యూహాల వల్ల ముస్లిమ్ లకు దగ్గరవ్వటం కన్నా మెజార్టీ ప్రజల అనుమానాలకి బలైపోవాల్సి వస్తుంది! దిగ్విజయ్ అంతటి తల పండిన నాయకుడు ఇది ఎప్పుడు గ్రహిస్తాడో! 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu