అనర్థం తప్పినా… ఆప్ కు అపాయం మిగిలే వుందా?
posted on May 3, 2017 5:12PM
.jpg)
చీపురు చిరిగిపోకుండా మిగిలింది! ఒకవేళ ఆ పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ పార్టీని వీడి వుంటే దారుణమే జరిగి వుండేది. ఆప్ అడ్డంగా చీలిపోయి వుండేది. చాలా మంది ఎమ్మెల్యేలు కుమార్ విశ్వాస్ వెంట బయటకి నడిచి వుండే వారని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. అది ఎంత వరకూ నిజమో మనకు తెలియదుగాని… కుమార్ విశ్వాస్ అవసరం మాత్రం, ఆప్ కు, అరవింద్ కు చాలా వుంది. అందుకే, ఆయనను ఇంటికి వెళ్లి కలుసుకున్న కేజ్రీ అమానతుల్లా ఖాన్ అనే కుమార్ విశ్వాస్ ప్రత్యర్థిని సస్పెండ్ కూడా చేశాడు! ఒక మైనార్టీ వర్గానికి చెందిన లీడర్ పై ఏకే వేటు వేయటం సాధారణ విషయం కాదు! కుమార్ వెంట ఎంత ఎమ్మెల్యేలు వున్నదీ దీని వల్ల స్పష్టమైపోతుంది!
కుమార్ విశ్వాస్ అరవింద్ లాగే అన్నా హజారే వెంట అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న నాయకడు. హిందీలో కవిత్వం చెప్పే ఈయన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బాగానే ఫేమస్. అందుకే, ఆప్ స్థాపించే సమయంలో ఆయనని కూడా వెంటబెట్టుకున్నాడు కేజ్రీవాల్. కాని, రాను రాను కేజ్రీవాల్, కుమార్ల మధ్య అంతరం పెరిగింది. అందుకు కారణం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే! అధికారం చేపట్టాక కుమార్ వర్గానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే పార్టీ నడిపే విషయంలో కూడా కుమార్ విశ్వాస్ సూచనలు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా కుమార్ విశ్వాస్ ప్రత్యర్థి వర్గమైన సంజయ్ సింగ్, అతని అనుచరుల్ని చేరదీశాడు. వీటన్నిటి ఫలితమే దిల్లీ మున్సిపల్ ఎన్నికల తరువాత కుమార్ తిరుగుబాటు! కాని, అతడ్ని ఇంత కాలం ఉపేక్షించిన కేజ్రీవాల్ కి ఇప్పుడు వదులుకోవటం మామూలు డ్యామెజ్ కాదు. ఏకంగా ప్రభుత్వమే కూలిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు! అందుకే, ఈగోకి మారు పేరైన ఏకే, కుమార్ ఇంటికి వెళ్లి సంధి చేసుకున్నాడు! తనకు వీర విధేయుడని పేరున్న అమానతుల్లా ఖాన్ ను సాగనంపాడు!
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్ద పెద్ద నాయకులు బయటకి వెళ్లటం ఇప్పుడు కొత్తేం కాదు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వ్యవస్థాపక సభ్యుల్నే కేజ్రీవాల్ సాదరంగా సాగనంపాడు. ఇక బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ లాంటి నేతల సంగతైతే చెప్పక్కర్లేదు. అసలు దిల్లీలో తప్ప మరెక్కడా బలంగా విస్తరించని ఆప్ లో ఇన్ని విభేదాలు ఎలా అని ఆశ్చర్యపోయే వారు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించిన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లో కూడా ఇన్ని గొడవలు వుండవు. కాని, అరవింద్ ఆప్ లో మాత్రకం యథా రాజా తథా ప్రజా అన్నట్టు వుంది వ్యవహారం! ఇదంతా ముందు నుంచీ గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కుమార్ విశ్వాస్ ఎపిసోడ్ ముగియటంతో శుభం కార్డ్ పడ్డట్టు కాదనీ అంటున్నారు. ఆప్ లో ది ఎండ్ కార్డ్ పడాలంటే ఇంకా బోలెడు రచ్చ జరగాల్సి వుందంటున్నారు!