పెట్రోల్ ధరలు తగ్గుతాయి

 

చమురు ధరలు మరోసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ 115 డాలర్లు పలికిన బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర.. బుధవారం నాటికి 87 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చమురు ధరలను 2 నుంచి రెండున్నర రూపాయల దాకా తగ్గించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోన్నట్టు సమాచారం. పెట్రోల్ ధరలను మరోసారి తగ్గించినట్టయితే, ఈ ఏడాది ఆగస్టు నుంచి మూడు నెలల వ్యవధిలో పెట్రోలు ధరలు ఆరుసార్లు తగ్గినట్టు అవుతుంది. అలాగే డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ రేటుకు విక్రయించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత డీజిల్‌ ధరలు తగ్గడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ తగ్గింపుతో పెట్రోలు ధరలు మళ్లీ 16 నెలల కనిష్ఠానికి, డీజిల్‌ ధర మళ్లీ ఏడాది క్రితం ఎంత ఉందో అంతకు తగ్గే అవకాశం ఉంది. రెండు వారాల వ్యవధిలోనే డీజిల్‌ ధర ఇలా 11 శాతం మేర తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం కూడా కొంతవరకు తగ్గే అవకాశం వుంది.