జాతీయ ఐక్యతా పరుగు ప్రారంభం

 

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీ విజయ్ చౌక్ దగ్గర జాతీయ ఐక్యతా పరుగును దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలతోపాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ పరుగులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్రమోడీ మాట్లాడుతూ, ‘‘దేశాన్ని ఏకం చేయడానికి పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారు. స్వాతంత్ర్య సమరంలో రైతులందరినీ ఏకతాటి మీద నడిపిన ఘనత పటేల్‌దే. సర్దార్ పటేల్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఆయన స్ఫూర్తితో, కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక ఘట్టమైన దండి యాత్రలో మహాత్ముడితో కలసి కదం కలిపిన వ్యక్తి పటేల్. స్వాతంత్ర్యం ఇచ్చాక భారతదేశం ముక్కలైపోతుందని బ్రిటీషువారు భావించారు. అయితే సర్దార్ పటేల్ దేశమంతటినీ ఒక్క తాటిమీద నలిపారు. సంస్థానాల విలీనమే పటేల్ శక్తి సామర్థ్యాలకు ప్రతీక’’ అన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రజల చేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.