తెదేపా మెతక వైఖరే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందా?
posted on Aug 18, 2015 12:32PM
.jpg)
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీలను సాధించే విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదని, ప్రతిపక్షాలు మాత్రమే వాటి గురించి కేంద్రంతో పోరాడుతున్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకొని మళ్ళీ బలపడేందుకే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొందని ప్రజలకి కూడా తెలుసు. అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా అంశం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే, తాము చేతులు ముడుచుకొని కూర్చొని చూస్తుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనే భయంతోనే ఇంతకాలం దాని గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఏకంగా డిల్లీలో దీక్ష చేసి వచ్చి తను కూడా ఈనెల 29న రాష్ట్ర బంద్ కి పిలుపు నిచ్చారు. వీటికి తోడూ సీపిఐ, నటుడు శివాజీ, ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా కోసం తమ ఉద్యమాలని తీవ్రతరం చేస్తున్నారు. వీటన్నిటినీ గమనిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఊరుకొంటే ప్రజలు కూడా అపార్ధం చేసుకొనే అవకాశం ఉంటుంది. కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యలు, వాటికి కారణాలు, కారకులు, వాటి పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తున్నారు.
నిన్న రాత్రి విజయవాడలో తన క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ, “ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని తన ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర విభజన తరువాత తలెత్తుతున్న సమస్యలన్నిటికీ మూలకారణం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలే. ఆస్తులన్నీ తెలంగాణాకి, అప్పులన్నీ ఆంధ్రాకి పంచిపెట్టి చేతులు దులుపుకొంది. కానీ ఇప్పుడు అదేపార్టీ మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. అది ఎందుకో అందరికీ తెలుసు. సోనియాగాంధీ తన ఇటలీ దేశ రిపబ్లిక్ డే రోజునే (జూన్ రెండు) రెండు రాష్ట్రాల ఆవిర్భావ దినంగా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులని మనం కూర్చొని సరిడదిద్దుకొందామని చెపుతున్నా తెలంగాణా ప్రభుత్వం అంగీకరించకుండా పదేపదే విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. విద్యుత్ సంస్థలలో నుండి ఒకేసారి 1250 మంది ఉద్యోగులను బయటకి గెంటేసింది. ఇంటర్ మీడియేట్ బోర్డు నిధులను స్తంభింపజేసింది. ఇరు రాష్ట్రాలకి చెందిన అనేక ఉమ్మడి సంస్థలని స్వాధీనం చేసుకొంటోంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులతో చాలా అవమానకరంగా వ్యవహరిస్తోంది. ఇంత జరుగుతున్నా గవర్నర్ సెక్షన్ : 8 అమలుకి ఇంకా వెనకాడుతున్నారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఈ సమస్యలన్నీ ఆయనకీ వివరించి రాష్ట్రానికి న్యాయం చేయమని గట్టిగా అడుగుతాను,” అని అన్నారు.
తెరాస ప్రభుత్వం ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారికే మద్దతు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్న ఈ సమస్యల గురించి, తెరాస ప్రభుత్వం ఆంధ్రాకి విసురుతున్న ఈ సవాళ్ళ గురించి ఆయన ఎన్నడూ పల్లెత్తు మాట పలకరు. ఏపీలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారిళ్ళకు వెళ్లి మరీ ఓదార్చివచ్చే జగన్మోహన్ రెడ్డి, తెరాస ప్రభుత్వం ఏకంగా 1250 మంది ఉద్యోగులను ఉద్యోగాలలో నుంచి పీకేస్తే పల్లెత్తు మాటనరు. అసలు ఆసంగతి తనకు తెలియనట్లే వ్యవహరిస్తుంటారు. పోనీ ఆ సమస్య తెలంగాణాదనుకొంటే అక్కడ కూడా వైకాపా ఉంది. అక్కడ వైకాప నేతలయినా ఉద్యోగుల కోసం తెరాస ప్రభుత్వంతో పోరాడవచ్చును. కానీ పోరాడరు.
ఓటుకి నోటు కేసుపై వైకాపా చూపిస్తున్న ఆసక్తి రోడ్డునపడ్డ ఉద్యోగుల విషయంలో ఎందుకు చూపించడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా, తెరాస ప్రభుత్వం విసురుతున్న ఈ సవాళ్ళ గురించి, సృష్టిస్తున్న ఈ సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబంధం దెబ్బ తింటుందనే భయంతోనే కావచ్చును. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకొనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు డిల్లీ వెళ్లి మరీ పోరాడుతున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి తనకు, తన పార్టీకి అనుకూలమయినవి, రాజకీయ లబ్ది కలిగించేవి, అధికార తెదేపాను ఇరుకునపెట్టగలిగే ప్రత్యేక హోదా వంటి అంశాలను మాత్రమే అందిపుచ్చుకొని పోరాడుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఏవిధంగా ఒత్తిడి తెస్తోందో, ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ అధికార పార్టీ నేతలు కాంగ్రెస్, వైకాపాలు ఆడుతున్న ఈ కపట నాటకాలను ఎండగట్టడంలో విఫలం అవుతున్నందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవిధంగా ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోవలసివస్తోందని భావించవచ్చును.