ఆంధ్రాలో జోనల్ వ్యవస్థ రద్దు?

 

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుండి ఇటు అనంతపురం వరకు గల జిల్లాల నుండి ప్రజలు హైదరాబాద్ మరియు తెలంగాణాలో ఉద్యోగాలకి పోటీ పడుతుండటంతో స్థానికులకి అన్యాయం జరగకూడదనే ఉద్దశ్యంతో ఆర్టికల్ 371(డి)ని అమలులోకి తెచ్చారు. కానీ ఇప్పుడు అదే ఆర్టికల్ హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ఉద్యోగులు అమరావతి తరలిరావడానికి అడ్డంకిగా మారింది. దీని ప్రకారం గత ఏడేళ్ళ కాలంలో వరుసగా నాలుగేళ్లపాటు ఎక్కడ నివసిస్తే వారు అక్కడ స్థానికులుగా గుర్తించబడతారు. అమరావతికి తరలివచ్చినట్లయితే తమ పిల్లలు స్థానికేతరులుగా పరిగణించబడుతారు కనుక వారికి ఉద్యోగావకాశాలు ఉండవని ప్రభుత్వోద్యోగులు భయపడుతున్నారు.

 

వారి ఆందోళన సహేతుకమయినదే కనుక ఈ ఆర్టికల్ 371 (డి)ని రద్దు చేయవలసిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఇప్పుడు ఆ చట్టం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఇళ్ళు, కార్యాలయాల కోసం విజయవాడ, గుంటూరు, నూజివీడు ప్రాంతాలలో భవనాల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు వీలయినంతలో అన్ని విధాల సౌకర్యాలు కల్పించి, వారికి వారి పిల్లల జీవితాలకి పూర్తి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. కానీ వీలయినంత త్వరలో రాష్ట్ర పరిపాలన అమరావతి నుండే చేయాలని మేము కోరుకొంటున్నామని తెలిపారు.

 

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎప్పటికయినా ఆంద్రప్రదేశ్ కి తరలిపోక తప్పాడు కనుక ఉద్యోగులు అందరూ మానసికంగా సంసిద్దులయి ఉండటమే మంచిదని ఆయన అన్నారు. బహుశః రెండు మూడు నెలల్లోనే ఉద్యోగులు అందరూ హైదరాబాద్ నుండి విజయవాడకి తరలివెళ్లేందుకు సంసిద్దంగా ఉంటే మంచిదని ఆయన అన్నారు. కనుక ఉద్యోగులకు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకి అవసరమయిన భవనాలు సమకూరగానే ప్రభుత్వ పాలనా వ్యవస్థ తరలింపు మొదలవుతుందేమో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu