బీహార్ ఆర్ధిక ప్యాకేజితో కొత్త తిప్పలు

 

ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటించడంతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. నవంబరులో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆయన అంత భారీ ప్యాకేజ్ ప్రకటించారని అధికార జేడీయు, ఆర్.జేడీ, వాటితో జతకట్టిన కాంగ్రెస్ పార్టీలు మోడీని విమర్శిస్తున్నాయి. ఆ ప్యాకేజి వివరాలను, ఎప్పటిలోగా దేని కోసం ఎన్నినిధులు విడుదల చేస్తారో ప్రకటించాలని లాలూ ప్రసాద్ మోడీకి సవాలు విసిరారు. దానిని బీజేపీ నేతలు తేలికగా కొట్టిపడేయవచ్చును కానీ లాలూ విసిరిన ఆ సవాలుకి బీజేపీ తప్పక జవాబు చెప్పవలసి ఉంటుంది. లేకుంటే బీహార్ ప్రజలను మభ్యపెట్టేందుకే మోడీ ఆ ప్రకటన చేసారని ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేసుకొనే అవకాశం కలుగుతుంది. కనుక కేంద్రప్రభుత్వం ప్యాకేజి విషయంలో తక్షణమే స్పష్థత ఇవ్వవలసి ఉంటుంది.

 

కానీ బీహార్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఇంతవరకు సుమారు రూ.40, 000 కోట్ల వరకు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెపుతున్నారు. కనుక బీహార్ రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీష్ కుమార్ కూడా ఆ నిధులను దేనికోసం ఖర్చుచేసారో, ఆనిధులతో రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసారో ప్రకటించవలసి ఉంటుంది. కానీ అలాగా ప్రకటిస్తే మోడీ ప్రభుత్వం ఇప్పుడే కాదు మొదటి నుండి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూనే ఉందని అంగీకరించినట్లవుతుంది. అంతేకాదు తన ప్రభుత్వం చేప్పట్టిన ఆ అభివృద్ధి కార్యక్రమాల క్రెడిట్ అంతా మోడీ ప్రభుత్వానిదేనని అంగీకరించినట్లవుతుంది. పోనీ చెప్పకుండా మౌనం వహిద్దామంటే బీజేపీ ఆ నిధులు ఏమి చేసారని ప్రశ్నిస్తుంది. జవాబు చెప్పకపోతే కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను నితీష్ ప్రభుత్వం బొక్కేస్తోందని ప్రచారం చేసుకొనే సౌలభ్యం ఏర్పడుతుంది. ఈ విధంగా బీజేపీ, జేడీయు దాని మిత్రపక్షాలకు ఈ ప్యాకేజిపై సరికొత్త యుద్ధం ఆరంభించే అవకాశం కలిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu