వెదురుబొంగుతో నీరు ఉత్పత్తి..!

మానవ మనుగడ ప్రారంభానికి మూల కారణం నీరు. చరిత్ర పరిశీలిస్తే, అద్భుతంగా విలసిల్లిన నాగరికతలన్నీ నదీతీరాన వికసించినవే. నీరు లేకుండా మానవ మనుగడ అసాధ్యం. కానీ నేడున్న పరిస్థితుల్లో, పుష్కలమైన నీటి వనరులున్న ప్రాంతాలు కూడా ఎడారి ప్రాంతాల్లా మారిపోతున్నాయి. ఇప్పటికే మహానగరాల్లో సైతం నీటి నిల్వలు లేని పరిస్థితి. చెట్లు కొట్టేయడం, వర్షాభావం, కరువు, ఏటికేడు పెరుగుతూ వెళ్తున్న సూర్యతాపం లాంటివన్నీ కలిపి, నీటిని ఆవిరి చేసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, నీటిని ఉత్పత్పి చేయడానికి ఇథియోపియాలో ఒక కొత్త రకం పద్ధతిని కనుగొన్నారు.

ఆర్టురో విటోరి అనే ఆర్కిటెక్ట్ తయారుచేసిన ఈ పద్ధతి ఇప్పుడు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు ముప్ఫై అడుగుల ఎత్తు, పదమూడు అడుగుల వెడల్పుతో వెదురుకర్రలతో తయారుచేసిన వాటర్ టవర్లను ఈ పద్ధతిలో ఉపయోగిస్తారు. మెష్ లా తయారుచేసిన వెదురు, వాతావరణంలోని తేమను కలెక్ట్ చేసి, ట్యాంక్ లో నీటిరూపంలో స్టోర్ చేస్తుంది.

ట్యాంక్ లో నిలవ ఉన్న నీటిని, అడుగుభాగంలో ఉన్న కుళాయి ద్వారా సేకరించుకోవచ్చు. దీన్ని తయారుచేయడానికి, మెయింటెయిన్ చేయడానికి కరెంట్ కూడా అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత కరువును ఎదుర్కొంటున్న దేశాల్లో ఇథియోపియా కూడా ఒకటి. అక్కడి ప్రజలు నీటి కోసం కీలోమీటర్ల తరబడి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అందుకే విటోరి ఆ ప్రాంతాన్ని ఎంచుకుని తమ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించాడు. ప్రస్తుతం కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎన్నో దేశాలకు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.