రేవంత్ పై పీకే విమర్శలు.. వ్యూహమేంటంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం, విమర్శల వెనుక అర్ధవంతమైన కారణమే ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించడానికి బీహార్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలను ఒక్క ప్రశాంత్ కిశోర్ మాత్రమే కాదు.. రాజకీయాలకు అతీతంగా బీహార్ వాసులంతా తప్పుపడుతున్నారు. బీహార్ కు చెందిన కన్హయ కుమార్ వంటి కాంగ్రెస్ నేతలు రేవంత్ ను మర్యాద తెలియని మనిషిగా, అనాగరికుడిగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.  

ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. తనది తెలంగాణ డీఎన్ఏగా గర్వపడుతున్నానని చెబుతూ.. కేసీఆర్ డీఎన్ఏను తక్కువ చేసి వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైంది.  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  కారాలు మిరియాలు నూరుతున్నారు. వచ్చే ఎన్నికలలో రేవంత్ ను గద్దెదింపడం ఖాయమని పీకే ప్రతిజ్ణ చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు ఉన్న పీకే చేసిన ఈ సవాల్ సంచలనం సృష్టించింది. అంతే కాదు.. రేవంత్ వ్యాఖ్యల ప్రభావం కచ్చితంగా బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలపై చూపే అవకాశం ఉందన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.   తాజాగా రేవంత్ వ్యాఖ్యలపై పీకే వ్యక్తం చేసిన ఆగ్రహం, చేసిన సవాల్ 2028 లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చూపే ప్రభావం ఏమిటో తెలియదు కానీ, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే చేసిన వ్యాఖ్యల వెనుక వ్యూహం మాత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయాలన్నదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా రేవంత్ పై వ్యక్తం చేసిన ఆగ్రహం ద్వారా బీహారీలలో ఆత్మగౌరవ నినాదాన్ని తట్టిలేపడం ద్వారా తన జనసూరత్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే పీకే ఈ ఎత్తుగడ బీహార్ లో ఆయన పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ విజయావకాశాలను దెబ్బతీయడం ఖాయమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. పీకే తన పార్టీ విజయం కంటే.. ప్రత్యర్థి పార్టీల అవకాశాలను దెబ్బతీయడానికే వ్యూహాలు రచిస్తారని గతంలో పలు సందర్భాలలో రుజువైన సంగతి తెలిసిందే.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu