తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం.. ఇంతకు మించి తరుణం ఉంటుందా?!

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ  తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు.  తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో   వెనుకబడింది.  ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో   ఉనికి మాత్రంగానే మిగిలిందని చెప్పవచ్చు.  అయితే ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్నది నాయకుల కొరతే తప్ప కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచారు.   ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా రుజువైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అండ కోసం అన్ని రాజకీయపార్టీలూ వెంపర్లాడిన పరిస్థితి.  కాంగ్రెస్, బీజేపీలు ఆ ఎన్నికల  ప్రచారంలో తెలుగుదేశం ప్రస్తావన తీసుకురావడమే కాదు, పార్టీపై ప్రశంసల వర్షం కురిపించారు.  అంతే కాదు..  అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేసి ఆ పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలని విశ్వ ప్రయత్నం చేసింది.  ఎవరు ఔనన్నా కాదన్నా.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం దండిగా ఉంది. ఈ విషయం పదేపదే నిర్ద్వంద్వంగా రుజువు అవుతూనే వస్తోంది. రాష్ట్ర విభజన అనంతర   పరిణామాలతో  తెలంలగాణలో తెలుగుదేశం పార్టీ   ఒకింత ఇన్ యాక్టివ్ అయ్యిందన్న మాట వాస్తవమే. అయితే ఆ పార్టీ పునాదులు మాత్రం తెలంగాణలో చెక్కు చెదరలేదు.  తెలుగుదేశంఅధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు క్రియాశీలంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించిన అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న భావనతో ఉన్నారు. ఇందు కోసం ఆయన తరచుగా తెలంగాణ తెలుగుదేశం నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం కొద్ది కాలం కిందట జోరుగా సాగింది. అయితే ఆ దిశగా పార్టీ ముందుకు సాగిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. అయితే పరిశీలకులు మాత్రం తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం కావడానికి, పునర్వైభవం సంతరించుకోవడానికి ఇది మంచి తరుణమని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కారణాలేమైతేనేం.. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత  తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి జంప్ అయ్యారు. అయితే ఆలా వెళ్లిన నేతల వెంట కార్యకర్తలు మాత్రం వెళ్లలేదు. అంతెందుకు తొలి నుంచీ తెలుగుదేవం పార్టీతో అనుబంధం ఉన్న పలువురు నేతలు ఇప్పటికీ తెలుగుదేశంతోనే ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా తెలుగుదేశం ఇన్ యాక్టివ్ అయినా.. ఎప్పటికైనా తెలుగుదేశం రాష్ట్రంలో పుంజుకుంటుందన్న విశ్వాసం మాత్రం కార్యకర్తలలో ఇసుమంతైనా సడలలేదు.  

ఇటీవల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు.  ఇది జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఈ తరుణంలో తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో తెలుగుదేశం క్యాడర్ ఈ ఎన్నికలలో పోటీ చేయాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.  గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా.. స్థానిక సమరంలో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించితే.. పార్టీ ప్రజలకు చేరువ అవుతుందనీ, అది రాష్ట్రంలో ముందు ముందు  తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చేందుకు దోహదపడుతుందని కార్యకర్తలు గట్టిగా చెబుతున్నారు.  పరిశీలకులు విశ్లేషణలు కూడా అలాగే ఉన్నాయి. చూడాలి మరి పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో? 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu