ఏపీ రాజధాని పేరు అమరావతి?

 

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయంలో ఇప్పుడు రాజధాని సరిహద్దులతో సహా పూర్తి క్లారిటీ వచ్చేసింది. భూ సమీకరణ అంశం కూడా చాలా సులభంగా పరిష్కారమైపోతోంది. కొత్త రాజధానిని తెలుగు ప్రజలందరూ గర్వంగా తలెత్తుకునే అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆలోచనలు కొత్త రాజధాని నగరానికి ఏ పేరు పెడితే బాగుంటుందన్న అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పేరును ‘అమరావతి’ అని పెడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి అశోకుడి కాలం నుంచీ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. అలాగే ప్రసిద్ధ శైవక్షేత్రం కూడా. అలాగే శాతవాహనుల కాలంలో తెలుగువారికి రాజధానిగా విలసిల్లిన ధరణి కోట కూడా అమరావతి దగ్గర్లోనే వుంది. ఉజ్వలమైన భవిష్యత్తు వున్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమోఘమైన చరిత్ర కూడా వున్న అమరావతి పేరు పెట్టడం సముచితమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. అలాగే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజధానికి అమరావతి అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

 

ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ రాజధానికి పెట్టడం వల్ల రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చాలా త్వరగా వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బౌద్ధ ధర్మాన్ని ధ్వనించే పేరు రాజధానికి పెడితే రాజధాని అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా ‘ఆఫర్’ ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే బౌద్ధ ధర్మం ప్రబలంగా వున్న జపాన్ లాంటి దేశాలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి బౌద్ధ ధర్మాన్ని ధ్వనించే పేరు పెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాయని, అలాంటి పేరు పెడితే తాము భారీగా పెట్టుబడులు పెడతామని చెప్పాయన్న వార్తలు కూడా వచ్చాయి. ‘అమరావతి’ అనే పేరు రాజధానికి పెట్టడం వల్ల ఏపీ రాజధాని ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి జరిగి ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాది బౌద్ధులను ఆకర్షించే అవకాశం కూడా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

ఇదిలావుంటే, మరోవైపు ప్రత్తిపాటి పుల్లారావు లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి తెలుగువారు గర్వించదగ్గ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు పేరు కలసి వచ్చేలా ఎన్టీఆర్ నగర్ అని కానీ, తారకరామ నగర్ అని కానీ పెడితే బావుంటుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా, నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పేరు విషయంలో చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఎలా వుంటుందో చూడాలన్న ఆసక్తి ఇప్పుడు రోజురోజుకూ పెరుగుతోంది.