30 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడం ఎందుకు కష్టం అవుతోంది..!


ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కెరీర్‌ గురించి ఆలోచించడం,  గోల్స్ అచీవ్ చేయడం వంటివి దృష్టిలో ఉంచుకోవడం లేదా ఇతర కారణాల వల్ల 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకునే వారు అధికం అయ్యారు.  కాస్త తొందరగా పెళ్లి చేసుకున్నా  గర్భధారణను మాత్రం 30 ఏళ్ల తర్వాత   ప్లాన్ చేస్తున్నారు. కానీ సరిగ్గా గమనిస్తే నేటికాలంలో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న అధిక శాతం మంది 30 ఏళ్ల తర్వాత వయసు ఉన్నవారే.. మహిళ యొక్క సంతానోత్పత్తి ప్రయాణం పుట్టుక నుండే ప్రారంభమవుతుంది.

ఒక అమ్మాయి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు,  ఆ సమయంలో ఆమె అండాశయాలలో అండాల సంఖ్య లక్షల్లో ఉంటుందని గైనకాలజిస్టులు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. అంతేకాదు.. ఈ సంఖ్య జననం సమయంలో దాదాపు 1–2 మిలియన్లకు పడిపోతుంది.  యుక్తవయస్సు వచ్చే సమయానికి 50–60 వేల అండాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దీని అర్థం స్త్రీ వయస్సు పెరిగే కొద్దీ ఆమె సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 30 ఏళ్ల తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గడం వల్లే గర్భధారణలో ఇబ్బందులు తలెత్తుతాయి.


స్త్రీకి PCOD లేదా PCOS వంటి హార్మోన్ల సమస్యలు, పీరియడ్స్ సమయంలో అధిక నొప్పి లేదా అసాధారణ రక్తస్రావం (చాలా తక్కువ లేదా ఎక్కువ),  ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధి ఉంటే, అది మరింత సమస్యగా  మారుతుంది. ఇక టెక్నాలజీ ఉపయోగించి గర్భధారణ అనేది నేటికాలంలో చాలా జరుగుతోంది.  వాస్తవానికి, IVF ఒకసారి విఫలమైన తర్వాత మళ్ళీ దానికి డబ్బు కట్టి ప్రయత్నించాలా  అనేది చాలా మంది సందేహం.  ప్రతి స్త్రీ శరీరం,  హార్మోన్ల ప్రతిస్పందన ఒకేలా ఉండదు. కొంతమంది మహిళల శరీరాలు ఎక్కువ అండాలు ఉత్పత్తి చేస్తాయి, దీనిని హైపర్ స్టిమ్యులేషన్ అంటారు, మరికొన్ని ఆశించిన సంఖ్యలో అండాలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి.

IVF టెక్నాలజీకి కూడా హామీ లేదా..

IVF ద్వారా గర్భధారణకు ప్రయత్నించినా  అది  ఇంజెక్షన్,  ట్రీట్మెంట్  మోతాదును వేర్వేరు సైకిల్స్ లో  మార్చాలి. IVFలో మూడు లేదా నాలుగు సైకిల్స్ లో  ఎవరైనా గర్భవతి అవుతారని హామీ ఇవ్వడం సాధ్యం కాదని నిపుణులు  స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి హామీ ఎవరైనా ఇస్తున్నారంటే కేవలం ఒక స్కామ్ మాత్రమే అంటున్నారు.

                               *రూపశ్రీ.