పెళ్లికి ముందు అమ్మాయిలు కోరుకునేవి ఇవే..!   ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. వయసుకొచ్చినప్పటి నుంచే పెళ్లి గురించి రకరకాల కలలు కంటూ ఉంటారు అమ్మాయిలు. తనకు కాబోయేవాడు అందంగా ఉండాలని.. మంచివాడై ఉండాలని.. తనను, తన కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు కావాలని అనుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో పెళ్లి విషయంలో అమ్మాయిల ఆలోచన సరళి పూర్తిగా మారిపోయింది. అదేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=VhI_6urqrSk

నీటిలో దీపాలు.. ఇళ్లంతా అందం   దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపం దీప్తినిస్తుంది.. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మీకి నమస్కరించుకుంటారు. అనంతరం దీపాలను తులసికోట వద్ద.. వాకిట్లో ఉంచుతారు.. పండుగనాడు మట్టిప్రమిదలను వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాస్తంత క్రియేటివిటీ జోడించి మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో దీపాలు వెలిగించవచ్చు. కుందన్స్, రంగు రంగుల రాళ్లతో దీపాలను తయారు చేసి వాటిని నీటిలో ఉంచితే వచ్చే అందమే వేరు. అవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=iG0MqO5maXg  

మట్టిప్రమిదను ఇలా మోడ్రన్‌గా తయారు చేసుకోండి..!   దీపావళి వస్తుందంటే ముందుగా అందరూ చేసే పని ఇంటిని శుభ్రపరచడం, తర్వాత ఇంటిని అందంగా అలంకరించుకోవడం, డిఫరెంట్ లైట్లు, ఆకర్షించే ముగ్గులు, రంగు రంగుల ప్రమిదలు ఇలా రకరకాలుగా ఇంటిని డెకరేట్ చేస్తుంటారు. అయితే తరతరాలుగా దీపావళీ నాడు మట్టిప్రమిదలను వాడటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎప్పుడూ పాత పద్దతులేనా..? కొత్తగా ప్రయత్నించరా..? అంటూ కొందరు మొహం మీద అనేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి సమాధానంగా కేవలం మట్టి ప్రమిదనే ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చంటున్నారు ఇంటీయర్ డిజైనర్లు. అలా ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=yDqvkzbgWcE    

చాలా సింపుల్‌గా కుందన్ రంగోళి చేసుకోండి   దీపావళి వచ్చిందంటే చాలు పండుగకు నెల రోజుల ముందు నుంచే ప్రమిదలు, నెల రోజులకు కావాలసిన వొత్తులు తయారు చేస్తుంటారు మహిళలు. కానీ కాలం మారింది.. ఫెస్టివల్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు రంగు రంగులతో, సరికొత్త డిజైన్లతో అలంకరణ వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అందుకు తగినట్లుగానే చుట్టుపక్కలవారి కంటే కొత్తగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా డెకరేషన్ ఐటమ్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో అలంకరణ వస్తువులు తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=m2ngT7CusFs    

దీపావళికి పూజా తాలీని సింపుల్‌గా తయారు చేసుకోండి   సిరులు ప్రసాదించే చల్లని తల్లి శ్రీమహాలక్ష్మీని పూజించడం దీపావళి స్పెషల్. దీపోత్సవానికి ప్రతీక అయిన దీపావళిని స్పెషల్‌గా జరుపుకోవాలని పండగకు నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తుంటారు అతివలు. వెలుగుల పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవటానికి డెకరేషన్ ఐటమ్స్‌ని ప్రిఫర్ చేస్తుంటారు. మార్కెట్‌లో కొత్తగా వచ్చిన డిఫరెంట్ ఐటమ్స్.. అంటే తోరణాలు, హ్యాంగర్స్, లైటింగ్స్‌, వివిధ రకాల ముగ్గుల స్టిక్కర్స్, కలర్‌ఫుల్ ఫ్యాన్సీ క్యాండిల్స్‌ల కోసం బోలెడంత ఖర్చు చేస్తుంటారు. కానీ మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఆ ఐటెమ్స్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం.. https://www.youtube.com/watch?v=MPWYVV8NUZk  

మన పండుగలకి వేడుకలు ఎక్కువ . వచ్చే పోయే బందువులే కాదు , ఆట పాటలు , సరదాలు కూడా ఎక్కువే . ఉదాహరణకి ఇప్పుడు ఈ దేవీ నవరాత్రులనే తీసుకోండి . దేశమంతా నృత్యాలతో సాయంత్రాలు రంగులద్దుకుంటుంది. ఒకో ప్రాంతంలో ఒక్కో ఆచారం. కాని అన్ని ప్రాంతాలలో చాలా కామన్‌గా వుండే విషయం మాత్రం నృత్యం . మన తెలంగాణా రాష్ట్రంలో కూడా బతుకమ్మ వేడుకల్లో పాట, నృత్యం ముఖ్య పాత్ర పోషిస్తాయి . రిథమిక్‌‌గా సాగే పాటకి అనుగుణంగా పాదాలు కదుపుతుంటే మనసు ఆనందంతో నిండి పోతుంది . ఇదిగో సరిగ్గా ఇదే విషయాన్ని అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు నార్వే పరిశోధకులు.   ఆటలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వుండే వారు ఎంతో ఆరోగ్యం గా వుంటునట్టు తెలిసిందిట వీరి అధ్యయనంలో . వీరు సంతృప్తితో జీవిస్తునట్టు, ఆనందంగా వుంటునట్టు, అలాగే మంచి సంబంధ భాందవ్యాలు కలిగివుంటునట్టు కూడా తేలిందిట . ఎందుకు అంటే అలాంటి కార్యక్రమాలు మెదడు, మనసు, రోగ నిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపించటం వల్ల అయ్యుండవచ్చు అని చెబుతున్నారు.   ఒత్తిడి తగ్గి ఆ ప్రభావం ఆరోగ్యం మీద పడుతుందని భావిస్తున్నారు. కాబట్టి వీరు చెప్పేది ఏంటంటే పండగ వస్తే హమ్మయ్య సెలవు దొరికింది అనుకుంటూ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య వుండి పోకండి. అలా బయట పడి నలుగురిని కలవండి, ఆడి పాడండి.. ఆరోగ్యంగా వుండండి అంటున్నారు. ఒకప్పుడు మన పెద్దలు చేసింది అదే కదండీ ! ఏ వేడుకని అయినా అందరు కలసి ఆట పాటలతో గడిపేవారు. బహుశా వాళ్ళు అప్పుడు ఆరోగ్యంగా వుండటానికి అది కూడా ఒక కారణం ఏమో ! మరి మీ చుట్టూ పక్కల పండగ హడావుడి ఎలా వుందో చూడండి ఒకసారి. వీలు చేసుకుని మరీ మీరూ అడుగు కలపండి. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి .   -రమా

మహిళా క్రికెట్లో స్టార్... హర్మన్ప్రీత్ కౌర్     క్రికెట్ని కూడా ఒక మతంగా భావించే మన దేశంలో... ఆడవారి క్రికెట్ని పట్టించుకునేవారే కనిపించరు. తమ అభిమాన క్రికెటర్ల రికార్డులన్నీ పొల్లుపోకుండా చెప్పే జనం, మిథాలీ రాజ్ అన్న పేరు తప్ప మరో మహిళా క్రికెటర్ గురించే విని ఉండరు. అలాంటిది దేశం యావత్తూ తలతిప్పి తనవంక చూసేలా చేశారు ‘హర్మన్ప్రీత్ కౌర్’. ప్రపంచ మహిళా క్రికెట్ పోటీలో విజయపు అంచులదాకా తీసుకువెళ్లారు. హర్మన్కౌర్ గురించి మరిన్ని విశేషాలు... 1989లో పంజాబులోని మోగా అనే చిన్న పట్నంలో జన్మించారు హర్మన్. ఆమె తండ్రి బాస్కెట్బాల్లో గొప్ప క్రీడాకారుడు. దాంతో సహజంగానే హర్మన్కు ఆటలంటే ఇష్టం ఏర్పడింది. వీధుల్లో క్రికెట్ ఆడుతూ చెలరేగిపోయేది. అలా ఓసారి కమల్దీష్ సింగ్ అనే కోచ్ కంట్లో పడింది. హర్మన్లోని ప్రతిభను గమనించిని కమల్దీష్, ఆమె క్రికెట్ నేర్చుకునేందుకు కావల్సిన సదుపాయాలన్నీ కల్పించాడు. తనకి దక్కిన అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకున్నారు హర్మన్. అంచెలంచెలుగా ఎదుగుతూ 2009లో జాతీయ జట్టుకి ఎంపికయ్యారు. అక్కడి నుంచి ఇక ఆమె వెనుదిరిగి చూడలేదు. వన్డే అయినా, టెస్ట్ అయినా T20 అయినా బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ తన ప్రతిభ కనబరిచారు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో ఏకంగా 9 వికెట్లు తీసుకున్నా, 2016లో 31 బంతులలో 46 పరుగులు చేసి ఆస్ట్రేలియా మీద T20 సిరీస్ గెల్చుకున్నా... మన మహిళా క్రికెట్ సాధించిన అనేక విజయాల వెనుక హర్మీన్ అండ ఉంది. అందుకే 2012లో ఆమెను T20 జట్టుకు కేప్టెన్గా నియమించారు. మన దేశం నుంచి విదేశీ క్రికెట్ క్లబ్బుకు ఎంపికైన తొలి వ్యక్తిగా కూడా హర్మన్ రికార్డు సృష్టించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే మొన్నటికి మొన్న జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్స్లో హర్మన్ సాధించిన స్కోర్ ఓ అద్భుతం. ఆ రోజు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ్కప్ నెగ్గిన ఆస్ట్రేలియాకు భారత్ ఏమాత్రం పోటీ ఇవ్వలేదని అనుకున్నారు. దానికి తోడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది. ఆ సమయంలో వచ్చిన హర్మన్ కౌర్ స్టేడియం నలుమూలలకీ తన బ్యాట్ను ఝుళిపించారు. తన అభిమాన క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్నే మైమరపించేలా, 115 బంతులలో 171 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. మహిళల ప్రపంచ కప్లో భారత్కి ఇదే అత్యుత్తమ స్కోరు. ఆ రోజు మన దేశం గెలిచిందని వేరే చెప్పాలా! ప్రపంచ కప్ ఫైనల్స్లో కూడా హర్మన్ 51 పరుగులతో చెలరేగారు. కానీ దురదృష్టం! కేవలం 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవలసి వచ్చింది. ఏది ఏమైనా ఈసారి ప్రపంచకప్లో హర్మన్ ప్రదర్శన పుణ్యమా అని దేశం అంతా మహిళల క్రికెట్కు కూడా ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. తప్పదు కదా! ఆడవారే కదా అని సమాజం వీలైనంతవరకూ పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఏదో ఒక రోజు, తల తిప్పి నోళ్లు వెళ్లబెట్టి పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. - నిర్జర.    

  ఈ టీవీ సీరియల్ మన దేశాన్నే మార్చేస్తోంది!     ఆడపిల్ల పుట్టబోతోందని తెలిస్తే చంపేయడం, భార్యని గొడ్డుని బాదినట్లు బాదటం, మొహం మీద యాసిడ్ పోయడం... లాంటి వార్తలు మనకి కొత్త కాదు. దేశంలో ఎక్కడ చూసినా ఆడవాళ్లకి ఏదో ఒక సమస్యే! ప్రతి చోటా వివక్షే! కాకపోతే ఒకో చోట ఒకోలా ఉంటుంది. ఆఫీసులో పనిచేసే ఆడవాళ్లకి ఒక బాధ. మారుమూల పల్లెటూరిలో ఉండే ఆడపిల్లది మరో కష్టం. ఒక టీవీ సీరియల్ ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా నిలుస్తోందంటే నమ్మగలరా! దూరదర్శన్! ఈ పేరు చెబితేనే ఇప్పటి ప్రేక్షకులు మొహం చిట్లించుకుంటారు. నాలుగు గోడల మధ్య నడిచే నాటకాలు, సంగీత కార్యక్రమాలు, నాణ్యత లేని దృశ్యాలు, ప్లాస్టిక్ పూలు... ఇలాంటివే గుర్తుకువస్తాయి దూరదర్శన్ను తల్చుకుంటే. కానీ ఇప్పటికీ మన దేశంలోని మారుమూల ప్రాంతవాసులకి ఇదే దిక్కు. పైసా ఖర్చు లేని వినోద సాధనం. ముఖ్యంగా బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలలో దూరదర్శన్ది కీలకపాత్ర. ఇదే విషయాన్ని సానుకూలంగా మార్చుకోవాలనుకున్నారు ‘ఫిరోజ్ అబ్బాస్ ఖాన్’ అనే బాలీవుడ్ డైరక్టర్. దూరదర్శన్ ద్వారా సామాన్య ప్రజల ఆలోచనావిధానంలో మార్పు తీసుకురావాలని అనుకున్నారు.     Population Foundation of India అనే సంస్థతో కలిసి ఫిరోజ్ ‘నేను ఏదైనా సాధించగలను’ (మై కుచ్ భీ కర్ సక్తీ హూ - MKBKSH) అనే ఒక సీరియల్ తీయాలని అనుకున్నారు. మన దేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద అవగాహన కల్పించడం, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడం... ఈ సీరియల్ వెనుక ఉన్న లక్ష్యం. ఇందుకోసం ఈ సీరియల్ బృందం ఏడాది పాటు దేశమంతా తిరిగారు. ఆడవాళ్ల ఇబ్బందులన్నింటినీ గ్రహించే ప్రయత్నం చేశారు. వాటికి పరిష్కారం చూపేలా కథని రూపొందించుకున్నారు. 2014లో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో కథానాయిక పాత్ర పేరు - డా॥ స్నేహా మాధుర్. సాటి ఆడవాళ్ల కోసం స్నేహా తన కెరీర్ను వదులకుని పల్లెబాట పడుతుంది. ఆ ప్రయాణంలో డా॥ స్నేహాతో కలిసి ప్రేక్షకులని నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఏదో సాదాసీదాగా సాగిపోతుందనుకున్న సీరియల్కి ఆరంభంలోనే అద్భుతమైన ప్రతిస్పందన కనిపించింది. ఇతర దేశాల ప్రేక్షకులు కూడా దీన్ని చూడసాగారు. ఆఖరికి దీన్ని రేడియోలలో కూడా ప్రసారం చేయడం మొదలుపెట్టారు.     ఈ సీరియల్ మొదలై ఏడాది గడిచేసరికి ఎక్కడలేని ప్రచారం వచ్చింది. బాలీవుడ్ తారలు, సమాజసేవకులు.... ఈ సీరియల్ అద్భుతమనీ, దీన్ని చూసి తీరాల్సిందే అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రోత్సాహంతో నిర్మాతలు రెండో ఏడు కూడా సీరియల్ను కొనసాగించారు. మొదటి ఏడాది శిశుహత్యలు, బాల్యవివాహాలు, గృహ హింస లాంటి ప్రధాన సమస్యల గురించే ప్రస్తావించారు. కానీ ప్రేక్షకుల ఆదరణతో మరికాస్త దూకుడు పెంచి సెక్స్ ఎడ్యుకేషన్కి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఏడాదిపాటు ఈ సీరియల్ ప్రసారం అయిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నారు నిర్మాతలు. అందుకోసం మూడువేలకు పైగా గ్రామాలలో ఒక సర్వేని నిర్వహించారు. ఈ సీరియల్తో గ్రామీణ భారతంలో ఎంతో మార్పు వచ్చినట్లు తేలింది. ఆడపిల్లల చదువు, బాల్య వివాహాలు, వెంట వెంటనే పిల్లల్ని కనడం... లాంటి అనేక విషయాల మీద 70 శాతానికి పైగా ప్రజలలో అవగాహన ఏర్పడింది. అంతేకాదు! భార్యని తన్నడం భర్త హక్కు, ఆడది మగవాడితో సమానం కాదు లాంటి అపోహలు నుంచి ఆడవాళ్లు బయటపడ్డారు.     ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశ టీవీ చరిత్రలో ఇంత ప్రభావవంతమైన సీరియల్ ఇప్పటివరకు రాలేదని అంటున్నారు. అంతేకాదు! ఇప్పటివరకూ ఈ కార్యక్రమాన్ని 40 కోట్ల మంది చూశారట. ప్రేక్షకుల సంఖ్యాపరంగా చూసినా ఇది ఒక రికార్డే. ఇన్నాళ్లు మన టీవీలు, సినిమాలు ఆడవాళ్లని ‘పడిపోయే’ వస్తువులుగానూ, పనికిమాలిన కుట్రలు చేసే పాత్రలుగానే చూపించాయి. దీనికి భిన్నంగా వారి బాగోగుల గురించి ఆలోచించి, పరిష్కారం చూపే కార్యక్రమం రావడం మంచిదే కదా! - నిర్జర.

  ఆమె ముందు ఎవరెస్టయినా తలవంచాల్సిందే!     మే 21 మన వార్తాపత్రికలు ఎప్పటిలాగే మసాలా కబుర్లతో నిండిపోయాయి. ఛానళ్లు రకరకాల చర్చలతో హోరెత్తిపోయాయి. అదే సమయంలో-  ఒక మనిషి హిమాలయాల మీద మువ్వన్నెల జెండాను ఎగరవేయాలనీ, అక్కడకు చేరి బుద్ధుని స్మరించాలనీ కోరుకుంటోంది. ఇప్పటిదాకా ఎంతోమంది ఆ పని చేసి ఉంటారు. కానీ ఆమె ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే! ‘అన్షు జంపసేన’ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళ. ఆమె భర్త ‘సెరింగ్ వాంగే’ ఓ పర్వతారోహకుడు. Arunachal Mountaineering & Adventure Sports Association అనే విభాగంలో పనిచేస్తున్నాడు. స్వతహాగా పర్వతాల మధ్య పెరిగిన అన్షుకి కూడా భర్త అడుగుజాడలలో పర్వతారోహణ చేయాలన్న ఆసక్తి మొదలైంది. దాంతో భర్త పనిచేసే సంస్థలోనే చేరి పర్వతారోహణలతో కఠోర శిక్షణని పొందింది. ఓ రెండేళ్లపాటు అందులో మెలకువలన్నీ ఒడిసిపట్టిన తర్వాత, ఎవరెస్టు శిఖరాన్నయినా అధిరోహించేందుకు సిద్ధపడ్డారు అన్షు.     2011లో మొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు అన్షు. కానీ ఆ శిఖరం మహిమ ఏమిటో కానీ, ఒక్కసారి అక్కడకు చేరుకున్నాక మళ్లీ అక్కడకు వెళ్లాలనిపిస్తుందని అంటారు అన్షు. ఆ ప్రపంచపు ఎత్తుకి చేరుకున్న తర్వాత భగవంతుని స్వయంగా చూసిన అనుభూతి కలుగుతుందని అంటారు. అందుకనే మొదటిసారి ఎవరెస్టుని చేరుకున్న పదిరోజులలోనే మళ్లీ అక్కడకు వెళ్లారు. అలా పదిరోజుల వ్యవధిలో ఎవరెస్టుని రెండుసార్లు అధిరోహించిన మహిళగా చరిత్ర సృష్టించారు. 2013లో అన్షు మరోసారి ఎవరెస్టుని అధిరోహించారు. ప్చ్! అయినా తనివి తీరలేదు. ఎవరెస్టు పట్ల ఉన్న అనుబంధం ఆమెని నిలవనీయలేదు. అందుకోసం 2017 మేలో ఎవరెస్టుని, రెండుసార్లు వెంటవెంటనే ఎక్కాలని అనుకున్నారు. ఇదేమంత తేలిక కాదని ఆమెకు తెలుసు. ఎవరెస్టు బేస్ క్యాంప్ దగ్గర నుంచి శిఖరాన్ని చేరుకోవడం సాహసంతో కూడుకున్న పని. ప్రాణాలకు సైతం గ్యారెంటీ ఉండని సాహసం. శిఖరాన్ని చేరుకునేందుకు నెలరోజులకు పైనే పట్టవచ్చు. పైగా అన్షుకి ఇప్పుడు 38 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇవేవీ ఆమెకు ప్రతిబంధకంగా కనిపించలేదు. ఎవరెస్టు మీద జెండా రెపరెపలాడటం కోసం, అక్కడ తనకి లభించే అలౌకికమైన ఆనందం కోసం శిఖరాన్ని చేరుకునేందుకు బయల్దేరింది.     మే 16 నుంచి మే 21 లోపల అన్షు రెండుసార్లు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కారు. అలా ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టు ఎక్కిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. సామాన్యంగా ఒక్కసారి ఎవరెస్టు ఎక్కేసరికే ఒళ్లు హూనమైపోతుంది. మరో నెలరోజులకి కానీ శరీరంలో మన స్వాధీనంలోకి రాదు. అలాంటిది వెంటనే రెండోసారి ఎక్కడా ఆగకుండా శిఖరాన్ని చేరుకోవడం అంటే అద్భుతమే! ఒకవైపు మనసు అలిసిపోయి ఉంటుంది, శరీరంలోని నరనరమూ నొప్పి పెడుతూ ఉంటుంది. కానీ ‘లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనే ఉంటే ఎలాంటి బాధనైనా అధిగమించవచ్చు,’ అని చెబుతారు అన్షు! ఆ తపనతో అన్షు ఎవరెస్టే చేరుకోగా లేనిది.... మనం చిన్నపాటి సమస్యలని అధిరోహించలేమా!!! - నిర్జర.  

  పెప్పర్‌ స్ప్రే కథ వింటారా!     నిర్భయ హత్యకేసు గురించి కొత్తగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదు. రాజధాని నడిబొడ్డున సాగిన ఆ దౌర్జన్యకాండ దేశాన్ని తలదించుకునేలా చేసింది. నేరం జరిగిన తర్వాత న్యాయం చేసేందుకు ఎన్ని చట్టాలు ఉంటే మాత్రం ఏం ప్రయోజం? ముందు ఆ నేరాన్ని అడ్డుకునేలా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రచారం మొదలైంది. అందులో భాగంగా పెప్పర్‌ స్ప్రే గురించి తరచూ వినపడుతోంది.   ఇంతకీ ఈ పెప్పర్‌ స్ప్రే కథ ఏంటి? ఇదీ చరిత్ర! శత్రువుని కాసేపు షాక్‌కు గురి చేయడానికి కారాన్ని వాడే అలవాటు, వేల సంవత్సరాల నుంచే ఉంది. కానీ అది పెప్పర్‌ స్ప్రే రూపంలోకి వచ్చి నలభై ఏళ్లు కూడా కావడం లేదు. అప్పట్లో క్రూరజంతులు ఏవన్నా వెంటపడుతుంటే వాటి నుంచి తప్పించుకోవడానికి దీన్ని వాడేవారు. కానీ జంతువులకంటే మదమెక్కిన మనుషుల నుంచి తప్పించుకోవడం మరింత ప్రమాదకరం అని తేలడంతో... దాన్ని సాటి మనుషుల నుంచి ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగించసాగారు. ఇదీ ఫలితం! నిజానికి పెప్పర్‌ స్ప్రే అంటే కారం కలిపిన నీరు కాదు. కానీ మిర్చికి ఇది దగ్గరి చుట్టమే! Capsicumగా పిల్చుకునే మిర్చిజాతి మొక్కల నుంచి తీసే Capsaicin అనే రసాయనంతో ఈ స్ప్రేను తయారుచేస్తారు. ఇది మొహం మీద పడిన వెంటనే... దాడి చేస్తున్నవారు అసంకల్పితంగా కళ్లు మూసుకోక తప్పదు. వాళ్లు కళ్లు నులుముకునేకొద్దీ ఇది మరింతగా శరీరంలోకి చొచ్చుకుపోతుంది. ఊపిరి పీల్చుకునేకొద్దీ మరింతగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాంతో మనిషి ముందుకి వంగిపోయి తీవ్రంగా దగ్గడం మొదలుపెడతాడు. దాదాపు పావుగంట పాటు అసలు మాట్లాడటం కూడా సాధ్యం కాదు. పెప్పర్‌ స్ప్రేకి వాపు కలిగించే గుణం (inflammation) ఉంటుంది. కాబట్టి కనురెప్పలు వాచిపోయి తాత్కాలికంగా దృష్టి కనిపించదు. ఊపిరితిత్తులు వాచిపోయి ఊపిరి కూడా కష్టమైపోతుంది. ప్రాణాంతకం కాదు! పెప్పర్‌ స్ప్రే చల్లాక అవతలి మనిషి కాస్త కోలుకోవడానికి ఓ గంట పడుతుంది. ఈలోగా అవతలి మనిషి నుంచి తప్పించుకుని పారిపోవడానికో అతన్ని అదుపులో తీసుకోవడానికో కావల్సినంత సమయం చిక్కుతుంది. గంటలు గడిచేకొద్దీ అతను నిదానంగా సాధారణ స్థితికి వచ్చేస్తాడు. అయితే ఆస్తమా, గుండెజబ్బులు వంటి సమస్యలలో మాత్రం ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. మరీ కళ్ల మీదే పెట్టి స్ప్రే చేయడం వల్ల కంటిచూపు దెబ్బతినవచ్చు. జాగ్రత్తలు: పెప్పర్‌ స్ప్రే నీటిలో కరగదు. కాబట్టి అది ఒంటి మీద పడ్డాక నీటితో కడుక్కొని ప్రయోజనమే లేదు. బేబీ షాంపూతో కడుక్కోవడం వల్లే కాస్త ఉపశమనం లభిస్తుందట. కళ్లని మాటిమాటికీ ఆర్పే ప్రయత్నం చేయడం వల్ల, కంట్ల పడ్డ స్ప్రే కూడా నీరులా కారిపోయే అవకాశం ఉంది. నిదానంగా, గాఢంగా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేయడం వల్ల ఊపిరితిత్తులూ కోలుకుంటాయి. రక్షణ కోసం దాచుకున్న పెప్పర్‌ స్ప్రే పొరపాటున మన కంట్లోనే పడే ప్రమాదం ఉంది కాబట్టి, కంపెనీలు చాలా జాగ్రత్తగా దాన్ని రూపొందిస్తాయి. కీచెయిన్‌ లాగితేనో, మూత పూర్తిగా తిప్పితేనో అందులో స్ప్రే బయటకి వచ్చేలా చర్యలు తీసుకుంటాయి. మన దగ్గర చట్టబద్ధమే! ఇదీ పెప్పర్‌ స్ప్రే కథ. చాలా దేశాలలో కేవలం పోలీసులు మాత్రమే ఈ పెప్పర్‌ స్ప్రేని ఉపయోగించే అవకాశం ఉంది. అదృష్టవశాత్తూ మన దేశంలో దీన్ని ఎవరైనా ఆత్మరక్షణ కోసం వాడవచ్చు. పిచ్చిపట్టిన జంతువులు దగ్గర్నుంచీ, జంతుస్వభావం ఉన్న మనుషుల వరకూ ఎవరి నుంచైనా రక్షణ పొందేందుకు దీన్ని ఉపయోగించవచ్చు. వీటి ఖరీదు కూడా ఏమంత ఎక్కువ కాదు. పైగా ఆన్‌లైన్ ద్వారా చాలా తేలికగా దొరుకుతాయి కూడా! పెప్పర్‌ స్ప్రే ఒక ఆయుధం లాంటిది. కాబట్టి అత్యవసరమైన సందర్భాలలో మాత్రమే దీన్ని ప్రయోగించాలన్న విచక్షణ చాలా అవసరం. ఎలా ఉంటుందో చూద్దామని మన మీదే ప్రయోగించుకోవడమో, పిల్లలకు దగ్గరగా ఉంచడమో, క్షణికోద్రేకానికే దాన్ని ప్రయోగించడమో చేస్తే మాత్రం చిక్కులు తప్పవు. - నిర్జర  

    ఉద్యోగంలో ఫిట్... తల్లిగా సూపర్ హిట్       కాలం మారింది. కాలంతో పాటుగా ఆడవారి ప్రయాణమూ మారింది. ప్రతి రంగంలోనూ మగవారికి తీసిపోకుండా దూసుకుపోతున్నారు. కానీ ఆ హడావుడిలో తల్లిగా తమ బాధ్యతని ఏమాత్రం విస్మరించడంలేదు. అందుకు సాక్ష్యంగా బ్యాంకింగ్, క్రీడలు, సమాజసేవ, రక్షణ రంగం.... ఇలా నాలుగు రంగాల్లో అద్భుతాలు సృష్టించిన  మాతృమూర్తులు వీరు. చందాకొచ్చర్:   23 ఏళ్ల వయసులోనే ICICI బ్యాంక్ ఉద్యోగినిగా అడుగుపెట్టారు చందాకొచ్చర్. ఉద్యోగంలో అంచెలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు అదే బ్యాంక్కు CEOగా మారారు. కానీ తల్లిగా తన పిల్లలకి ఏలోటూ రానీయలేదు. అందుకనే ‘నువ్వు ఉద్యోగంలో అన్ని బరువుబాధ్యతలని మోస్తున్నావనీ కానీ, ఎంతో ఒత్తిడిని భరిస్తున్నావని కానీ మాకు తెలియనీయలేదు. ఇంట్లో నువ్వు ఒక అమ్మలా మాత్రమే మెలిగేదానివి,’ అంటుంది ఆమె కూతురు ఆరతి. చందాకొచ్చర్ మాత్రం ఇందులో అద్భుతమేమీ లేదంటారు. జీవితంలోని ఆటుపోట్లని తట్టుకొంటూనే కుటుంబానికి ప్రేమని పంచే స్థైర్యం తన తల్లి నుంచే వచ్చిందంటారు. కాదనగలమా! మేరీ కాం: ఆడవాళ్లు బాక్సింగ్లోకి అడుగుపెట్టడమే అసాధ్యం. ఒక వేళ అడుగుపెట్టినా పెళ్లయిన తర్వాత బరిలోంచి తప్పుకోవాల్సిందే అని ఓ అభిప్రాయం. ఆ మాటలని కొట్టిపారేస్తారు మేరీ కాం. దీనికి ఆమె విజయాలే ఉదాహరణ. మణిపూర్లోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన మేరీ కాం, అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయస్థాయికి చేరుకున్నారు. ఒక పక్క కెరీర్ను కొనసాగిస్తూనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక మళ్లీ బరిలోకి దిగి ఒలింపిక్స్లో పతకాన్ని కూడా గెలుచుకున్నారు. అర్థం చేసుకునే కుటుంబం తోడుంటే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చునంటారు మేరీ కాం. కాదనగలమా! కిరణ్ బేడి:   కిరణ్ బేడి గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరమే లేదు! ఒక తరం మహిళలు ఆమెను ఆరాధిస్తూ, అనుసరిస్తూ పెరిగారు. ఢిల్లీ ట్రాఫిక్ని అదుపుచేయడం దగ్గర్నుంచీ, తీహార్ జైల్లో మార్పులు తేవడం వరకూ కిరణ్ సాధించిన విజయాల జాబితా చాలా పెద్దదే! క్రీడాకారిణిగా, పోలీస్ ఉన్నతాధికారిగా, రాజకీయవేత్తగా, సమాజసేవికగా, పుదుచ్చేరి గవర్నరుగా ఆమె చాలా పాత్రలే పోషించారు. కానీ తల్లిగా తన బాధ్యతను విస్మరించలేదు. బాధ్యత అంటే 24 గంటలూ ఇంట్లో ఉండటం కాకపోవచ్చు! కిరణ్ తన ఒక్కగానొక్క కూతురు సైనాకి జీవితం అంటే ఏంటో నేర్పారు. అందుకే సైనా ఇప్పుడు నలుగురూ మెచ్చుకునే సమాజసేవికలా మారింది. ‘ఈ దేశంలో అవినీతి లేకుండా చేయడమే నా లక్ష్యం. నా మనవరాలికి ఇంతకంటే గొప్ప బహుమానం ఏమివ్వగలను’ అని సైనాతో అంటారట కిరణ్. కాదనగలమా! టెస్సీ థామస్:     ఏదో మాటవరసకి ఆడవారు ఆకాశంలో సగం అంటూ ఉంటారు. కానీ ఆ మాటని నిజం చేసేవరకూ నిద్రపోలేదు కొందరు. అందుకు రుజువు కావాలంటే ‘క్షిపణ మహిళ’ టెస్సీ థామస్ను తల్చుకుంటే సరి. అబ్దుల్ కలామ్ సహాయకురాలిగా అడుగుపెట్టిన టెస్సీ ఆయన ఆశయాన్ని కొనసాగించే వారసురాలిగా నిలిచారు. శత్రు దేశాలను వణికించేలా, అగ్ని క్షిపణి ప్రాజెక్టుని ముందుకి నడిపించారు. టెస్సీ భర్త నౌకాదళంలో పనిచేయడంతో, ఆయన ఎప్పుడూ ఇంటికి దూరంగా ఉండేవారు. దాంతో ఉద్యోగాన్ని, పిల్లవాడినీ చూసుకోవాల్సిన బాధ్యత టెస్సీ మీదే ఉండేది. కానీ ‘అటు ఉద్యోగం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిగా, ఇటు బాధ్యతాయుతమైన తల్లిగా... శాస్త్రవేత్తలుగా మారాలనుకునే మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు టెస్సీ’ అంటోంది భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం. కాదనగలమా! - నిర్జర.  

అడవిలో అమ్మ.. ఎంబీబీఎస్ చదవని డాక్టర్... లక్ష్మి కుట్టి!     గొప్ప విజయాలు సాధించడానికి పెద్ద కుటుంబంలో పుట్టనక్కర్లేదు. గొప్ప బ్యాగ్రౌండ్ లో పెరగనక్కర్లేదు. గొప్ప గొప్ప చదువులు చదవనరక్కర్లేదు. ఆలోచన గొప్పగా ఉంటే చాలు. సంకల్పం గట్టిదైతే చాలు. లక్ష్మికుట్టిని చూస్తే ఎవరైనా ఈ విషయమే చెప్తారు. ఎందుకంటే ఆమె పెద్దగా చదువుకోలేదు. చెప్పుకోదగ్గ బ్యాగ్రౌండ్ లేదు. కానీ ఈరోజు ఆమె గురించి చెప్పుకోడానికి మాత్రం చాలా ఉంది.          తిరువనంతపురం జిల్లాలోని కల్లార్ అడవుల్లోని ఒక గిరిజన గ్రామంలో... ఓ చిన్న గుడిసెలో నివసిస్తుంది డెబ్భై అయిదేళ్ల లక్ష్మి కుట్టి. మామూలుగా చూస్తే ఆమె కూడా అందరిలాంటిదే కదా అనిపిస్తుంది. కానీ ఆమె గురించి తెలుసుకుంటే మాత్రం అందరిలో ఒకరు కాదు, అందనంత ఎత్తులో ఉన్నది అనిపిస్తుంది. లక్ష్మి... ఎంబీబీఎస్ చదవని డాక్టర్. పట్టాలు పొందని మేధావి. ఎటువంటి వ్యాధి అయినా, ఎలాంటి నలతనైనా క్షణాల్లో మాయం చేసేయగలదామె.      లక్ష్మి కుట్టి ఇంటి చుట్టూ రకరకాల మొక్కలుంటాయి. వాటి ఆకులు, వేర్లతో దాదాపు ఐదు వందల రకాల వ్యాధులకి వైద్యం చేస్తుంది. ఇంతవరకూ ఆమె ట్రీట్మెంట్ ఫెయిలయ్యింది లేదు. ఉండేది అడవిలో కావడంతో పాము కాటేసినా, విష పురుగు కరిచినా ఆమె దగ్గరకే పరిగెత్తుకు వస్తారు. క్షణాల్లో ఆ విషాన్ని తీసి పారేస్తుంది లక్ష్మి. ఆమె వైద్యం చూస్తే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం.        లక్ష్మికి ఈ మెళకువలన్నీ ఆమె తల్లి ద్వారా తెలిశాయి. వాటిని మరింత మెరుగు చేసి వీలైనంత మందికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది లక్ష్మి. మొదట లక్ష్మి వైద్యం అడవికే పరిమితమైపోయింది. కానీ కాలం గడిచేకొద్దీ విషయం మెల్లమెల్లగా అడవి చుట్టూ ఉన్న గ్రామాలకు పాకింది. దాంతో అక్కడి నుంచి కూడా వైద్యం కోసం లక్ష్మి దగ్గరకు వచ్చేవారు. వారి ద్వారా లక్ష్మి పేరు అందరికీ తెలిసిపోయింది. కేరళ మొత్తం లక్ష్మి పేరు జపించసాగింది.   ఆమె గొప్పదనం తెలిసి కేరళ ప్రభుత్వం 'నాటు వైద్య రత్న' అవార్డునిచ్చి సత్కరించింది. ఆమె కానీ, ఆమె తల్లి కానీ వాళ్లు చేసే వైద్య ప్రక్రియ గురించి పుస్తకం రాస్తే ప్రచురించడానికి కేరళ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిద్ధంగా ఉంది. కేరళ ఫోక్ లోర్ అకాడెమీ లక్ష్మిని గౌరవ అధ్యాపకురాలిగా నియమించుకుంది. ఆమె విజ్ఞనాన్ని మరికొందరికి అందించే ప్రయత్నం చేస్తోంది. ఇవి కాక ఆమెకు లభించిన ప్రశంసలు, ప్రశంసాపత్రాలు, అవార్డులు, రివార్డులు ఎన్నెన్నో.         ఇంత సాధించినా దాని గురించి ఏమీ మాట్లాడదు లక్ష్మి. ఎవరైనా పొగిడినా... "నేను సాధించింది ఏమీ లేదు, మా అమ్మ నాకు నేర్పింది, నేను నేర్చుకున్నదానితో పదిమందికి సేవ చేస్తున్నాను అంతే" అంటుంది సింపుల్ గా. తరచూ ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి వైద్య సేవలు అందించడమో, ప్రకృతి గురించి ప్రచారం చేయడమో చేస్తూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది లక్ష్మి. వైద్యం చేయడంతో పాటు ఆప్యాయత నిండిన మాటలతో ఆమె ఓదార్చే తీరు చూసి అందరూ ఆమెను ప్రేమగా అమ్మా అని పిలుస్తుంటారు. 'అడవికి అమ్మమ్మ' (గ్రాండ్ మదర్ ఆఫ్ ఫారెస్ట్) అంటూ బిరుదు కూడా ఇచ్చారు.       అందరికీ ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచే లక్ష్మి జీవితంలో మాత్రం చాలా విషాదం ఉంది. ఆమె పెద్ద కుమారుడు ఓ మదపుటేనుగు బారిన పడి మరణించాడు. చిన్న కుమారుడు కూడా ఓ ప్రమాదంలో కన్ను మూశాడు. కొన్నాళ్ల క్రితమే భర్త కూడా ఆమెను విచిడిపెట్టి వెళ్లిపోయాడు. వాళ్లందరి జ్ఞాపకాలూ మనసును గుచ్చుతున్నా తన కర్తవ్యాన్ని మాత్రం క్షణం మర్చిపోదు లక్ష్మి. ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు, సిటీకి వచ్చి మీ సేవలు అందించండి అన్నా కూడా ఆమె వినదు. "ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. కన్నుమూసే వరకూ ఇక్కడే ఉంటాను.   అడవిని దాటొచ్చి సేవ చేస్తాను కానీ ఈ అడవిని మాత్రం ఎప్పటికీ వదలను" అని తేల్చి చెప్పేస్తుంది లక్ష్మి. కాస్తం గుర్తింపు రాగానే మూలాలు మర్చిపోయే మనుషులున్న ఈ రోజుల్లో... అడవి తల్లికే తన జీవితం అంట్లోన్న లక్ష్మికుట్టిని అభినందించి తీరాలి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాస్ట్ లీ ఎక్విప్ మెంట్ తో లభించే వైద్యాన్ని కేవలం ఆకులు, వేర్లతో అందిస్తోన్న ఆమె ప్రతిభకి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి! - Sameera

  నగ్నంగా ఫొటో పెడితే చెప్పుకునే దిక్కు లేదు!       సోషల్ మీడియాలో ఆకతాయిల వేధింపులు సర్వసాధారణం. ఆ వేధింపులని పంటిబిగువున సహించడమో, సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లని మూసేసుకుని అజ్ఞాతంగా గడిపేయడమో తప్ప అమ్మాయిలకు మరో మార్గం కనిపించదు. ఒకవేళ ధైర్యంగా అడుగు ముందుకు వేసి పోలీస్స్టేషన్లోకి ప్రవేశించారే అనుకోండి.... ఏం జరిగిందో మీరే చూడండి. ఏప్రిల్ 7న రాజస్థాన్కి చెందిన సలేహా అనే జర్నలిస్టు తన ఫేస్బుక్లో రాసుకొచ్చిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇందులో తన 17 ఏళ్ల చెల్లెలు ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించారు సలేహా. సలేహా చెల్లెలికి ఒక రోజు ఇన్స్టాగ్రాంలో ఓ మెసేజ్ వచ్చిందట. అందులో నగ్నంగా ఉన్న తన ఫొటో చూసి ఆమెకి నోట మాట రాలేదు. ఎవరో ఆమె మొహానికి ఓ నగ్న చిత్రాన్ని జోడించి పంపాడు. అంతేకాదు... తను చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే, ఆ ఫొటోని సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తానని హెచ్చరికలు పంపాడు. ఆ మెసేజ్ చూసి భయపడిపోయిన సలేహా చెల్లెలు, జరిగిన విషయాన్ని ఇంట్లో పెద్దవారికి చెప్పింది.     సలేహా తండ్రి వెంటనే తన చిన్న కూతురిని తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సైబర్ నేరాలని నమోదు చేయాలంటే వేరే పోలీస్ స్టేషన్కి వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి వారిని పంపేశారు. సైబర్ సెల్కు చేరుకుంటేనేమో ‘మా దగ్గర ATMకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే స్వీకరిస్తామని’ చెప్పి ఆ తండ్రీకూతుళ్లని వెనక్కి పంపారు. దాంతో తిరిగి స్థానిక పోలీస్ స్టేషనుకే చేరుకోవాల్సి వచ్చింది. అక్కడ ఆ తండ్రీ కూతుళ్లని కూర్చోపెట్టి పోలీసుబాబులు సుదీర్ఘమైన క్లాసు పీకారు- ‘మీ బొహ్రా జాతివాళ్లు పిల్లలకి మరీ ఎక్కువగా స్వేచ్ఛని ఇచ్చేస్తుంటారు. అసలు సోషల్ మీడియాలో మీ ఫొటోలు ఎందుకు అందుబాటులో ఉంచాలి. మీలాంటివారి వల్లే ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. వెంటనే మీ సోషల్ మీడియా అకౌంట్లన్నీ తీసిపారేయండి,’ అంటూ ఊదరగొట్టేశారు. అంతేకాదు పిల్లలకి సెల్ఫోన్లు ఇవ్వవద్దనీ, వారిని సోషల్ మీడియాలో ఉండనివ్వద్దనీ సలేహా తండ్రికి ఉచితంగా సలహాలు ఇచ్చారు. సలేహా కుటుంబం పట్ల పోలీసులు వ్యవహారం ఇదే తీరున కొనసాగింది. ఎంత అడిగినా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదు. ఫిర్యాదుకి సంబంధించిన కాపీ ఇచ్చేందుకు కూడా పోలీసులు నిరాకరించారు. ఉన్నత పోలీసు అధికారుల దగ్గరకు వెళ్లినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. చాలామంది పోలీసులకి సోషల్ మీడియా గురించి అవగాహన లేదనీ... వారి నుంచి ఏమీ ఆశించవద్దనీ మరికొన్ని సలహాలు సదరు ఉన్నతాధికారుల నుంచి వినిపించాయి. సలేహా ఒక జర్నలిస్టు కాబట్టి జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు తన ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. అంతేకాదు! ట్విట్టర్ ద్వారా కేంద్ర మహిళా, శిశుసంరక్షణ శాఖ మంత్రి మేనకా గాంధితో కూడా తన బాధను పంచుకున్నారు. దానికి వెంటనే స్పందించిన మేనకా గాంధి కేసుని వేగంగా దర్యాప్తు చేయమంటూ సంబంధిత పోలీసు అధికారులని ఆదేశించారు. బహుశా సలేహా కుటుంబానికి న్యాయం దక్కవచ్చునేమో! కానీ మామూలు వ్యక్తుల పరిస్థితి ఏమిటి? - నిర్జర.

  FOREVER YOUNG...     How do celebrities manage to look young all the time? Let us try to find an answer to this question, which has always been on our minds.   We get our first secret of anti aging from the 47 year old actress Sandra Bullock. She says the secret to her ageless beauty includes spinach and rosemary extracts along with primrose oil. Your skin needs regular nourishment with these ingredients to hide your age from the world. Jennifer Lopez suggests deep and penetrating miniaturization of your skin to prevent the appearance of wrinkles. What you need are products that promote cell turn over and collagen production.       What is Julianne Moore’s secret of wrinkle free skin at the age of 51. She reveals that it’s a sunscreen with high SPF. She goes by this rule irrespective of the weather outside and this has been her routine since her 20s. She ensures walking on the shade side whenever she steps out. 50 year old Cindy Crawford recommends eating right, sleeping well and drinking lots of water to stay young. Regular work outs are also part of her routine. According to her one should not starve in an attempt to look thin and young.   If you want to know how Evian water can make you look young ask the 47 year old actress, Claudia Schiffer. She uses it to soften her skin and keep it extra clean. Now you too can  look young forever. Just remember to use these tricks.   - KRUTI BEESAM    

    మీనాక్షి కత్తి పట్టిందంటే.... యువకులంతా బలాదూరే!   76 ఏళ్ల మనిషి ఎలా ఉండాలి! మన అంచనా ప్రకారం నడుము వంగిపోయి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, నాలుగడులు వేసినా ఆయాసపడుతూ, ఎవరి మీదన్నా ఆధారపడేలా ఉండాలి. అదీఇదీ కాదంటే... తన గతం గురించి నిరంతరం నెమరువేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. కానీ మీనాక్షి అమ్మని చూస్తే వయసు గురించి, వృద్ధాప్యంలోని నిస్సారత గురించీ ఉన్న ఊహలన్నీ పటాపంచలు అయిపోవాల్సిందే!       కేరళలో ‘కలరిపయట్టు’ అనే ప్రాచీన యుద్ధకళ ఉంది. దీని ముఖ్యోద్దేశం ఆత్మరక్షణే అయినా శరీరానికి తగిన వ్యాయామం, ఆరోగ్యం చేకూరేలా లయబద్ధమైన కదలికలతో కలరిపయట్టు సాగుతుంది. ఈ కలరిపయట్టు ఈనాటిది కాదు! ఎప్పుడో 5వ శతాబ్దంలోనే ఈ కళ మొదలైందని అంటారు. క్రమేపీ బౌద్ధభిక్షువుల ద్వారా చైనాకు వ్యాపించిందనీ చెబుతారు. మనం ఈరోజున చూస్తున్న కరాటే, జూడో వంటి యుద్ధకళలలన్నింటికీ కూడా కలరిపయట్టే మూలమని ఓ నమ్మకం. ఇంత ప్రాచీన కళ అయిన కలరిపయట్టుని ఇంకా సజీవంగా ఉంచుతున్న వ్యక్తే మన మీనాక్షి అమ్మ!       మీనాక్షి అమ్మ తన ఏడేళ్ల వయసులో ఏదో సరదాగా ఈ కళని నేర్చుకోవాలని అనుకున్నారు. దాని వల్ల శరీరం నృత్యానికి మరింత అనుకూలంగా మారుతుంది కదా అని ఆమె తల్లిదండ్రుల ఆలోచన. కానీ ఒక్కసారి గోదాలోకి దిగి కర్రని చేతపట్టగానే, తాను ఈ కళ కోసమే పుట్టానని తోచింది మీనాక్షికి. అంతే! అప్పటి నుంచి ఇక వెనక్కి చూడలేదు. దాదాపు 70 ఏళ్లుగా మీనాక్షి కలరిపయట్టుకి అంకితం అయిపోయారు. ఆమె అంకితభావం చూసి ఆమె గురువైన రాఘవన్, మీనాక్షిని ఏరికోరి పెళ్లిచేసుకున్నారు.       రాఘవన్‌కు Kadathanadan Kalari Sangam పేరుతో కలరిపయట్టుని నేర్పే ఒక గురుకులం ఉండేది. చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యార్థులందరికీ అందులో ఉచితంగా ఈ కళని నేర్పేవారు. కోజికోడ్‌లో ఉన్న ఆ గురుకులంలో రాఘవన్‌కు సాయంగా ఉండేది మీనాక్షి. కానీ 2009లో ఆయన చనిపోవడంతో మీనాక్షి జీవితం మారిపోయింది. తన భర్త స్థాపించిన గురుకులాన్నీ, దాంతోపాటుగా కలరిపయట్టు కళనీ నిలబెట్టాల్సిన లక్ష్యం ఏర్పడింది. దాంతో గురుకుల బాధ్యతలను సంతోషంగా స్వీకరించారు. వందలమంది శిష్యులను తీర్చదిద్దసాగారు.     మీనాక్షి అమ్మ వద్ద ఎప్పుడూ 150 నుంచి 200 మంది శిష్యరికం చేస్తుంటారు. వీరిలో ఓ 30-40 మంది విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. కలరిపయట్టు నేర్చుకోవడం ఏమంత సాధారణమైన విషయం కాదు. ఈ విద్యకు అంతమంటూ ఉండదు. కర్ర, కత్తి, బల్లెం... ఇలా ప్రతి ఆయుధంతోనూ కలరియపట్టు సాగుతుంది. అంతేకాదు! ఈ యుద్ధకళకు అనుబంధంగా ఓ ప్రత్యేక వైద్య విధానం కూడా ఉంటుంది. అందుకనే తాను ఈ విద్యలో ఎప్పటికీ విద్యార్థినే అని వినయంగా చెబుతారు మీనాక్షి.   తన భర్తలాగే, మీనాక్షి కూడా కలరిపయట్టుని నేర్పినందుకు పైసా కూడా అడగరు. విద్యార్థులు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటారు. గురుకులం నడిచేందుకు అవసరమయ్యే నిధుల కోసం ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఒక ప్రాచీన కళని కొనసాగించేందుకు, పదిమందికీ నేర్పేందుకూ మీనాక్షి అమ్మ పడుతున్న తపనని కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించింది. అందుకే ఈ ఏడాది ఆమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇక కేరళ ప్రజలకు ఆమె ఎప్పటినుంచో సుపరిచితమే. లక్ష్యం పట్ల నిబద్ధత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, సంప్రదాయం పట్ల గౌరవం... వంటి లక్షణాలతో ఆమె ఎప్పటికీ ఆదర్శమే!     - నిర్జర.

  బ్రిటిష్వారిని వణికించిన గూఢచారి – సరస్వతి రాజమణి   స్వేచ్ఛ విలువ, బానిసత్వంలో మాత్రమే తెలుస్తుంది. స్వాతంత్ర్యం కోసం మనసు తపిస్తుంటే... ఆ బాధేమిటో పీడనలో ఉన్నవారికే అర్థమవుతుంది. అలాంటి బ్రిటిష్ బానిసత్వం నుంచి మనల్ని విడిపించాలని సాహసించినవారు ఎందరో! ఇప్పుడు వాళ్లందరినీ మనం మర్చిపోయి ఉండవచ్చుగాక! కానీ మన స్వేచ్ఛ వారి భిక్ష అన్న విషయాన్ని చరిత్ర గుర్తుచేస్తూనే ఉంటుంది. అలాంటి ఓ గొప్ప యోధురాలే సరస్వతి రాజమణి. రాజమణి కుటుంబంవారు బర్మాలో స్థిరపడిన తమిళురు. రాజమణి తండ్రికి ఓ బంగారు గని ఉండేది. కానీ అతని మనసు మాత్రం భారతదేశంలో అప్పుడు సాగుతున్న స్వాతంత్ర్య పోరాటం మీదే ఉండేది. 1927లో ఆ కుటుంబంలో పుట్టిన రాజమణి, ఊహ తెలిసినప్పటి నుంచే తండ్రి బాటే పట్టింది. భారత స్వాతంత్రానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా వారిద్దరూ వెళ్లేవారు. అలా ఓసారి బర్మాకు వచ్చిన గాంధీజీని కూడా కలిశారు. ‘నేను పెద్దయ్యాక కనీసం ఒక్క బ్రిటిషర్నైనా చంపుతాను,’ అని రాజమణి ఆయనతో అందట. అప్పుడు ఆమె వయసు పదేళ్లు! అహింసావాది అయిన గాంధీజీకి రాజమణి దృక్పథం నచ్చలేదు. రాజమణికేమో అహింస రుచించలేదు.     రాజమణికి 16 ఏళ్ల వయసుండగా నేతాజీ బర్మాకు వచ్చారు. అప్పటికే ఆయన Indian National Army (INA) అనే సంస్థను స్థాపించి సాయుధపోరుని మొదలుపెట్టారు. సహజంగానే ఆయన బాట రాజమణికి నచ్చింది. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను,’ అంటూ ఆయన అందించిన పిలుపూ నచ్చింది. వెంటనే తన ఒంటి మీద ఉన్న నగలన్నీ INAకు విరాళంగా ఇచ్చేసిందట. ఓ 16 ఏళ్ల పిల్ల తమకు నగలిచ్చిందని తెలుసుకున్న నేతాజీ వాటిని తిరిగి ఇచ్చేయడానికి రాజమణి ఇంటికి వెళ్లారట. అక్కడ ఆమె తన నగలను తిరిగి తీసుకోనంటే తీసుకోనని మొండికేసింది. ఆమె పట్టుదలకు మెచ్చిన నేతాజీ ‘లక్ష్మీదేవి (సంపద) నీ దగ్గర ఎప్పుడూ నిలకడగా ఉండకపోవచ్చు. కానీ నీలోని సరస్వతి (జ్ఞానం) మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే నీకు సరస్వతి అని పేరు పెడుతున్నాను,’ అని చెప్పారట. అప్పటి నుంచీ రాజమణి పేరు సరస్వతి రాజమణిగా మారింది. నేతాజీతో పరిచయం అయిన ఆ రోజునే తాను INAలో చేరి తీరతానంటూ సరస్వతి పట్టుపట్టింది. దాంతో ఆమెను తన దగ్గర ఉన్న నలుగురు గూఢచారులలో ఒకరుగా నియమించారు నేతాజీ. బ్రిటిష్ అధికారుల ఇళ్లలో పనివారుగా పనిచేస్తూ అక్కడి రహస్యాలను చేరవేయడమే వీరి పని. ఆ పనిలో సరస్వతి ఆరితేరిపోయింది. విలువైన సమాచారాన్నెంతో నేతాజీకి అందచేసింది. అలాంటి ఓసారి తన తోటి గూఢచారిని కాపాడే ప్రయత్నంలో సరస్వతి కాలికి బుల్లెట్ గాయమయ్యింది. అంతటి గాయంతో కూడా మూడురోజుల పాటు బ్రిటిష్వారికి చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. సరస్వతి చూపిన ఈ తెగువకు ఆమెకు బ్రటిష్ చక్రవర్తి చేతుల మీదుగా పతకాన్ని ఇప్పించారు నేతాజీ!   INA పోరు ఉధృతంగా సాగుతుండగా నేతాజీ హఠాత్తుగా అదృశ్యం కావడం, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిపోయాయి. రాజమణి కుటుంబమంతా స్వతంత్ర దేశం మీద ఆశతో ఇండియాకు తిరిగివచ్చేశారు. తమ యావదాస్తినంతా భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. సహజంగానే ప్రభుత్వం వీరి సేవను పట్టించుకోలేదు. రాజమణి చెన్నైలో కటిక దరిద్రాన్ని అనుభవించింది. కానీ ఆమెలోని సేవాగుణానికి మాత్రం ఎలాంటి పేదరికమూ పట్టలేదు. ఎక్కడెక్కడో తిరిగి పాతబట్టలని సేకరించి, వాటిని అనాథ శరణాలయాలకు అందించేవారు. ప్రస్తుతం సరస్వతి రాజమణి ఏ పరిస్థితులలో ఉన్నారో దేశానికి తెలియదు. కానీ మనం ఇంత హాయిగా, స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దానికి సరస్వతివంటివారి త్యాగమే కారణం అన్న విషయాన్ని మాత్రం ఎవరూ విస్మరించలేరు. - నిర్జర.    

  వివక్షను ప్రశ్నించిన మహిళ – రోసా!     కొంతమంది అంతే! అందరూ మనకెందుకులే అని సర్దుకుపోయే చోట తల ఎగరేసి నిలబడతారు. ప్రమాదం అని తెలిసి తెలిసి ప్రశ్నలను ఎదుర్కొంటారు. ‘రోసా పార్క్స్‌’ అలాంటి అమ్మాయే! రోసా గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ అమెరికాలో ఉన్న నల్లజాతివారి హక్కుల కోసం పోరాడిన తొలి మహిళ ఎవరు అంటే ఖచ్చితంగా ఆమె పేరే జవాబుగా మిగుల్తుంది. రోసా అమెరికాలోని అలబామా రాష్ట్రంలో 1913 ఫిబ్రవరి 4న పుట్టింది. రోసా పుట్టిన కొద్దిరోజులకే ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో తన అమ్మమ్మ ఊరైనా మోంట్‌గామరీకి చేరుకుంది. అప్పటికే అమెరికాలో నల్లజాతీయుల పట్ల విపరీతమైన వివక్ష ఉండేది. వాళ్లకి శ్వేతజాతీయులతో సమానమైన హక్కులు ఉండేవి కావు. వాళ్ల స్కూళ్లు వేరుగా ఉండేవి. వాళ్ల ఇళ్లు వెలివేసినట్లుగా ఉండేవి. ఇక నల్లజాతివాడు కనిపిస్తే చాలు, భౌతికంగా దాడి చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. అదను చూసి నల్లజాతివాళ్లని అంతం చేయాలనుకునే అతివాద సంస్థలూ లేకపోలేదు. ఒకసారైతే అలాంటి అతివాదుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, రోసా వాళ్ల తాతగారు తన ఇంటి ముందు తుపాకీ పట్టుకుని నిలబడాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులలో పెరిగింది రోసా! ఒకపక్క నల్లజాతివారంటే వివక్ష ఉన్నప్పటికీ, దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కొన్ని సంస్థలు కూడా లేకపోలేదు. అలాంటి ఒక సంస్థలో (NAACP) రోసా సభ్యురాలిగా ఉండేది. కానీ ఇలాంటి చిన్నా చితకా సంస్థల వల్ల పెద్ద ఉపయోగం లేకపోయేది. ప్రభుత్వానికీ, శ్వేతజాతివారికీ వ్యతిరేకంగా పోరాడేంత ధైర్యం, అవకాశం ఈ సంస్థలకు ఉండేవి కాదు. అలాంటి సమయంలోనే ఒక అనుకోని సంఘటన జరిగింది. అప్పట్లో మోంట్‌గామరీలో తిరిగే బస్సుల్లో నల్లవారికీ, తెల్లవారికీ విడివిడిగా సీట్లు కేటాయించబడి ఉండేవి. ఒకవేళ బస్సులోకి తెల్లవారు ఎక్కువగా ఉంటే, వారి కోసం నల్లవారు లేచి తమ సీట్లను అప్పగించాల్సి ఉండేది. ఎన్నో ఏళ్లుగా నల్లవారందరూ కిక్కురుమనకుండా ఈ పద్ధతికి తలొగ్గారు. 1955, డిసెంబరు 1వ తారీఖను ఒక డిపార్టుమెంట్‌ స్టోరులో పనిచేసి ఇంటికి వెళ్లేందుకు ‘రోసా పార్క్స్’ ఎప్పటిలాగే బస్సు ఎక్కారు. ఆ పూట తెల్లవారు ఎక్కువమంది బస్సులో ఎక్కడంతా తన సీట్లో కూర్చుని ఉన్న రోసాను లేచి నిలబడమని ఆదేశించాడు బస్సు డ్రైవరు జేమ్స్‌. కానీ ఏళ్ల తరబడి ఇలాంటి ఆదేశాలు వింటూ వస్తున్న రోసా అలసిపోయింది. ‘ఇక చాలు’ అనుకుంది. అందుకనే ఆమె పక్కవారందరూ లేచి నిలబడినా కూడా ఆమె తన సీటుని వదులుకునేందుకు ఒప్పుకోలేదు. ‘సీట్లోంచి లేవకపోతే నిన్ను అరెస్టు చేయించాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించాడు డ్రైవరు. రోసాకు ఆ క్షణం తెలుసు, తను కనుక డ్రైవరు మాట వినకపోతే… అందరూ కలిసి తనను వెంటాడి వేధిస్తారని, నిలువ నీడ లేకుండా చేస్తారని. అయినా ఉన్న చోట నుంచి అంగుళం కూడా కదిలేందుకు సిద్ధపడలేదు. నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేసి తీసుకుపోయారు. డిసెంబరు 5వ తేదీన ఆమెను విచారించేందుకు తీర్మానించారు. కానీ ఈ సంఘటన నల్లజాతీయులలో ఒక కొత్త కసిని రేకెత్తించింది. తన పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొనేందుకు రోసా అంత పట్టుదలగా ఉంటే, ఆమెకు ఎలాంటి మద్దత ఇవ్వలేమా అనుకున్నారు. అంతే! అందరూ సమావేశమై డిసెంబరు 5న మాంట్‌గామరీలో ఉన్న బస్సులన్నింటినీ బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. డిసెంబరు 5- ఆ రోజు విపరీతమైన వర్షం కురుస్తోంది. అయినా సరే! నల్లజాతివారంతా మైళ్ల కొద్దీ దూరాలకు నడుచుకుంటూ వెళ్లారే కానీ ఒక్కరు కూడా బస్సు ఎక్కలేదు. అంతేకాదు! ఇక నుంచి తమకు సమాన హక్కులు లభించేంతవరకూ ప్రభుత్వ బస్సులను ఎక్కేది లేదన్న నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే నగరంలోకి అడుగుపెట్టిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్ (జూనియర్‌)’ కూడా ఈ ఉద్యమంలోకి చేరడంతో ఉద్యమానికి కొత్త బలం చేకూరింది. రోసాను కొద్దపాటి జరిమానా వేసి విడిచిపెట్టేశారు. కానీ ఈసారి నల్లజాతి వారే ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలు చేశారు. వివక్షకు వ్యతిరేకంగా ఒక పక్క కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటే, మరో పక్క బస్సులన్నీ ఖాళీగా తిరుగుతూ ఉండేవి. నల్లజాతివారి మీద కసితో అతివాదులు ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగబడటం మొదలుపెట్టారు. వారాలు, నెలలు గడుస్తున్నా కూడా రోసా, ఆమె సహచరులు తమ పోరాటాన్ని ఆపలేదు. మరోపక్క రోసాను, ఆమె భర్తను ఉద్యోగం నుంచి తొలగించి వేశారు. ఎట్టకేళకు 381 రోజుల సుదీర్ఘ ఉద్యమం తరువాత 1956, డిసెంబరు 20న అమెరికా సుప్రీంకోర్టు ఉత్తర్వులు మాంట్‌గామరీకి చేరుకున్నాయి. స్థానిక ప్రభుత్వాలు రంగు ఆధారంగా ఎలాంటి వివక్షా చూపించరాదన్నదే ఈ తీర్పులోని సారాంశం. జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైన బహిష్కరణ ఉద్యమం అలా విజయవంతంగా ముగిసింది. ‘మాంట్‌గామరీ బస్‌ బాయ్‌కాట్‌’గా ప్రసిద్ధి చెందిన ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన మలుపుగా నిలిచిపోయింది. ఆ తరువాత రోజుల్లో కూడా రోసా ప్రజల్లో మానవహక్కుల పట్ల అవగాహన కోసం ఉద్యమిస్తూనే ఉంది. ‘Rosa Parks: My Story’  పేరుతో ఆమె రాసుకున్న ఆత్మకథ కూడా ఒక  సంచలనమే! 2005, అక్టోబరు 24న తుదిశ్వాసను విడిచిన రోసా తన జీవితకాలంలో లెక్కలేనన్ని పురస్కారాలనూ, అంతకుమించిన అభిమానాన్నీ పొందారు. - నిర్జర.

దేశంలోనే తొలి మహిళా రాయబారి - ముత్తమ్మ     అవకాశాలని అందిపుచ్చుకుని అందలాలు ఎక్కడం వేరు. అసలు అవకాశం అన్న పదమే లేని చోట తనే ఓ మార్గాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగిపోవడం వేరు. అలాంటి అరుదైన వ్యక్తులు తాము విజయం సాధించడమే కాదు... ముందు తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తారు. వారిలో ఒకరే సి.బి.ముత్తమ్మ!   సి.బి. ముత్తమ్మది కర్ణాటకలోని కూర్గ్‌ జిల్లా. ఆమెకి పట్టుమని పదేళ్లయినా నిండకముందే అటవీశాఖ అధికారిగా చేస్తున్న వాళ్ల నాన్నగారు చనిపోయారు. సహజంగానే అలాంటి పరిస్థితులలో ఏదో ఒకలా ఓ ఒడ్డుకి చేరితే చాలురా భగవంతుడా అనుకుంటాము. కానీ ముత్తమ్మ తల్లి అలా కాదు! తన నలుగరు పిల్లల్నీ ఎలాగైనా సరే బాగా చదివించాలనుకుంది. ముత్తమ్మ కూడా తల్లి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. బంగారు పతకాలు సాధిస్తూ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో చదువు పూర్తిచేశారు.   చదువు పూర్తిచేసిన తరువాత తన తోటివారిలో ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోలేదు. కష్టతరమైన సివిల్‌ సర్వీస్ పరీక్షలకు సిద్ధపడిపోయారు. ఆ పరీక్షలలో నెగ్గిన తొలి భారతీయురాలిగా ముత్తమ్మది ఓ రికార్డు. అందులోనూ ఫారిన్‌ సర్వీస్‌ను ఎన్నుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు ముత్తమ్మ. ఆమెని ఇంటర్వ్యూ చేసిన బోర్డు అధికారులు... ఫారిన్‌ సర్వీసుకి మహిళలు తగరంటూ చాలా నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. ఆడవాళ్లు ఫారిన్‌ సర్వీసుకి పనికిరారంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు అధికారులు. ఒకవేళ ఆమెకు పెళ్లయితే, ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది అన్న షరతు మీద నియామకాన్ని అందించారు. ఓ రెండేళ్ల తరువాత ఈ నిబంధనలైతే మారాయి... కానీ స్త్రీగా ఆమెపట్ల వివక్షలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.   ఎంత కష్టపడినా కూడా తన ప్రతిభకి తగ్గ పదోన్నతలు దక్కకపోవడంతో ముత్తమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. ఆ సమయంలో స్త్రీలకు భిన్నమైన సర్వీస్‌ రూల్ప్‌ ఉండేందుకు భారత ప్రభుత్వం చెప్పిన కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఫారిన్‌ సర్వీసులో ఉండేవారికి దేశరక్షణకి సంబంధించి రహస్యాలు తెలిసి ఉంటాయనీ, మహిళలు ఈ సర్వీసులో ఉంటే వారి భర్తలకు సదరు రహస్యాలు తెలిసిపోయే ప్రమాదం ఉంటుందన్నదే ఆ వాదన! కానీ ఫారిన్‌ సర్వీసులో మగవారు ఉంటే ఇలాంటి ప్రమాదం ఎందుకు ఉండదు? అనే సుప్రీం కోర్టు ప్రశ్నకు ప్రభుత్వం తెల్లమొగం వేయాల్సి వచ్చింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. ‘భారత ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీల పట్ల వివక్షాపూరితంగా ఉన్న నిబంధనలన్నింటినీ మరోసారి పరిశీలించి... ఎలాంటి పక్షపాతం లేనివిధంగా వాటిని సంస్కరించాలన్నదే,’ ఆ తీర్పులోని సారాంశం.     సుప్రీం కోర్టు తీర్పు తరువాత భారత ప్రభుత్వం ముత్తమ్మను హంగేరీకి రాయబారిగా నియమించింది. అలా తొలి మహిళా రాయబారిగా ముత్తమ్మ చరిత్ర సృష్టించారు. దురదృష్టవశాత్తూ తన విధులలో అడుగడుగుగా ముత్తమ్మని ఒక మహిళగానే భావించి, ఆమెను తక్కువ చేసే ప్రయత్నమే చేసింది ప్రభుత్వం. తన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కేందుకు ఆమె అనుక్షణం పోరాడాల్సి వచ్చేది. అందుకనే రిటైర్మెంట్‌ తరువాత కూడా భారత సివిల్‌ సర్వీసుల వెనుక దాగిన వివక్షని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. Slain by the System అనే పుస్తకంలో స్త్రీల పట్ల అధికారులలోని పక్షపాతాన్ని ఎండగట్టారు.   ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను నెగ్గిన తొలి మహిళగా, దేశంలోనే తొలి మహిళా దౌత్యవేత్తగా, తొలి భారతీయ మహిళా రాయబారిగా.... ముత్తమ్మ ఎన్నో తొలి ఘనతలను సాధించారు. ఉద్యోగం అంటే ముత్తమ్మకు ఎంత ఇష్టమో వంటలన్నా కూడా అంతే ఇష్టం! అందుకనే కర్ణాటకలోని వంటకాల మీద ఒక పుస్తకం రాశారు. ఇక దిల్లీలో తన పేరు మీద ఉన్న 15 ఎకరాల భూమిని ఓ అనాధాశ్రమానికి ఇచ్చేసి... మనసులో కూడా తనని మించినవారు లేరని నిరూపించారు. ఆమె చనిపోయి 8 సంవత్సరాలు కావస్తున్నా... ఇప్పటి తరానికి కూడా స్ఫూర్తిగా నిలిచారు.     - నిర్జర.