మొదటి సారి చీర కట్టేటప్పుడు ఇవి తప్పక గుర్తుంచుకోవాలి..!

 

చీర మహిళల భారతీయ సంప్రదాయ వస్త్రధారణ. అయితే నేటి కాలంలో చీరను రోజు కట్టుకోవడం కుదరడం లేదు. చాలా వరకు వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులలోనే రోజులు గడుపుతుంటారు.  చీర అంటే చాలా అరుదుగా ఏదైనా ట్రెడిషనల్ కార్యక్రమంలో మాత్రమే కడుతుంటారు.  అయితే చీర మొదటిసారిగా కట్టేవారు చాలా అయోమయానికి గురవుతుంటారు. చాలా వరకు ఇతరుల సహాయం తీసుకుంటూ ఉంటారు.  అసలు చీర ఫర్పెక్ట్ గా కనిపించడానికి ఏం చేయాలి? ఏ టిప్స్ ఫాలో కావాలి? తెలుసుకుంటే..

సరైన పెట్టీకోట్, బ్లౌజ్..

చీర కట్టుకునేందుకు లోపల ధరించే లంగాను నేటికాలంలో పెట్టీకోట్ అంటున్నారు.  ఈ పెట్టీ కోట్,  చీరలోకి ధరించే బ్లౌజ్ సరిగ్గా సరిపోయేలా ఉండాలి.  పెట్టీకోట్ ఎంత బాగా సెట్ అయితే చీర కట్టుకున్నాక అంత బాగా కనిపిస్తుంది. పెట్టీకోట్,  బ్లౌజ్ చాలా బిగుతుగా లేదా చాలా లూజ్ గా ఉండకూడదు.

చీరను గమనించాలి..

చాలామందికి చీర కట్టుకొనేటప్పుడు ఎదురయ్యే కన్ఫ్యూషన్..  చీర కింద అంచు ఏది? పైన అంచు ఏది అని.. అలాగే చాలా చీరలు ముందు, వెనుక కూడా అట్రాక్షన్ గా ఉంటాయి.  ఇవి కూడా గమనించాలి.  ఇవి గమనించకుండా హడావిడిగా చీర కట్టుకుంటే అది బెడిసికొట్టే అవకాశం ఉంటుంది.

హీల్స్ వద్దు.. ప్లాట్స్ ముద్దు..

చాలామందికి హీల్స్ ధరించడం అలవాటు. కానీ చీర కట్టుకున్న తరువాత హీల్స్ ధరించడం చాలా ఛాలెంజ్ గా ఉంటుంది. చీర పూర్తీగా అలవాటు కానప్పుడు చీర కట్టుకున్నప్పుడు హీల్స్ ధరించి ఏదైనా సమస్యను ఎదుర్కునే బదులు చీర ధరించినప్పుడు ప్లాట్స్ ధరించడం మంచిది.

కుచ్చిళ్ల స్థానం..

చీరకు చాలా అందాన్ని తెచ్చిపెట్టేది కుచ్చిల్లు.  ఈ కుచ్చిళ్లను చాలా జాగ్రత్తగా మడత పెట్టడమే కాదు.. కుచ్చిళ్ళను సరిగ్గా  పెట్టికోట్ లో ఉంచడం కూడా ముఖ్యమే.. ఖచ్చితంగా నాభికి కొద్దిగా కుడివైపున కుచ్చిళ్లను టక్ చేసుకోవాలి.

మడత పెట్టడం..

చీర కట్టుకున్నప్పుడు చీర కొంగు అయినా,  కుచ్చిళ్లు అయినా సరిగ్గా  ఒక్క లెవల్ లో మడత పెట్టాలి.  ఇలా ఒక్క లెవల్ లో మడత పెట్టడం వల్ల చీర కట్టుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది.

సేఫ్టీ పిన్ ల వాడకం..

చీర కొంగును, చీర కుచ్చిళ్ళను  పెట్టేటప్పుడు సేఫ్టీ పిన్ లను  చాలా జాగ్రత్తగా వాడాలి.  పిన్ లను పెట్టేటప్పుడు చీర ఫ్యాబ్రిక్ పోగులు ఒక్కొక్క సారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు పిన్స్ శరీరానికి గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది.  అందుకే సేఫ్టీ పిన్స్ దగ్గర జాగ్రత్త.

నడవడం..

డ్రస్సులు వేసుకున్నప్పుడు నడిచినంత వేగంగా, వయ్యారంగా.. మొదటి సారి చీర కట్టుకున్నప్పుడు నడవడం కుదరదు.  అందుకే మొదటిసారి చీర కట్టుకున్నప్పుడు లేదా చీర అలవాటు తక్కువగా ఉన్నప్పుడు నెమ్మదిగా నడవాలి.

కాన్పిడెంట్ కీలకం..

చాలామంది చీర కట్టుకున్నప్పుడు భయపడుతూ ఉంటారు. ఎక్కడ పడతామో.. నవ్వుల పాలవుతామో అని. అయితే కాన్పిడెంట్ గా ఉండటం చాలా ముఖ్యం.

                    *రూపశ్రీ.