Home

»

Tv News

నా భార్య మెచ్చుకుంది..18 ఏళ్ల నిరీక్షణకు నాగులు రోల్ సక్సెస్ ఇచ్చింది.!

Aug 25, 2026 2:25PM

బుల్లితెరపై ‘జబర్దస్త్’ ఎంతటి సూపర్‌హిట్‌ షోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం కమెడియన్లుగానే కాకుండా హీరోలుగా, దర్శకులుగా, రచయితలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, బలగం వేణు, ధనరాజ్, ఇమ్మానుయేల్, చమ్మక్ చంద్ర, వేణు వంటి పలువురు జబర్దస్త్ కళాకారులు సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కొమరం కూడా ఒకరు. అయితే కొమరం అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ‘కొమరక్కా’ లేడీ గెటప్. దాదాపు 12 ఏళ్లుగా ఈ గెటప్‌లోనే ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్నారు. కామెడీ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ.. తనలో ఉన్న సీరియస్ నటుడిని చూపించుకునే అవకాశం మాత్రం ఆయనకు ఎక్కువగా రాలేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.

రవితేజ హీరోగా వచ్చిన ‘ఇరుముడి’ సినిమాలో కొమరం ‘నాగులు’ అనే సీరియస్ విలన్ పాత్రలో కనిపించారు. సినిమాలో అజయ్ ఘోష్‌ కొడుకుగా నటించిన ఆయన.. నాగులు పాత్రలో అద్భుతంగా మెప్పించారు. సీరియస్ బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డైలాగ్ డెలివరీతో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇప్పటివరకు కామెడీ గెటప్‌లో చూసిన ప్రేక్షకులకు పూర్తిగా భిన్నమైన కొమరాన్ని చూపించారు డైరెక్టర్.   కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందనే ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇరుముడి సక్సెస్ మీట్‌లో కొమరం తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.  “ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అయ్యింది. కొమరక్కా అనే లేడీ గెటప్‌లో 12 ఏళ్లుగా బతుకుతున్నాను. అందరితో అవమానాల పాలయ్యాను. నా రూమ్‌లో నాతో కలిసి ఉన్న దాదాపు 15 మంది డైరెక్టర్లు అయ్యారు. వాళ్ల కోసం నేను ఎంతో చేశాను. కానీ వాళ్లెవరూ నా గురించి ఆలోచించలేదు. నాలో ఉన్న నటుడిని గుర్తించలేదు” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

తనకు ఇరుముడి సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి కొమరం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “మీరు నాకు అన్న కాదు, తమ్ముడు కాదు. అయినా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చారు” అంటూ తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ‘నాగులు’ పాత్ర తన జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో కూడా ఆయన వివరించారు. “నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం నాకు ఉంది. కానీ ఈ 18 ఏళ్లలో నాకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. మొదటి రోజు షూటింగ్‌లో నేను లేడీ గెటప్‌లో ఉన్నందుకు నన్ను గే క్యారెక్టర్ అనుకున్నారు. కానీ ఈ పాత్ర ద్వారా నేను ఏం చేయగలనో చూపించే అవకాశం వచ్చింది. నేను 42 సినిమాలు చేశాను. కానీ రవితేజ సర్ ఇచ్చినంత కంఫర్ట్ ఎవరూ ఇవ్వలేదు. నేను అంత అద్భుతంగా ఫైట్ చేయడం ఏంటి సర్? ప్రతిసారి ‘చూసుకున్నావా?’ అంటూ నన్ను ఎంకరేజ్ చేశారు” అని గుర్తుచేసుకున్నారు.  “మూడు రోజుల్లోనే 7 ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ‘నువ్వు కొమరక్క కదా.. నాగులు పాత్రలో నమ్మలేకపోతున్నాం రా నాయనా’ అని అంటున్నారు. నాకు మర్చిపోలేని క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ వల్ల నేను బతకగలననే భరోసా వచ్చింది” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. “నా భార్య ఎప్పుడూ నాతో సరిగ్గా ఉండదు. కానీ ఈ మూడు రోజుల నుంచి నా భార్య ఎంతో సంతోషంగా ఉంది. ‘బావా.. వీడు కొమరం గాడు’ అని అందరూ మెచ్చుకుంటున్నారు .. నా భార్య చెప్పమన్నది సర్.. మీ కాళ్లకు పాదాభివందనం. నేను నాగులు అయిపోయాను సర్” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.  ఇప్పటివరకు తనను కొమరక్కగా మాత్రమే చూసిన ఇండస్ట్రీ, ప్రేక్షకులు ఇప్పుడు తనలోని మరో నటుడిని గుర్తిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com