విజయవాడ మెట్రోపై నాని వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శలు.!
విజయవాడ ఎంపీగా రెండు సార్ల పని చేసిన కేశినేని నాని.. ఇప్పుడు అదే విజయవాడ అభివృద్ధిని అడ్డుకుంటానంటున్నారు. ప్రతిష్ఠాత్మకమైన మెట్రో ప్రాజెక్టు వద్దంటున్నారు కేశినేని నాని. మెట్రో ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ కేశినేని నాని లేవనెత్తుతున్న అభ్యంతరాలు, విమర్శలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడ నగరానికి వరమా కాదు శాపం అంటూ ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ సంధించిన ప్రశ్నలపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ కేశినేని నాని అంటున్నదేమిటయ్యా అంటే.. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం వ్యయం చేసే వేల కోట్ల నిధులను నగరంలో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు వంటి మౌలిక వసతులపై వెచ్చించాలని. అయితే ఇక్కడ ఎంపీగా పని చేసిన కేశినేని నాని మిస్ అయిన లాజిక్ ఏమిటంటే.. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి మౌలిక వసతులపై మున్సిపల్ కార్పొరేషన్లు , రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేస్తూనే ఉంటాయి. అవి ఆగవు.. కానీ మెట్రో రైల్ ప్రాజెక్టు వంటి అర్బన్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సాఫ్ట్ లోన్స్ మంజూరు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నిధులు ఇస్తుంది. అటువంటి నిధులను రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్య వంటి వాటి కోసం వ్యయం చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. నిజమైన విజనరీ ఎవరైనా సరే.. ప్రాథమిక సదుపాయాలు కల్పించడంతో పాటు మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులను సాధించేదుకు కృష్టి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే చేశారు. ఆ విషయాన్ని విస్మరించి మెట్రో వద్దు, ఆ నిధులను మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాలంటూ కేశినేని నాని జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించడం ఆయనను నవ్వుల పాలు చేస్తున్నది. బెజవాడలో జనాభా , ట్రాఫిక్ విపరీతంగా పెరిగాయి. ట్రాఫిక్ కారణంగా ఐటీ కారిడార్లు, గన్నవరం ఎయిర్‌పోర్ట్, మంగళగిరి గుంటూరు కనెక్టివిటీ పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో మెట్రో రైల్ అన్నిటికీ పరిష్కారంగా మారుతుందనడంలో సందేహం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో లాంటి ప్రజా రవాణా వ్యవస్థ లేకపోతే బెజవాడ ట్రాఫిక్ స్తంభించిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవేమీపట్టించుకోకుండా కేశినేని ట్రావెల్స్ పేరిట సుదీర్ఘ కాలం ట్రావెల్ ఏజెన్సీ నడిపి, రవాణా రంగంలో అనుభవం ఉందని తనకుతాను భుజాలు చరుచుకుంటున్న కేశినేని నాని మెట్రో రైల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికలలో కేశినేని నాని వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అప్పటి నుంచీ రాజకీయంగా దాదాపు సైలెంట్ అయిపోయిన ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయంగా తన పునరాగమనం కోసం అడుగులు వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆయన బెజవాడ మెట్రోకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ రాజధానికి ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రతిపాదన ఎలా ఆయన ప్రతిష్ఠను దిగజార్చి నెటిజన్ల ట్రోలింగ్ కు గురి చేసిందో, ఇప్పుడు కేశినేని మెట్రో వద్దు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, మెట్రోకు వ్యతిరేకంగా సంధిస్తున్న ప్రశ్నలు, విమర్శలు కూడా నానిని నెటిజనుల ట్రోలింగ్ కు గురి చేస్తున్నాయి. ప్రజలలో ఉన్న కాస్తో కూస్తో ప్రతిష్ఠను కూడా దిగజారుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. Kesineni Nani Oppose Vijayawada Metro Rail Project, Kesineni Nani Metro Comments, Vijayawada Infrastructure Development, Netizens Troll, APpolitics, TeluguOne
Published on: Mon Aug 24, 2026 3:44PM