Illu Illalu Pillalu: వల్లిపై చందు సీరియస్.. రామరాజు ఏం చేయనున్నాడు?
Nov 29, 2026 9:17AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 643 లో...నర్మద రామరాజుతో మెడికల్ రిపోర్ట్స్ పెడితే వాయిదా వచ్చేస్తుంది.. కానీ అసలు సమస్య తర్వాత వస్తుంది.. కేసు వాయిదా పడిన తర్వాత చందు బావ ఎలాంటి రచ్చ చేస్తాడా అని కంగారుగా ఉందని చెప్తుంది. దానికి రామరాజు నేను చూసుకుంటా అమ్మా అని భరోసా ఇస్తాడు.
ఇక చందు కోర్టుకి వెళ్తే, చందు తరఫు లాయర్ వల్లీ వాళ్లు మెడికల్ రిపోర్ట్స్ పెట్టారు.. వాయిదా వస్తుందని చెప్తాడు. దీంతో చందు షాక్ అయిపోయి వాళ్లు దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఇలా చేస్తే అస్సలు ఊరుకోను, ఎందుకు కోర్టుకి రాదో, ఎందుకు సంతకం పెట్టదో నేను చూస్తానని వల్లీ ఇంటికి బయలుదేర్తాడు.
మరోవైపు ప్రేమ, ధీరజ్ లు ట్రావెల్స్ దగ్గరకు వెళ్తారు. కారు రాలేదు కదా పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ప్రేమ అంటే, నువ్వు డోర్ ఓపెన్ చేయ్ కారు దానంతట అదే పరుగెత్తి వస్తుందని ధీరజ్ అంటాడు. ప్రేమ డోర్ తీయగానే ఓ రౌడీని చూసి దెయ్యమని అరుస్తుంది. వాడు మన దగ్గర కారు తీసుకెళ్లిన వాడేనని ధీరజ్ గుర్తిస్తాడు. నా పెళ్లాం ముందు తాగిన నన్ను కొట్టి ఇక్కడికి తీసుకొస్తావా నీ అంతు చూస్తానని రౌడీ బెదిరిస్తాడు. ఇక మిగతా రౌడీలు కారు తీసుకొచ్చి ఇస్తారు.
చందు కోపంగా వల్లీ ఇంటి వైపు వెళ్లడం చూసిన అంజలి చందుని ఫాలో అవుతుంది. అదే సమయంలో రామరాజు వల్లీకి అన్నం తినిపిస్తాడు. అది చూసిన ఆనందరావు.. బావగారు మీరు నిజంగా దేవుడు అని అంటాడు. వల్లీ నా పెద్ద కూతురు అని ఎప్పుడో చెప్పానని రామరాజు తినిపిస్తుండగా ఇంతలో చందు వచ్చి రామరాజు చేతిలో ప్లేట్ తోసేస్తాడు. రేయ్ పెద్దోడా ఏంట్రా నువ్వు తినిపిస్తుంటే ప్లేట్ తోసేస్తావా అని రామరాజు అంటే మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి కేసు వాయిదా వేయించి ఇక్కడ దున్నపోతులా తింటున్నావా అని చందు అరుస్తాడు. రామరాజు తనకి వాయిదాకి సంబంధం లేదు, నేనే వేయించానని చెప్తాడు. ఒకసారి మీరే దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు, ఇప్పుడు మళ్లీ దాన్ని సపోర్ట్ చేస్తే మీరే నన్ను చంపుకున్నట్లు అని అంటాడు.
వల్లీ చాలా తప్పులు చేసిందిరా, కానీ ఇప్పుడు మారిపోయింది, వల్లీ కడుపులో బిడ్డ నీ బిడ్డే కదరా, తన కోసం అయినా ఆలోచించరా అని అంటాడు. వల్లీ ప్రెగ్నెంట్ అని తెలిసి అంజలి షాక్ అయిపోతుంది. వల్లీకి సపోర్ట్ చేయొద్దని చందు అంటే నేను చేస్తానురా, నా కోడలు, కొడుకు జీవితం బాగుండాలని రామరాజు అంటాడు. మామ, భర్త గొడవ పడుతుంటే వల్లీ ఆపుతుంది. నా విషయంలో మీరు గొడవ పడొద్దని చెప్తుంది. చందు వెళ్లిపోతాడు. అంజలిని వల్లీ చూస్తుంది. తనెందుకు వచ్చింది.. పదే పదే నాకు ఎందుకు కనిపిస్తుందని మనసులో అనుకుంటుంది.
సాగర్ ఎక్కడ ఉద్యోగానికి వెళ్లినా లంచగొండి అని ఉద్యోగాలు రావడం లేదని ఇంట్లో తల్లి మీద చిరాకు పడటం, ప్రేమ ధీరజ్ మీద అలిగి ఐస్ క్రీం షాప్ కి వెళ్లి చాలా ఐస్ క్రీంలు తినేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




