Podarillu Serial: శైలు గురించి మాధవ్ ఇంటి ముందు రచ్చ చేసిన వరాలు!
Nov 29, 2026 9:31AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -273 లో... మహాకు రిస్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విక్కీ, అది స్టేటస్ గా పెట్టుకుని కింద లవ్ సింబల్ పెడతాడు. అది చూసిన చక్రికి కోపమోస్తుంది. అటు మెకానిక్ సామాన్లు కోసం కేశవ్ విజయవాడ వెళ్తుంటే, శైలూ కూడా వస్తానని వెంటపడటంతో తీసుకెళ్తాడు. రాత్రైనా శైలూ ఇంటికి తిరిగిరాకపోవడంతో కేశవ్ లేపుకుని వెళ్లిపోయాడంటూ వరాలు మాధవ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ పెట్టుకుంటుంది.
విక్కీ మహాలక్ష్మితో దిగిన ఫోటో చూసుకుని మురిసిపోతుంటాడు. వాచ్ బయటే ఇంత అందంగా ఉందంటే మహాలక్ష్మీ చేతికి ఇంకా ఎంత అందంగా ఉంటుందోనని అనుకుని ఆ ఫొటో స్టేటస్ గా పెట్టి కింద లవ్, కిస్ సింబల్ పెడతాడు. దాన్ని చూసిన చక్రికి మరింత కోపం పెరుగుతుంది. నా భార్యతో ఫొటో దిగిందే కాకుండా లవ్ సింబల్ పెడతాడా వీడికి ఎంత ధైర్యం అంటూ రగిలిపోతాడు.
ఇంటికి రాకపోతే బుజ్జగించాలని కానీ ఇలా కనపడటం లేదు అని పోస్టర్ వేస్తారా అని మహాలక్ష్మి పంపిన మెసేజ్ తో చక్రి చాలా చిరాకు పడుతూనే ఉంటాడు. వీడిని ఇలాగే వదిలేస్తే ఎంత దూరమైనా వెళ్తాడని, వీడిని కలిసి ముఖం పగలగొట్టాలని అనుకుంటాడు. కోపంతో ఇంటికి వచ్చిన చక్రి చిర్రుబుర్రులాడితే, నారాయణ రాత్రంతా ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తాడు. మీ మాతాజీ ఆ విక్కీగాడికి అతి చనువు ఇస్తుంది.. వాడేమో రెచ్చిపోతున్నాడంటూ విక్కీ స్టేటస్ చూపించి నారాయణ బుర్ర తింటాడు చక్రి.
మరోవైపు అందంగా ముస్తాబవుతున్న శైలూను చూసి సురేష్ ఎక్కడికి వెళ్తున్నావని నిలదీస్తాడు. కాలేజీకి వెళ్తున్నానని చెప్పగా, కాలేజీకి ఇంతలా రెడీ అవ్వాలా అని అరుస్తాడు. ఆ మెకానిక్ గాడితో లేచిపోవడానికి రెడీ అవుతుందని వరాలుతో అంటాడు. వరాలు వచ్చి కూతుర్ని నిలదీస్తే అలాంటిదేమీ లేదని అంటుంది. ముందు దీన్ని కాలేజీ మాన్పించమని సురేష్ అంటే, ట్రై చేసి చూడమని శైలూ బెదిరిస్తుంది. వెంటనే ఎస్ఐగారికి కాల్ చేసి చెప్తానని అనడంతో వరాలు వెనక్కి తగ్గుతుంది. నేరుగా కేశవ్ షాపు దగ్గరకు వెళ్లిన శైలూ తనని కూడా విజయవాడ తీసుకెళ్లమని గొడవ చేస్తుంది.. చేసేదిలేక కేశవ్ తనతోపాటు తీసుకెళ్తాడు.
రాత్రి అయినా శైలూ ఇంటికి తిరిగిరాకపోవడంతో వరాలు కంగారుపడుతుంది. ఆ కేశవ్ గాడు కూడా ఊరిలో లేడని ఖచ్చితంగా వాళ్లు లేచిపోయారని, పెళ్లి చేసుకోవడానికే తీసుకెళ్లాడని సురేష్ అంటాడు. దీంతో మాధవ్ ఇంటికి వరాలు వచ్చి గొడవ చేస్తుంది. కేశవ్ వెంట విజయవాడ వెళ్లిన శైలూ పెళ్లి చేసుకోవడానికే తీసుకెళ్లాడంటూ రచ్చ చేస్తుంది. అసలు కేశవ్, శైలూ విజయవాడలో ఏం చేస్తున్నారు? వరాలు గొడవతో మాధవ్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది.. విక్కీ లవ్ సింబల్ పై చక్రి ఏం చేస్తాడన్నది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



