'గాడ్ ఫాదర్' మరో 'గబ్బర్ సింగ్' అవుతుందా?
on Sep 25, 2022
మలయాళ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'లూసిఫర్'ను 'గాడ్ ఫాదర్' పేరుతో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ 'గబ్బర్ సింగ్'లా సంచలన విజయాన్ని అందుకుంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.
'గాడ్ ఫాదర్'లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు కాబట్టి ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయడంలో ఆశ్చర్యం లేదు. అయితే మలయాళ సినిమాకి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని మళ్లీ తిరిగి మలయాళంలో విడుదల చేయడమే ఆసక్తికరంగా మారింది. అక్కడి సినిమాని రీమేక్ చేసి మళ్లీ అక్కడ విడుదల చేయడం ఏంటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిజానికి 'లూసిఫర్' మెయిన్ ప్లాట్ ని మాత్రమే తీసుకొని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఈ సినిమాలో చాలా మార్పులు చేశారట. 'లూసిఫర్' చూసిన వాళ్లకి సైతం ఇది కొత్త అనుభూతిని ఇవ్వనుందని అంటున్నారు.
గతంలో హిందీ సినిమా 'దబాంగ్'కి రీమేక్ గా తెరకెక్కిన 'గబ్బర్ సింగ్' మూవీ ఒరిజినల్ ని మించి ఆకట్టుకుంది. మెయిన్ ప్లాట్ ని మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి, పవన్ కళ్యాణ్ స్టార్డమ్ కి తగ్గట్లు చాలా మార్పులు చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అప్పుడు ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' కూడా ఆ రేంజ్ లో సత్తా చాటుతుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read