
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న రూరల్ ఎంటర్టైనర్ ‘ఇడుపు కాయితం’ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడే తెలంగాణ యాసలో ఉన్న పేరుపై కొందరు ట్రోల్స్ చేశారు. అసలు ఆ టైటిల్‌కు అర్థమేంటంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాట కూడా వివాదానికి దారితీయడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని పాటలో పెళ్లి వేడుకకు సంబంధించిన సన్నివేశాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పెళ్లిళ్లలో మందు పోసే సంప్రదాయాన్ని సినిమాలో చూపించిన తీరు వాస్తవానికి భిన్నంగా ఉందని విమర్శిస్తున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం తెలంగాణ సంస్కృతిని తప్పుగా చూపించొద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు వేణు ఉడుగుల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి. తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలి. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను ఆదరిద్దాం.సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే విమర్శించండి. కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని మీ అజ్ఞానంతో నిర్వచించకండి." అని వేణు ఉడుగుల తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మొత్తానికి, పాటలోని సన్నివేశాలపై వస్తున్న విమర్శలు ఒకవైపు.. తెలంగాణ సంస్కృతిని తెరపై చూపించే విధానంపై వేణు ఉడుగుల చేసిన వ్యాఖ్యలు మరోవైపు.. ‘ఇడుపు కాయితం’ చుట్టూ చర్చను మరింత పెంచాయి. సినిమా విడుదలయ్యాక ఈ సన్నివేశాలపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ సినిమాపై ఎన్టీఆర్ జెలసీ.. త్రివిక్రమ్‌కి ఫోన్ చేసి తిట్టేశాడు.!
[Venu Udugula On Idupu Kayitham Trolls, Idupu Kayitham Song, Idupu Kayitham Movie, Idupu Kayitham Trolls, Telangana Culture, Venu Udugula Twitter, Priyadarshi, Naga Durga, Telugu Film News]






