
ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో త్రివిక్రమ్, తమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాలోని పాటలు, కథలోని భావోద్వేగాలు ఒక ప్రత్యేకమైన మూడ్‌లో సాగుతాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో తమన్ స్వరపరిచిన ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ వంటి పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఈ రెండు సినిమాల పాటలను పోల్చుతూ ఎన్టీఆర్ తమన్‌ను సరదాగా ఆటపట్టించారట. ‘అరవింద సమేత’లో తనకు విషాదభరితమైన పాటలు ఇచ్చి.. బన్నీకి మాత్రం ఇంత స్టైలిష్‌గా, హుషారుగా ఉండే పాటలు ఎలా ఇచ్చావంటూ ఫోన్లో తనదైన శైలిలో ప్రశ్నించారని తమన్ గుర్తుచేసుకున్నారు.
"మాకేంట్రా ఏడపోయినావో, ఎప్పుడొస్తావో, ఎప్పుడు వెళ్లిపోతావో పాటలు ఇచ్చావు. వెంటనే బన్నీకి సామజవరగమన, బుట్టబొమ్మ, రాములో రాముల ఇచ్చావు" అంటూ ఎన్టీఆర్ ఫోన్ చేసి సరదాగా తిట్టాడని తమన్ వెల్లడించారు.
అలాగే ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రఫ్‌గా, మాస్ యాక్షన్‌తో సాగుతుంది. ‘అల వైకుంఠపురములో’ మూవీలో మాత్రం అల్లు అర్జున్ను చాలా స్టైలిష్‌గా చూపించారు త్రివిక్రమ్. ఈ విషయాన్ని కూడా ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారట.
దీనిపై త్రివిక్రమ్ మాట్లాడుతూ.. తారక్ మా ఇద్దరికీ తలంటేశాడు. "నన్నేమో ఎండల్లో నిలబెట్టి, మీద దుమ్మేసేసి, చొక్కాలిప్పించేశారు" అంటూ తారక్ సరదాగా కోప్పడ్డాడని చెప్పారు.
మొత్తానికి, ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర సినిమా విషయాలను ఎంత సరదాగా ప్రస్తావిస్తారో ఈ సంఘటన మరోసారి తెలియజేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి కలిసి ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్రివిక్రమ్ ఇప్పటికే వెల్లడించారు.
ఇది కూడా చదవండి: టాయిలెట్లో గ్యాంగ్‌స్టర్.. అసలు స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
[Jr NTR, Aravinda Sametha Movie, Allu Arjun, Ala Vaikunthapurramuloo, NTR Trivikram Movie, Trivikram Srinivas, God Of War, Thaman s, Telugu Film News]






