చిరుకి ఆ సత్తా ఉందంటున్న తమ్మారెడ్డి!
on Jan 24, 2023
దాసరి తర్వాత సినీ కార్మికులందరు గౌరవించే వ్యక్తి, సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. దాసరి తర్వాత ఈయనను అందరు గురువు గారు అని పిలుస్తారు. ఇక ఈయన ముక్కుసూటి మనిషి. తానేం భావిస్తాడో దానినే ముక్కుసూటిగా ఓపెన్ గా చెప్పేస్తారు. ఇక విషయానికి వస్తే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య గా, నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిగా బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. థియేటర్లలో వీర సింహారెడ్డి గర్జన చేస్తే వాల్తేరు వీరయ్య పూనకాలు తెప్పించింది. వీరసింహారెడ్డి పక్కా మాస్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం. ఇక వాల్తేరు వీరయ్యది కూడా అదే జోనర్. అయితే చిరు ఎంటర్టైన్మెంట్, వింటేజ్ చిరు లుక్కులు ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లను కోరుకునే ప్రేక్షకులే ఆదరిస్తారని మొదట అందరు భావించారు. రివ్యూలు కూడా దానికి అనుగుణంగానే వచ్చాయి. కానీ ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ చూసి ఆనందిస్తున్నారు.
మెగాస్టార్ వాల్తేరు వీరయ్యలో ఆయన వింటేజీలు ఆయన ఎంటర్టైన్మెంట్ పండించిన విధానం చూసి అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రాలపై కొందరు మాత్రం నెగటివ్ గా మాట్లాడారు. ముఖ్యంగా చిరంజీవి గురించి... అసలు సినిమాలో చిరంజీవి ఏం చేశాడని అంటున్నారు. అలాంటి వారికి సీనియర్ దర్శక నిర్మాత సినీ పెద్దాయన తమ్మారెడ్డి భారద్వాజ పవర్ ఫుల్ పంచ్ ఇచ్చారు. సినిమాలో కథ లేదని చిరంజీవి గురించి నెగటివ్‌గా మాట్లాడే వారికి ఒక విషయం చెప్పారు. ఈ వయసులో ఆయన అలా చేయడం కష్టం. చిరు ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న సినిమాతో వస్తే ఆల్ ఇండియాలో 1000 కోట్లు కలెక్ట్ చేయగల సత్తా ఆయనకు ఉంది. చిరుకి సరైన సినిమా పడితే రికార్డులు కొల్లగొడతాయి. ఈ సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు మంచి రెవిన్యూ తెచ్చాయి. ఇది పరిశ్రమకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.
చిరంజీవి, బాలకృష్ణ ఎవరి స్టామినా వారిది. ఇద్దరూ ఒకేసారి వచ్చి హిట్టు కొట్టారు అని ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇక ఈ రెండు సినిమాల విజయంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. ఒకవేళ ఒక సినిమా హిట్ అయి మరో సినిమా ఫ్లాప్ అయితే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. వాస్తవానికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు విడుదలైన మొదటి రెండు రోజులు మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలు జరిగాయి. కానీ రెండు సినిమాలు హిట్ కావడంతో వారు తమ హీరోల విజయాలను చూసి ఆ ఖుషీ లో ఉండిపోయారు.