Home

»

Latest News

రీల్స్ చేస్తే జీవితం బాగుపడదు.. సినిమాల్లోనే రీటేక్‌లు, జీవితంలో ఉండ‌వు.!

Oct 13, 2026 6:41PM

తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయడంలో ఆయన ముందుంటారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. చదువును కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సాయం అందించడంతో పాటు, యువతకు విలువైన సూచనలు చేశారు.

చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న అగరం ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం నటుడు శివకుమార్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 47వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్లస్ టూ పూర్తి చేసి కళాశాలల్లో చేరిన 25 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. అలాగే ప్రముఖ చిత్రకారుడు జీవానందన్‌కు రూ.లక్ష సాయం చేశారు. పేద, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్న కొన్ని విద్యాసంస్థలతో కలిసి మొత్తం రూ.13.78 లక్షల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం వల్ల మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరని అన్నారు. సినిమాల్లో నటన సరిగా లేకపోతే దర్శకుడు మరోసారి అవకాశం ఇస్తూ రీటేక్ తీసుకుంటారని, కానీ నిజ జీవితంలో అలాంటి రీటేక్‌లు ఉండవని చెప్పారు. అందుకే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చదువులో వెనుకబడినప్పుడు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని ప్రోత్సహించారు.

ఇదిలా ఉంటే.. సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ కూడా ఎన్నో ఏళ్లుగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. 1979లో తన వందో సినిమా ‘రోసాప్పూ రవి కైక్కారి’కి వచ్చిన పారితోషికం రూ.25 వేలును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దాని ద్వారా వచ్చిన వడ్డీని విద్యార్థుల సహాయానికి వినియోగించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 2006 నుంచి అగరం ఫౌండేషన్ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఏటా ఉపకార వేతనాలు, అవార్డులు అందిస్తోంది.

మొత్తంగా.. విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, చదువు ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వినోదానికి ఉపయోగపడినా, జీవితంలో ఎదగాలంటే విద్య, క్రమశిక్షణ, కృషి ముఖ్యమనే సందేశాన్ని ఆయన అందించారు.

 

 

[Suriya, Suriya Charity, Suriya Financial Aid, Suriya Helps Students, Agaram Foundation, Sivakumar Educational Foundation, Suriya Latest News, Tamil Actor Suriya, Student Financial Assistance, Suriya Education Support, Suriya Speech, Kollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com