Home

»

Latest News

సెన్సార్‌ బోర్డుతో క్రియేటివిటీకి సంకెళ్లు: 35 ఏళ్ళ నాటి పాత చట్టాలు మారేదెప్పుడు! 

Oct 13, 2026 6:34PM


ఒక రచయిత, దర్శకుడు తాము అనుకున్న కథ ఎలా అయితే  ప్రేక్షకులకి చే రువుతుందో అని ఎంతో మేధో మధనం చేసి కథనాన్ని సృష్టిస్తారు. ఆ సృషించే ప్రాసెస్ లో సమాజంలో నిత్యం జరిగే కొన్ని జుగుప్సాకర సంఘటనలని కూడా చొప్పించాల్సి వస్తుంది.  అవి మాదక ద్రవ్యాలు కావచ్చు, హత్యలు కావచ్చు ఎలాంటి దారుణమైన సంఘటనలైనా కావచ్చు. అవన్నీ బయట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాతో పాటు పలురకాల మాధ్యమాలలో కూడా చూస్తూనే ఉన్నాం. అందుకే సినిమాలు సమాజానికి అద్దం పట్టాలి. కానీ ఆ అద్దంలో ఏం కనిపించాలో సెన్సార్ బోర్డు నిర్ణయిస్తే ఎలా అని సినీ ప్రియులు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

దాదాపు 35 ఏళ్ల తర్వాత కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, చలనచిత్ర ధృవీకరణ మార్గదర్శకాలను పూర్తిగా సవరించింది. 1991 డిసెంబర్ 6 నాటి పాత నిబంధనలను పక్కన పెట్టి సెప్టెంబర్ 16, 2026 నుంచి సరికొత్త నిబంధనలను అధికారికంగా అమల్లోకి తెచ్చింది. సినిమా రంగంలో సృజనాత్మకతకు, సెన్సార్‌షిప్ నిబంధనలకు మధ్య ఎప్పటికీ ముగియని వివాదానికి ఈ కొత్త నిబంధనలు మరింత జోరునిచ్చాయి. ముఖ్యంగా సినిమాలలో హింస, మాదకద్రవ్యాల వాడకం, సామాజిక విలువులు మరియు మతపరమైన అంశాలపై మరింత కఠినమైన ఆంక్షలు విధించారు. నూతన నిబంధనల ప్రకారం, డ్రగ్స్ వాడకం లేదా అక్రమ రవాణాని నేరుగా ఆకర్షణీయంగా చూపించడాన్ని తీవ్రంగా పరిమితం చేశారు. ఒకవేళ కథలో అది అనివార్యమైతే ఖచ్చితంగా   ముందస్తు హెచ్చరికలు లేదా స్టాట్యూటరీ వార్నింగ్‌లు జతచేయాలని స్పష్టం చేశారు. అలాగే, మహిళలను కించపరిచే దృశ్యాలు, అసభ్యకరమైన అంశాలు మరియు అనుచితమైన హింసను ప్రదర్శించకుండా కట్టడి చేసేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సంస్కరణల వెనుక డిజిటల్ యుగానికి తగినట్లుగా సినిమాలను వర్గీకరించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, మరోవైపు ఇది సృజనాత్మక స్వేచ్ఛను అణచివేసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నూతన నిబంధనలలో భాగంగా దేశ సమైక్యతకు భంగం కలిగించేలా, విదేశీ సంబంధాలను దెబ్బతీసేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉండే కంటెంట్‌పై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, కోర్టుల గౌరవాన్ని తగ్గించే అంశాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే దృశ్యాలు లేదా సమాజంలో మూఢనమ్మకాలను రెచ్చగొట్టే విషయాలపై సెన్సార్ బోర్డు ఉక్కుపాదం మోపనుంది. అయితే, ఈ ఆంక్షల పరిధి చాలా విస్తృతంగా ఉండటం వల్ల భవిష్యత్తులో దర్శకులు, నిర్మాతలు తమ ఆలోచనలను స్వేచ్ఛగా తెరకెక్కించడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూఏ (UA) కేటగిరీని U/A 7+, U/A 13+, U/A 16+ గా విభజించడం ద్వారా పిల్లలు మరియు యువత చూసే కంటెంట్‌పై వయసుల వారీగా నియంత్రణ తెచ్చినప్పటికీ, కంటెంట్ కటింగ్ విషయంలో మరింత కఠినత కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: విమానం లోపల హాలీవుడ్ నటి వీరంగం: వాళ్లనే ఎందుకు కొరికింది! 

 

 


మరోవైపు, ఇప్పటికే ఆగస్టు నుండి అమల్లోకి వచ్చిన రూల్ 33 మార్పుల ప్రకారం చిత్రాలకి  సెన్సార్ సర్టిఫికెట్ జారీ అయిన తర్వాత రన్‌టైమ్‌లో మార్పులు చేయడం, కటింగ్స్ లేదా అదనపు దృశ్యాలను జోడించడం వంటి సౌలభ్యాలను పూర్తిగా తొలగించారు. ఒకసారి సర్టిఫై అయిన తర్వాత సినిమా నిడివిని తగ్గించాలన్నా లేదా కొత్త సబ్‌టైటిల్స్ జోడించాలన్నా కుదరదని స్పష్టం చేయడంతో చిత్ర యూనిట్‌లకు ఇబ్బందులు తప్పడం లేదు. గత మూడు దశాబ్దాలుగా మారుతున్న కాలానికి తగినట్లుగా చిత్ర పరిశ్రమ ఎదుగుతున్న తరుణంలో, ఈ నిబంధనలు ఎంతవరకు దోహదపడతాయి. లేక సృజనాత్మకతకు అడ్డుకట్ట వేస్తాయి అనేది కాలమే నిర్ణయించాలి. సామాజిక బాధ్యత పేరుతో కళాకారుల భావప్రకటన స్వేచ్ఛను హరించకుండా, ప్రజాస్వామ్య విలువలకు మరియు సృజనాత్మక స్వేచ్ఛకు మధ్య సరైన సమతుల్యత సాధించడమే ప్రస్తుత తరుణంలో అసలైన సవాల్‌గా మారింది.

 

[Cbfc New Certification Rules India, CBFC new rules, film certification India, censorship vs creativity, Cinematograph Act, 35 year old rules, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com