
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న RC17 సినిమాపై రోజుకో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం చాలా ఏళ్లుగా కొనసాగుతున్న అనుబంధం. ఆర్య నుంచి పుష్ప 2 వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి. అందుకే RC17కు కూడా దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తారని చాలామంది భావించారు. కానీ కొన్ని రోజులుగా ఈ సినిమాకు ఆయన స్థానంలో మరో సంగీత దర్శకుడు వచ్చే అవకాశముందనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్మాత మైత్రి రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా కీలక నిర్ణయాలేవీ తీసుకోలేదని నిర్మాత రవిశంకర్ స్పష్టం చేశారు. సాంకేతిక బృందం, ఇతర నటీనటుల ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

‘దొంగ నా కొడుకు’ టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన.. సుకుమార్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత సాంకేతిక బృందం విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో RC17కు సంబంధించి ఇప్పుడే ఎవరినీ ఖరారు చేసినట్లు భావించకూడదనే విషయం స్పష్టమవుతోంది.
దేవిశ్రీ ప్రసాద్‌తో తమ నిర్మాణ సంస్థకు ఉన్న అనుబంధాన్ని మైత్రి రవి గుర్తుచేశారు. తమ సంస్థలో ఆయన ఏడు సినిమాలకు పనిచేశారని, ఆ సినిమాలన్నీ బ్లాక్బస్టర్లుగా నిలిచి చార్ట్‌బస్టర్ పాటలను అందించాయని పేర్కొన్నారు.
అదే సమయంలో ఒక సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంపిక చేయకపోతే, దానర్థం ఆయన ప్రతిభను లేదా తమ సినిమాలకు ఆయన చేసిన సేవలను తక్కువగా చూడటం కాదని వివరించారు. ఆయన కెరీర్ ఇంకా చాలా ముందుకు సాగాల్సి ఉందని, ఒక్క సినిమా ఎంపికతో ఆయన ప్రయాణాన్ని అంచనా వేయలేమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
RC17కు దేవిశ్రీ ప్రసాద్‌ను తీసుకోవాలా? లేక మరో సంగీత దర్శకుడితో పనిచేయాలా? అనే నిర్ణయం పూర్తిగా సుకుమార్‌దేనని నిర్మాత రవి స్పష్టం చేశారు. దర్శకుడి సృజనాత్మక నిర్ణయాల్లో నిర్మాణ సంస్థ జోక్యం చేసుకోదని చెప్పారు.
దీంతో RC17లో దేవిశ్రీ ప్రసాద్ ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. మరోవైపు ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ పేరు ప్రచారంలో ఉంది.
ఇది కూడా చదవండి: RC17 పూజకు ముహూర్తం ఫిక్స్.. రామ్ చరణ్, సుకుమార్ సెకండ్ మూవీ అందుకే లేట్.!
[RC17 Music Director, Mythri Ravi, Devi Sri Prasad, RC17 Movie, Ram Charan, Sukumar, Anirudh Ravichander, Mythri Movie Makers, Donga Naa Koduku Teaser, Telugu Film News]






