సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై నటి నీతి టేలర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు మహిళా నటీమణులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నీతి టేలర్ కూడా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక దర్శకుడు సినిమా అవకాశం పేరుతో తనను ఇబ్బందికరమైన కోరిక కోరాడని ఆమె తెలిపారు.
నీతి టేలర్ తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’, ‘పెళ్లి పుస్తకం’ వంటి సినిమాల్లో నటించారు. దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్న సమయంలో తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తి, ఆ సినిమా పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ కోసం తనను సంప్రదించాడని ఆమె చెప్పారు. అయితే, ఆ దర్శకుడు ఫోన్‌లో మాట్లాడిన తీరు తనను షాక్‌కు గురిచేసిందని వెల్లడించారు. ఈసారి సినిమాలో అవకాశం కావాలంటే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అతడు అడిగినట్లు నీతి తెలిపారు.
ఆ మాటలు విన్న వెంటనే తనకు ఏం చేయాలో అర్థం కాలేదని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నటి గుర్తుచేసుకున్నారు. వెంటనే ఫోన్ కట్ చేసి, అతడి నంబర్‌ను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించానని తెలిపారు. గతంలో ఆ దర్శకుడిని ఇతర మహిళలతో కూడా చూసినప్పటికీ, తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదని ఆమె పేర్కొన్నారు.
ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, దాని తర్వాత సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు నీతి టేలర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై మరోసారి చర్చకు దారితీశాయి. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి దర్శకుడి పేరును ఆమె వెల్లడించలేదు.
[Niti Taylor Casting Couch, Niti Taylor Shocking Interview, South Director Casting Couch Allegations, Niti Taylor Telugu Movies, Niti Taylor Me Vayasuku Vacham, Casting Couch in Film Industry, Niti Taylor Latest News]






