అప్పుడు నో చెప్పడం వల్లే ఇన్ని సినిమాలు చేశా.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు.!
Nov 25, 2026 5:53PM

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది నటులు పార్టీలకు, పబ్బులకు అలవాటు పడుతుంటారు. అక్కడే కొందరు చెడు అలవాట్లకు బానిసలవుతుంటారు. అయితే తనకు కూడా విద్యార్థి దశలో ఇలాంటి అనుభవమే ఎదురైందని నటుడు నిఖిల్ సిద్ధార్థ్ తెలిపారు. అప్పట్లో ఆ చెడు అలవాట్లకు నో చెప్పడం వల్లే ఇప్పుడు నటుడిగా మంచి స్థాయిలో ఉన్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘నషాముక్త్ భారత్’ పాదయాత్రలో నిఖిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన నిఖిల్.. తన జీవితంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.
‘‘మన చుట్టూ ఉండే కొంతమంది మనల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. పార్టీల్లో, ఫంక్షన్లలో ఇది చేస్తావా? అది తీసుకుంటావా? అంటూ చెడు అలవాట్లు నేర్పించే ప్రయత్నం చేస్తారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పుడు నేను నో చెప్పకపోయుంటే ఇప్పుడు 21 సినిమాలు చేసేవాడిని కాదు’’ అని నిఖిల్ తెలిపారు. తన జీవితంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఎంత కీలకంగా మారిందో ఈ మాటల ద్వారా వివరించారు.
సిగరెట్, మద్యం, డ్రగ్స్ వంటి అలవాట్లు వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయని నిఖిల్ చెప్పారు. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషంగా ఉండాలంటే ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా, మనకు నచ్చని విషయాలకు ధైర్యంగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు!
మొత్తానికి నిఖిల్ చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా ‘నో చెప్పకపోయుంటే 21 సినిమాలు చేసేవాడిని కాదు’ అనే మాట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీవితంలో ఎదగాలంటే కొన్ని సందర్భాల్లో స్నేహితుల ఒత్తిడికి తలొగ్గకుండా మన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన చెప్పకనే చెప్పారు.
మీకు నచ్చవచ్చు:
తరుణ్ భాస్కర్ ఆవేశం వెనుక అసలు కథ ఇదేనా.?
‘భోగి’కి A సర్టిఫికెట్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.?
[Nikhil Siddhartha, Nasha Mukt Bharat, Hyderabad, Kishan Reddy]



