
నందమూరి బాలకృష్ణ అంటే సినిమాలు, రాజకీయాలే కాదు.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపైనా అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు బాలయ్య కొత్త ఇంటి గురించి ఆసక్తికరమైన వార్తలు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన కోసం ఓ అల్ట్రా లగ్జరీ భవనం సిద్ధమవుతోందట. దీని విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. సినీ, రాజకీయ ప్రముఖులు నివసించే ఈ ప్రాంతంలో బాలకృష్ణ కొత్త నివాసం రూపుదిద్దుకుంటోంది. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.
సాధారణ ఇళ్లకు భిన్నంగా, అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారట. ఇంట్లోనే సినిమాలు చూసేందుకు ప్రత్యేక హోమ్ థియేటర్, ఫిట్‌నెస్ కోసం అత్యాధునిక పరికరాలతో జిమ్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు ఆహ్లాదకరమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్, పూజల కోసం ప్రత్యేక మందిరం కూడా ఈ ఇంట్లో ఉండనున్నాయట.
బాలకృష్ణ కొత్త ఇంటి నిర్మాణం ఒక ఎత్తయితే.. దాని ఇంటీరియర్స్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఇంటి అలంకరణ, ఇంటీరియర్ డిజైనింగ్ పనులను బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఆధునిక విలాసవంతమైన హంగులు ఉండేలా ఇంటిని తీర్చిదిద్దుతున్నారట. ప్రతి గదిలోనూ ప్రత్యేకమైన డిజైన్, ఖరీదైన ఇంటీరియర్స్‌తో రాయల్ లుక్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇక ఈ భవనం నిర్మాణం, ఇంటీరియర్స్, స్థలం విలువ అన్నీ కలిపితే మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ కొత్త ఇంటి గురించి చర్చ జరుగుతున్న వేళ.. ఆయన పాత నివాసం గురించి కూడా ప్రస్తావించుకోవాలి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా బాలయ్య బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఆ ఇంటికి ఆయన తండ్రి, దివంగత ఎన్టీ రామారావుతో ప్రత్యేక అనుబంధం ఉంది.
కుటుంబ జ్ఞాపకాలతో పాటు రాజకీయ సమావేశాలు, అభిమానులతో భేటీలకు కూడా ఆ నివాసం వేదికగా నిలిచింది. అలాంటి ఇంటి స్థలంలో కొంత భాగాన్ని నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం బాలకృష్ణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కుటుంబంతో కలిసి నివసించేందుకు కొత్త ఇంటిని సిద్ధం చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: 'RC17' కోసం అనిరుధ్.. దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవడానికి కారణం ఇదేనా.?
[Nandamuri Balakrishna New House, Balakrishna Luxury House, Balakrishna House Cost, Balakrishna New House, Nandamuri Balakrishna, Balakrishna House, NTR Balakrishna, Telugu Film News]




