.webp)
తారాగణం: మాధవ్ భూపతిరాజు, దీపా బాలు, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, రూపలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, బిప్రదీప్ దత్తా
డీఓపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: సాయి బాబు తలారి
దర్శకత్వం: మంచాల నాగరాజు
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
విడుదల తేదీ: సెప్టెంబర్ 10, 2026
మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతూ నటించిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'మారెమ్మ'. మంచాల నాగరాజు దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, పక్కా రూరల్ కల్చర్, అమ్మవారి జాతర, జంతు బలిదానం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన 'మారెమ్మ' సినిమా మెప్పించిందా? మాధవ్ డెబ్యూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
తెలంగాణలోని మహిషాపురం అనే ఒక గ్రామంలో జరిగే 'మారెమ్మ' అమ్మవారి జాతర నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆ ఊరిలో ప్రతి ఏటా అమ్మవారికి ఓ దున్నపోతుని బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి హీరో కర్ణి(మాధవ్ భూపతిరాజు) పెంచుకున్న దున్నపోతుని జాతరలో బలి ఇవ్వడానికి ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. తీరా బలి ఇచ్చే సమయానికి ఆ పవిత్రమైన దున్నపోతు ఊహించని విధంగా మాయమవుతుంది. అసలు ఆ దున్నపోతు ఎక్కడికి వెళ్లిపోయింది? అది మళ్ళీ దొరికిందా లేదా? బలి జరగకపోతే ఊరికి ఏమైనా ముప్పు వాటిల్లుతుందా? ఆ ముప్పు నుంచి బయటపడటానికి ఊరి ప్రజలు, హీరో ఏం చేశారు అనేదే ఈ 'మారెమ్మ' చిత్ర కథ.

విశ్లేషణ:
'మారెమ్మ' కథ విన్నప్పుడు మలయాళ మూవీ 'జల్లికట్టు' కథ గుర్తుకు రావడం సహజం. అందులో కూడా తప్పిపోయిన దున్నపోతుని వెతికే పనిలో ఊరంతా ఉంటుంది. అయితే ఆ కథ వేరే వెర్షన్ లో నడుస్తుంది. దున్నపోతు మిస్సింగ్ పాయింట్ ను మాత్రమే తీసుకొని, దానికి దైవత్వాన్ని జోడించి.. ఈ 'మారెమ్మ' కథ రాసుకున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఇలా తెలంగాణ నేపథ్యంలో, ఈ తరహా కథతో ఇప్పటికే 'పొట్టేల్' అనే సినిమా వచ్చింది. అందులో కూడా గ్రామ దేవతకు బలివ్వడం కోసం ఉంచిన ప్రత్యేకమైన పొట్టేల్ (గొర్రె) కనిపించకుండా పోతుంది. ఆ సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ, 'మారెమ్మ'లో మాత్రం ఎమోషన్స్ పండలేదు.
తెలంగాణ నేటివిటీని, స్థానిక ఆచార వ్యవహారాలను, అలాగే జానపద పాటలను ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు బాగానే ప్రెజెంట్ చేశాడు. అయితే, ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్.. అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టత లేకపోవడమే. జంతు బలుల గురించి ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకున్నారా లేక ఒక విలేజ్ రివెంజ్ డ్రామా చూపించాలనుకున్నారా అనేది క్లారిటీ లేకుండా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా తప్పిపోయిన దున్నపోతుని వెతికే క్రమంలోనే నడుస్తుంది. కానీ అక్కడ స్క్రీన్‌ప్లే చాలా చప్పగా, ఎలాంటి ఎమోషన్ లేదా గ్రిప్పింగ్ మూమెంట్స్ లేకుండా బోర్ కొట్టిస్తుంది. దీనికితోడు, విలన్ ట్రాక్ మొత్తం చాలా పేలవంగా డిజైన్ చేశారు. మధ్యలో వచ్చే చేతబడి ఎపిసోడ్లు కూడా కథకి ఎలాంటి ప్లస్ కాలేకపోయాయి. హీరో క్యారెక్టర్ ని, దున్నపోతుతో అతనికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని ఇంకాస్త లోతుగా బిల్డ్ చేసి ఉంటే అవుట్‌పుట్ వేరేలా ఉండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
డెబ్యూ హీరోగా మాధవ్ భూపతిరాజు తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఊరి కుర్రాడిగా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ సహజంగా ఉన్నాయి. మొదటి సినిమానే అయినా ఎక్కడా తడబడకుండా చాలా సిన్సియర్‌గా పెర్ఫార్మ్ చేశాడు. అలాగే హీరోయిన్ దీపా బాలు కూడా పల్లెటూరి అమ్మాయిగా డిసెంట్ లుక్స్, నటనతో మెప్పించింది. ప్రశాంత్ విహారి, బిప్రదీప్ దత్తా అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తాయి. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఓవరాల్‌గా చూసుకుంటే..
మాధవ్ భూపతిరాజు తన వంతుగా కష్టపడినప్పటికీ.. వీక్ స్క్రీన్ ప్లే, క్లారిటీ లేని డైరెక్షన్ వల్ల 'మారెమ్మ' ఒక డిజప్పాయింటింగ్ రూరల్ డ్రామాగానే మిగిలిపోయింది.
రేటింగ్: 2/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
[Maremma Review Telugu, Maremma Movie Review, Maremma Review Rating, Maadhav Bhupatiraju, Raviteja, Telugu Movie Review, Telugu Cinema Review, Telugu Film News]






