TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఢమరుకం: 14 ఏళ్ళ తర్వాత నాగార్జున రికార్డుకు ఎసరు.!

Nov 26, 2026 5:08PM

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన రికార్డు పోరు మొదలైంది. నాగార్జున నటించిన ‘ఢమరుకం’ సినిమా నవంబర్ నెలలో సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డుకు ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేరువయ్యాయి. అవే ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE Repeat), ‘ఆకాశంలో ఒక తార’. ఒకటి ఈ వారంలోనే రికార్డును దాటే అవకాశం ఉండగా, రెండో సినిమా కూడా త్వరలోనే ఆ మార్క్‌ను అందుకునే దిశగా వెళ్తోంది.

2012 నవంబర్ 23న విడుదలైన ‘ఢమరుకం’ అప్పట్లో నాగార్జున కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.48 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. అప్పటి నుంచి నవంబర్ నెలలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఈ రికార్డు అలాగే కొనసాగుతోంది.

ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆ రికార్డుకు గట్టి పోటీ ఎదురవుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఇప్పటికే మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. నవంబర్ 19న విడుదలైన ఈ సినిమా ఏడో రోజు ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ ట్రాకింగ్ సంస్థల అంచనాలు వెల్లడిస్తున్నాయి. రూ.48 కోట్ల మార్క్‌కు చేరాలంటే మరికొంత వసూలు చేయాల్సి ఉంది.

మరోవైపు దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ కూడా బాక్సాఫీస్ దగ్గర తన జోరు చూపిస్తోంది. నవంబర్ 20న విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.37 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగితే ‘దమరుకం’ రికార్డుకు చేరువయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: జపాన్‌లో లెనిన్ రిలీజ్.. ప్రభాస్, ఎన్టీఆర్ రేంజ్‌కి అఖిల్ వెళ్తాడా.?

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు కేవలం ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు రెండూ ఒకే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ నాగార్జున రికార్డును అందుకునే దిశగా సాగుతున్నాయి. ఒకవేళ రెండూ రూ.48 కోట్ల మార్కును దాటితే, ఒకే ఏడాది నవంబర్‌లో విడుదలైన రెండు తెలుగు సినిమాలు ఆ రికార్డును అధిగమించినట్లవుతుంది.

మరి ముందుగా ఈ రికార్డును బద్దలు కొట్టేది ‘ఈ నగరానికి ఏమైంది 2’నా? లేక ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఊహించని వేగంతో దూసుకొస్తుందా? మొత్తానికి ఈ వీకెండ్ బాక్సాఫీస్ లెక్కలు ఆసక్తికరంగా మారాయి.

మీకు నచ్చవచ్చు:
వృషకర్మ ట్రైలర్‌.. అసలు ఊహించలేదు.. పాన్ ఇండియా షేక్ అవుతుందేమో.!
ఎన్టీఆర్‌లో ఆ యాంగిల్.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అనిల్ రావిపూడి హింట్.!

 

 

 

[Nagarjuna, Damarukam, November Record, ENE Repeat, Aakasamlo Oka Tara]

 

google-ad-img