బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ 'డాన్' సిరీస్ నుంచి వస్తున్న తాజా వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కింగ్ ఖాన్ షారూఖ్ స్థానంలో 'డాన్ 3'లోకి ఎంట్రీ ఇచ్చిన రణవీర్ సింగ్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ అప్‌డేట్ విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.
అయితే రణవీర్ ఈ సినిమా నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో వచ్చిన 'క్రియేటివ్ డిఫరెన్సెస్' అని తెలుస్తోంది. రణవీర్ సింగ్ ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా, అత్యంత హింసాత్మకంగా (Raw and Gritty) రూపొందించాలని కోరారట. ముఖ్యంగా సినిమాలో బోల్డ్ డైలాగులు, బూతులు ఉండాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం.
సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభావాన్ని చూసి, రణవీర్ కూడా 'డాన్' క్యారెక్టర్‌ను అదే తరహాలో డార్క్‌గా చూపించాలని ఆశపడ్డారట. కానీ, ఫర్హాన్ అక్తర్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నట్లు టాక్. 'డాన్' అంటే ఒక క్లాస్, ఒక డిగ్నిటీ ఉంటుందని.. దానికి అసభ్యతను జోడించడం తనకు ఇష్టం లేదని ఫర్హాన్ ఖరాకండిగా చెప్పేశారట.
గతంలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు పోషించిన ఈ పాత్రకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. 2006లో వచ్చిన 'డాన్', ఆపై వచ్చిన 'డాన్ 2' చిత్రాలు స్టైలిష్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. ఆ వారసత్వాన్ని కేవలం వసూళ్ల కోసం బూతులతో పాడుచేయడం ఇష్టం లేకనే ఫర్హాన్ తన పంతం నెగ్గించుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వర్గం ప్రేక్షకులు 'యానిమల్' తరహా ట్రీట్మెంట్ ఉంటే బాగుంటుందని అంటుంటే, మరికొందరు మాత్రం ఫర్హాన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. సినిమా అంటే కేవలం రక్తం, బూతులు మాత్రమే కాదు.. క్యారెక్టరైజేషన్‌లో ఉండే పవర్ ముఖ్యం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
రణవీర్ తప్పుకోవడంతో ఇప్పుడు 'డాన్ 3' రేసులోకి మళ్ళీ ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫర్హాన్ అక్తర్ ప్రస్తుతం స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని, త్వరలోనే కొత్త హీరోను అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ ఐకానిక్ పాత్రను పోషించే లక్కీ స్టార్ ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!




