English | Telugu
పది రోజుల కొడుకు దేవ్‌యాన్‌ను పరిచయం చేసిన శ్రేయా ఘోషల్
Updated : Jun 2, 2021
గాయని శ్రేయా ఘోషల్ మే 22న పండంటి బుడతడికి జన్మనిచ్చారు. 2015లో బిజినెస్‌మ్యాన్ శిలాదిత్యను ఆమె వివాహం చేసుకున్నారు. తమ అనురాగానికి చిహ్నంగా పది రోజుల క్రితం కొడుకు పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. శ్రేయా ఘోషల్ తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.
బుధవారం తన కొడుకును సోషల్ మీడియా వేదిక ద్వారా అందరికీ పరిచయం చేశారు. భర్త శిలాదిత్యతో కలిసి దేవయాన్‌ను చేతుల్లో ఎత్తుకొని ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. దేవయాన్ ముఖోపాధ్యాయగా తమ కొడుక్కు పేరు పెట్టినట్లు వెల్లడించారు. "ఇంట్రడ్యూసింగ్ - దేవ్‌యాన్ ముఖోపాధ్యాయ. మే 22న అతడు వచ్చాడు. మా జీవితాల్ని పూర్తిగా మార్చేశాడు. పుట్టిన తొలి క్షణాలలో మా హృదయాల్లో అతను నింపిన ప్రేమను కేవలం ఒక తల్లి, ఒక తండ్రి మాత్రమే ఫీల్ కాగలరు. అది స్వచ్ఛమైన అనియంత్రిత అమితమైన ప్రేమ." అని ఆమె రాసుకొచ్చారు.
శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం "దేవదాస్"తో ప్రారంభించారు. ఆమెకు ఆ మొదటి చిత్రమే బెస్ట్ సింగర్‌గా జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. అలా ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.