English | Telugu
'అన్‌స్టాపబుల్' షోలో నాని సర్ప్రైజ్.. ఎమోషనల్ అయిన బాలయ్య!
Updated : Nov 13, 2021
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోతో ఓటీటీ వేదిక ఆహాలో నటసింహం నందమూరి బాలకృష్ణ అలరిస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య తొలిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ షోకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ షోలో మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా సీనియర్ నటుడు మోహన్ బాబు రాగా.. సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని వచ్చాడు. సెకండ్ ఎపిసోడ్ కూడా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య, నానిలు కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్యకి నాని ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. పదేళ్ల క్రితం బాలయ్య గొప్ప మనస్సుతో చేసిన ఓ సాయాన్ని గుర్తు చేస్తూ నాని ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
సేవా కార్యక్రమాల్లో బాలయ్య ఎప్పుడూ ముందుంటాడు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ బారిన పడిన ఎందరో పేదవారికి ఉచిత వైద్యం అందించాడు. అలా పదేళ్ల క్రితం ఓ చిన్నారి ప్రాణాలను నిలబెట్టాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నాని మొదట ఓ వీడియో ద్వారా సర్ ప్రైజ్ చేశాడు. ఆ వీడియోలో వినీలాంబిక అనే పదేళ్ల పాప, ఆమె తల్లి కనిపించారు. వీడియోలో వినీల తల్లి మాట్లాడుతూ.. 2011 జూన్ లో మా పాప పుట్టిందని, పుట్టిన కొన్ని నెలలకే ఆరోగ్య సమస్యలు వచ్చాయని, ఎన్నో ఆసుపత్రులు తిరిగినా వైద్యం అందలేదని తెలిపింది. చివరికి మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ద్వారా బసవతారకం ఆసుపత్రికి వెళ్లామని చెప్పింది. ఆరోగ్య శ్రీ లేకపోయినా వైద్యం అందించి మా పాపని కాపాడారని, ఈరోజు మా పాప ఇలా కళ్ళ ముందు ఉందంటే దానికి బాలకృష్ణ గారే కారణమని ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె చెప్పుకొచ్చింది.
ఆ వీడియో చూసి బాలయ్య ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు మీకు ఇంకో సర్ ప్రైజ్ అంటూ నాని ఆ పాప వినీలాంబికని బాలయ్య ముందుకి రమ్మని పిలిచాడు. దీంతో ఆ పాప బాలయ్య దగ్గరకు ఆనందంగా వచ్చింది. బాలయ్య ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దాడాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలలో వైరల్ గా మారాయి. బాలయ్య మనస్సు బంగారం అంటూ నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.