English | Telugu

మొన్న మ‌ణిశ‌ర్మ‌.. నిన్న అనూప్.. నేడు మిక్కీ!

మ్యాచో స్టార్ గోపీచంద్ కి క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల్లో శ్రీవాస్ ఒక‌రు. `ల‌క్ష్యం`, `లౌక్యం`.. ఇలా ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజ‌యం అందుకున్నాయి. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో గోపీచంద్ - శ్రీ‌వాస్ ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్నారు. కోల్ క‌తా నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నుంది.

ఇదిలా ఉంటే.. గోపీచంద్ - శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపొందిన మొద‌టి సినిమా `ల‌క్ష్యం`కి మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించ‌గా.. సెకండ్ జాయింట్ వెంచ‌ర్ `లౌక్యం`కి అనూప్ రూబెన్స్ బాణీలు అందించారు. ఆ రెండు సినిమాలు కూడా మ్యూజిక‌ల్ గా మెప్పించాయి. ఇక ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమాకి యంగ్ కంపోజ‌ర్ మిక్కీ జే మేయ‌ర్ ట్యూన్స్ క‌ట్ట‌నున్నాడు. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ఇటు గోపీచంద్ తోనూ, అటు శ్రీ‌వాస్ తోనూ మిక్కీ జే మేయ‌ర్ కి ఇదే మొద‌టి సినిమా కానుంది. మ‌రి.. మ‌ణిశ‌ర్మ‌, అనూప్ లాగే మిక్కీ కూడా ఈ కాంబో మూవీకి ప్ల‌స్ అవుతాడేమో చూడాలి.

కాగా, మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందించిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్` డిసెంబ‌ర్ 24న తెర‌పైకి రానుంది. మ‌రోవైపు.. గోపీచంద్ తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` వ‌చ్చే సంవ‌త్స‌రం మార్చి 18న రిలీజ్ కానుంది.