English | Telugu
‘రాజా సాబ్’కి షాక్ ఇచ్చిన ‘అవతార్3’.. ఓవర్సీస్ కలెక్షన్లపై ప్రభావం ఉండబోతోందా?
Updated : Dec 8, 2025
‘సలార్’, ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మారుతి కాంబినేషన్‌లో తొలిసారి నటిస్తున్న ప్రభాస్‌కి హారర్ కామెడీ జోనర్‌లో సినిమా చేయడం కూడా మొదటి సారే.
తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, రెబల్‌సాంగ్‌కిమంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్‌కి నెలరోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. జనవరి 8న ఓవర్సీస్‌లో ‘రాజాసాబ్’ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రభాస్ సినిమాల కలెక్షన్స్‌లో ఓవర్సీస్ పార్ట్ చాలా ఉంటోంది. గతంలో ఓవర్సీస్ మార్కెట్‌పై హీరోలు దృష్టి పెట్టినా ఆశించిన స్థాయిలో వచ్చేవి కాదు. బాహుబలి తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోయాయి.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఓవర్సీస్ కలెక్షన్స్ కీలకంగా మారాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సలార్, కల్కి కూడా అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో రాజాసాబ్ ఓవర్సీస్ కలెక్షన్లపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. కానీ, ఈసారి ప్రభాస్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లు తారుమారయ్యేలా కనిపిస్తోంది. రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో చూస్తే ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది.
ప్రభాస్ చేసిన ప్రతి సినిమా ఓవర్సీస్‌లో ఐమాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఐమాక్స్ థియేటర్లలో ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. దీంతో ఐమాక్స్ ద్వారా వచ్చే కలెక్షన్లకు గండిపడే అవకాశం ఉంది. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ‘అవతార్3’ దానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అవతార్, అవతార్2 చిత్రాలు విజువల్‌గా ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఐమాక్స్‌లో మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలని ప్రతి ఆడియన్ అనుకుంటాడు. దానికి తగ్గట్టుగానే అవతార్3 చిత్రాన్ని నాలుగు వారాలపాటు ఐమాక్స్ థియేటర్లలో ప్రదర్శించేందుకు ఒప్పందం జరిగింది.
ఆ కారణంగా ‘రాజాసాబ్’ చిత్రాన్ని ఈసారి ఓవర్సీస్‌లో ఐమాక్స్ ఫార్మాట్‌లో ప్రదర్శించడం లేదు. మరి దీని తాలూకు ఎఫెక్ట్ కలెక్షన్లపై ఏమేరకు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఐమాక్స్ ఫార్మాట్ అందుబాటులో లేకపోయినా ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్‌తోపాటు ఇతర ఫార్మాట్లలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా కొన్ని థియేటర్లు అవతార్3కి వెళ్లిపోయాయి. అయితే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో స్పెషల్ ఫార్మాట్‌లో సినిమాను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.