English | Telugu
మన స్టార్స్ 'గని' మూవీ చేయరు!
Updated : Apr 6, 2022
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'గని'. రినైసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎన్నో ఏళ్ల అనుభవమున్న కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 8 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన వరుణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'మిస్టర్' సినిమాకి కిరణ్ కోడైరెక్టర్ గా పనిచేశారని.. ఆ సమయంలోనే మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయని అనిపించిందని వరుణ్ అన్నాడు. 'తొలిప్రేమ'కి వెంకీ కొత్త డైరెక్టర్ కావడంతో కిరణ్ ని కోడైరెక్టర్ గా తీసుకున్నామని, ఆ మూవీ టైంలోనే తమ మధ్య కథా చర్చలు జరిగాయని తెలిపాడు. స్పోర్ట్స్ డ్రామా చేద్దామని తానే చెప్పానని..'తమ్ముడు', 'భద్రాచలం' సినిమాలు తనకి ఇష్టమని.. కానీ ఇప్పుడు మన దగ్గర అలాంటి సినిమాలు రావట్లేదని, అందుకే స్పోర్ట్స్ డ్రామా చేయాలి అనిపించిందని వరుణ్ చెప్పుకొచ్చాడు.
'గని'ని పాన్ ఇండియా సినిమాగా చేయాలన్న ఉద్దేశంతో సునీల్ శెట్టి, ఉపేంద్ర వంటి వారిని తీసుకోలేదని.. ఆ పాత్రలకు వాళ్ళు కరెక్ట్ అని డైరెక్టర్ నమ్మారని వరుణ్ అన్నాడు. మూవీలో సునీల్ శెట్టి చేసిన రోల్ నార్త్ ఇండియన్ అని, అందుకే ఆయనను తీసుకున్నామని చెప్పాడు. అలాగే ఉపేంద్ర చేసిన రోల్ కి ముందు నుంచి ఆయనతోనే చేపించాలని డైరెక్టర్ అనుకున్నారని తెలిపాడు. ఆ రోల్ కి చాలా హై స్టేచర్ ఉన్న వ్యక్తి కావాలని, మన దగ్గర స్టార్స్ ఇప్పటికీ సూపర్ స్టార్ డమ్ లో ఉన్నారని, వాళ్ళెవరూ ఈ రోల్ చేయరని వరుణ్ అన్నాడు. అంతేతప్ప పాన్ ఇండియా ఆలోచనతో ఉపేంద్రను తీసుకోలేదని వరుణ్ చెప్పాడు. హిందీలో బాక్సింగ్ సినిమాలు చాలా వచ్చాయని, అందుకే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడం అంత కరెక్ట్ కాదు అనిపించిందని అన్నాడు. ఇంత వరకు వాళ్ళు చూడని కథతో హిందీ సినిమా చేయాలని ఉందని వరుణ్ తెలిపాడు.
కథ నచ్చితే ఏ హీరోతోనైనా మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమేనని వరుణ్ తెలిపాడు. తన ఏజ్ గ్రూప్ లో అయితే సాయి ధరమ్ తేజ్, నితిన్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఉందని, వారితో చాలా కంఫర్టబుల్ గా ఉంటానని అన్నాడు. డిఫరెంట్ సినిమాలు చేయాలని, కానీ అవి మన ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఉండాలని అభిప్రాయపడ్డాడు. 'అంతరిక్షం' డిఫరెంట్ గా ఉంటుందని కానీ మరి అంత వెరైటీ అవసరం లేదని తరువాత అర్థమైందని అన్నాడు. అలాగే 'మిస్టర్' చూశాక ఇంత పాత చెయ్యక్కర్లేదు అనిపించిందని వరుణ్ తెలిపాడు.