English | Telugu
'మగధీర'కు సరిజోడీ.. ఉపాసన గుర్రపు స్వారీ!
Updated : Jan 11, 2021
మెగాస్టార్ చిరంజీవికి గుర్రపు స్వారీ అంటే మహా ఇష్టం. ఇప్పుడు తగ్గాయి కానీ, ఇరవై ఏళ్ల క్రితం ఆయన సినిమాల్లో హార్స్ రైడింగ్ సీన్లు లేని సినిమాలు తక్కువ. యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా గుర్రపు స్వారీ చేస్తూ ఆయన కనిపించేవారు. కిరాయి రౌడీలు, ఖైదీ, వేట, కొదమ సింహం, కొండవీటి దొంగ, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా తదితర సినిమాల్లో ఆయన హార్స్ రైడింగ్ సీన్లు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి.
ఆయన అభిరుచి కుమారుడు రామ్‌చరణ్‌కూ వచ్చింది. తన రెండో సినిమా 'మగధీర'లో చరణ్ హార్స్ రైడింగ్‌తో ఎలా ఆకట్టుకున్నాడో చూశాం. అంతే కాదు.. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్‌కు ఆయన యజమాని కూడా. హార్స్ రైడింగ్ చేస్తూ పోలో ఆడటంలోనూ చరణ్ నేర్పరి. ఆయనకు సొంతంగా గుర్రపుశాల ఉంది. అందులో కొన్ని గుర్రాలున్నాయి.
ఇప్పుడు చరణ్ సతీమణి ఉపాసన సైతం గుర్రపు స్వారీపై ఆసక్తి పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక రేసుగుర్రంతో రేస్ సూట్‌లో ఉన్న తన పిక్చర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేశారు. తక్షణ నమ్మకం, విశ్వాసం, భయం, ప్రేమ, గౌరవం అనే అనుబంధాన్ని ఆ గుర్రంతో పంచుకుంటున్నానంటూ ఆ పిక్చర్స్‌కు కాప్షన్ జోడించారు ఉపాసన. దీంతో మెగా హీరోలకే కాకుండా ఆ ఫ్యామిలీలోకి కోడళ్లుగా వస్తున్నవారికి కూడా హార్స్ రైడింగ్‌పై ఇష్టం కలుగుతున్నట్లు అర్థమవుతోంది.2012 జూన్ 14న చరణ్, ఉపాసన వివాహం జరిగింది.