English | Telugu

బాక్సింగ్ నేప‌థ్యంలో త్రినాథ రావ్ చిత్రం?

మేం వ‌య‌సుకు వ‌చ్చాం (2012) చిత్రంతో తెలుగునాట ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేశాడు న‌క్కిన త్రినాథ రావ్. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మంచి మార్కులు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. ఆపై ప్రియ‌త‌మా నీవ‌చ‌ట కుశ‌ల‌మా, నువ్వ‌లా నేనిలాతో ప‌ల‌క‌రించినా విజ‌యాలు ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో.. ఉయ్యాలా జంపాలా జోడీ రాజ్ త‌రుణ్, అవికాగోర్ కాంబోలో రూపొందించిన‌ సినిమా చూపిస్త మావ‌తో సూప‌ర్ హిట్ అందుకున్నాడు. అనంత‌రం నాని, కీర్తి సురేష్ జోడీగా తెర‌కెక్కించిన నేను లోక‌ల్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ చూశాడు. ఆ నెక్స్ట్ రామ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన హ‌లో గురూ ప్రేమ కోస‌మే ఫ‌ర్లేద‌నిపించింది.

హ‌లో.. విడుద‌లై రెండేళ్ళు దాటినా ఈ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ నుంచి మ‌రో సినిమా రాలేదు. విక్ట‌రీ వెంక‌టేష్, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో త్రినాథ రావ్ నెక్స్ట్ వెంచ‌ర్స్ ఉంటాయ‌ని వినిపించినా అవి వార్త‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో.. త్రినాథ రావ్ త‌దుప‌రి చిత్రంపై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. యువ క‌థానాయ‌కుడు హ‌వీష్ తో బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట న‌క్కిన‌. అంతేకాదు.. ఈ చిత్రాన్ని హ‌వీష్ తండ్రి, నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.