English | Telugu

సుకుమార్‌ కాంపౌండ్‌ నుంచి డైరెక్టర్లుగా మరో ఇద్దరు.. కన్‌ఫర్మ్‌ అయిన సినిమాలు!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫేమస్‌ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారంతా ఒకప్పుడు అసిస్టెంట్‌ డైరెక్లర్టుగా, అసోసియేట్స్‌గా, కోడైరెక్టర్లు పనిచేసినవారే. తమ దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేస్తున్న వారు డైరెక్టర్లుగా మారడానికి కొందరు టాప్‌ డైరెక్టర్లు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. పాత రోజుల్లోని డైరెక్టర్ల విషయానికి వస్తే.. ఆదుర్తి సుబ్బారావు వంటి డైరెక్టర్లు తమ దగ్గర డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఎంతో మంది డైరెక్టర్లుగా మారడానికి దోహదపడ్డారు. వారిలో కె.విశ్వనాథ్‌ ఒకరు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర ఎన్నో సినిమాలకు పనిచేశారు విశ్వనాథ్‌. ఆయన ప్రోత్సాహంతోనే డైరెక్టర్‌గా మారారు. ఇక దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కాంపౌండ్‌ నుంచి ఎంతోమంది టాలెంటెడ్‌ డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి వంటి డైరెక్టర్లు దాసరి కాంపౌండ్‌ నుంచి వచ్చినవారే. ఆ తర్వాతి కాలంలో వీరు ఎలాంటి బ్లాక్‌బస్టర్స్‌ చేశారో అందరికీ తెలిసిందే.

ఇప్పటి తరం దర్శకుల్ని తీసుకుంటే సుకుమార్‌ దగ్గర పనిచేసిన అనేక మంది ఇప్పటికే డైరెక్టర్లుగా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సూర్యప్రతాప్‌, బుచ్చిబాబు, శ్రీకాంత్‌ ఓదెల, కార్తీక్‌ దండు వంటి దర్శకులు సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్లుగా తమదైన శైలిలో సినిమాలు చేసి మెప్పించారు. ఇప్పుడు సుకుమార్‌ కాంపౌండ్‌ నుంచి మరో ఇద్దరు దర్శకులు మెగా ఫోన్‌ పట్టుకోబోతున్నారు. అందులో ఒకరు వీర కాగా, మరో దర్శకురాలు మాధురి. వీరిద్దరూ డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా వీర దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని కొద్ది రోజుల క్రితమే వార్తలు వచ్చాయి.

తాజాగా సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా మాధురి దర్శకత్వంలో సుకుమార్‌ ఒక ప్రాజెక్ట్‌ ఓకే చేయించినట్టు తెలుస్తోంది. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలూ సుకుమార్‌ రైటింగ్స్‌ బేనర్‌పై సుకుమార్‌ నిర్మిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తోపాటు మరో బేనర్‌ కూడా ఈ చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకుంటుంది. అయితే సుకుమార్‌ రైటింగ్స్‌ మాత్రం క్రియేటివ్‌ అంశాల్లోనే భాగస్వామ్యం వహిస్తుందని తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పుడున్న టాప్‌ డైరెక్టర్స్‌లో తన దగ్గర పనిచేసిన శిష్యులను సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్లుగా మార్చిన ఘనత ఖచ్ఛితంగా సుకుమార్‌కే దక్కుతుంది.