English | Telugu

రావిపూడికి సంక్రాంతి.. అబ్బవరంకి దీపావళి...

సినీ పరిశ్రమలో సెంటిమెంట్ లు ఎక్కువ. దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ కూడా అలాంటిదే. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'F2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించాయి. ఆయన నెక్స్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' కూడా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో అనిల్ రావిపూడికి సంక్రాంతి డైరెక్టర్ అనే పేరు పడిపోయింది. అదే బాటలో ఇప్పుడు కిరణ్ అబ్బవరంకి కూడా దీపావళి హీరో అనే పేరు పడుతోంది. (Kiran Abbavaram)

2024 దీపావళికి కిరణ్ అబ్బవరం నటించిన 'క' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ 2025 దీపావళికి 'కె ర్యాంప్'(K-Ramp)తో ప్రేక్షకులను పలకరించాడు కిరణ్. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటికే మెజారిటీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని వసూళ్లతో సత్తా చాటడం ఖాయమనిపిస్తోంది. నిజానికి ఈ దీపావళికి మరో మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఆ పోటీని తట్టుకొని 'కె ర్యాంప్' హిట్ స్టేటస్ దక్కించుకోవడం అనేది మామూలు విషయం కాదు. గత దీపావళికి 'క'తో, ఈ దీపావళికి 'కె ర్యాంప్'తో కిరణ్ హిట్స్ అందుకోవడంతో.. దీపావళి హీరో అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.